ODI World Cup : తొలి మ్యాచ్‌లోనే పెద్ద జట్టుతో ఆడటం.. ఎప్పుడూ ప్రయోజనకరమే : సునీల్‌ గావస్కర్‌

ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లోనే పెద్ద టీమ్‌తో తలపడం ఏ జట్టుకైనా ప్రయోజకరంగా ఉంటుందని మాజీ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌(Sunil Gavaskar) వివరించాడు.

Updated : 02 Jul 2023 18:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  ఈ ఏడాది చివర్లో భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌(ODI World Cup 2023) కోసం ఐసీసీ(ICC) ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మెగాటోర్నీకి ఇంకా మూడు  నెలల సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ఆయా జట్లు సమాయత్తమవుతున్నాయి. పిచ్‌ పరిస్థితులేంటి.. ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో షెడ్యూల్‌పై మాజీ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌(Sunil Gavaskar) స్పందించాడు.

గత ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ మధ్య తొలి మ్యాచ్‌(ENG vs NZ)తో అక్టోబర్‌ 5న ఈ వరల్డ్‌ కప్‌ ప్రారంభం కానుంది. ఇక టీమ్‌ఇండియా చెన్నై వేదికగా 8న ఆస్ట్రేలియా(IND vs AUS)తో మ్యాచ్‌తో  తన ప్రపంచకప్‌ పోరును ప్రారంభించనుంది. అయితే.. తొలి మ్యాచ్‌లోనే పెద్ద జట్టుతో తలపడటం రోహిత్‌ సేనకు అడ్వాంటేజ్‌గా మారుతుందని గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. ఒకవేళ ఆతిథ్య జట్టు తొలి మ్యాచ్‌లోనే ఓటమిపాలైనప్పటికీ.. తప్పులు సరిదిద్దుకునే అవకాశమూ ఉంటుందని పేర్కొన్నాడు.

‘ఆఖర్లో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో.. ఆస్ట్రేలియాలాంటి పెద్ద జట్టుతో తలపడటం ఎంతో కష్టం. అందుకే అలాంటి జట్టుతో తొలి మ్యాచ్‌లోనే తలపడితే మన జట్టుకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నేను భావిస్తున్నా. ఒకవేళ అనుకున్న ఫలితం రాకున్నా ఫర్వాలేదు. తర్వాత అవకాశాలు ఉంటాయి. బలహీనమైన జట్టుతో మీరు ఆడొచ్చు. అప్పుడు ఏం చేయాలో.. ఎంత మార్జిన్‌తో గెలవాలో మీకు తెలుస్తుంది’ అని సన్నీ వివరించాడు. ఇక పెద్ద టీమ్‌పై గెలిస్తే.. ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని తెలిపాడు.

‘1983 ప్రపంచకప్‌లో మేం తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్‌ ఛాంపియన్‌ వెస్టిండీస్‌తో తలపడ్డాం. గెలిచాం. అప్పటి వరకూ మా ప్రదర్శన అంత గొప్పగా ఏమీ లేకపోవడంతో ఈ విజయం మాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది’ అని గావస్కర్‌ వెల్లడించాడు.

ఈ వన్డే ప్రపంచకప్‌లో భారత్‌.. తన చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్‌(IND vs PAK)తో అహ్మదాబాద్‌ వేదికగా అక్టోబర్‌ 15న తలపడనున్న విషయం తెలిసిందే. నవంబర్‌ 19న ఇదే అహ్మదాబాద్‌ వేదికగా ఫైనల్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని