Ashwin: ఎప్పుడైతే అలా అనిపిస్తుందో.. ఆ క్షణమే ఆటను వదిలేస్తా: అశ్విన్‌

టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడు అశ్విన్‌ (Ashwin) కూడా జట్టులో స్థానం దక్కించుకోవడానికి ఒకదశలో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అలాంటి స్టేజ్‌ను దాటి వచ్చిన తాను ఇప్పుడు ఎలాంటి పరిస్థితినైనా అలవోకగా ఎదుర్కోగలని నమ్మకంగా చెప్పాడు.

Published : 02 Dec 2023 19:25 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమ్‌ఇండియా (IND vs SA) సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌ ఎంపికయ్యాడు. పరిమిత ఓవర్ల సిరీస్‌లకు కాకుండా టెస్టులకు మాత్రమే అతడిని బీసీసీఐ ఎంపిక చేసింది. ఇటీవల ముగిసిన వరల్డ్ కప్‌ స్క్వాడ్‌లో ఉన్నప్పటికీ.. కేవలం ఒక్క మ్యాచ్‌లోనే అశ్విన్‌ ఆడాడు. అసలు అతడు మెగా టోర్నీకి ఎంపికవుతాడని ఎవరూ అనుకోలేదు. అయితే, గత నాలుగైదేళ్ల నుంచి జట్టులో సుస్థిరమైన స్థానం దక్కించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్లిష్టపరిస్థితులను ఎదుర్కొని వచ్చిన తాను మానసికంగా దృఢంగా మారేందుకు నిపుణుల సాయం కూడా తీసుకున్నట్లు అశ్విన్‌ వెల్లడించాడు. టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు ఎస్ బద్రినాథ్‌తో చిట్‌చాట్‌లో అశ్విన్‌ పలు విషయాలను వెల్లడించాడు.

‘‘నేను క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు ఇబ్బంది పడకుండా తట్టుకోగల సమర్థుడినేమీ కాదు. గత నాలుగైదేళ్లు నా కెరీర్‌లో గడ్డు రోజులను చవిచూశా. దీంతో మానసికంగా బలంగా మారేందుకు నిపుణులు, ఇతరుల సాయం కూడా తీసుకున్నా. అప్పుడే ఇలాంటి పరిస్థితులు ఎన్ని వచ్చినా తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలని భావించా. నేను ఇప్పుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నా. క్రికెటర్‌గా వచ్చే ఐదేళ్లు ఎలా ఉండాలనే దానిపై ఎప్పటికప్పుడు సిద్ధమవుతా. దాని కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటా. ఒకదశలో బ్యాటింగ్‌లోనూ నా భాగస్వామ్యం అవసరమని భావించినప్పుడు.. యూఎస్‌ఏ వెళ్లి బేస్‌బాల్‌తో కూడా ప్రాక్టీస్‌ చేశా. ఉదయాన్నే లేచి బ్యాటింగ్, బౌలింగ్‌ సాధన చేయడం చికాకుగా అనిపించడం.. ఆడే ఆసక్తి ఎప్పుడైతే కోల్పోతానో ఆ క్షణమే గేమ్‌కు వీడ్కోలు చెబుతా. అందరికీ ధన్యవాదాలు చెప్పేసి జీవితంలో కొత్త అధ్యాయానికి తెరతీస్తా’’ అని అశ్విన్‌ వ్యాఖ్యానించాడు. 

ఫైనల్‌లో ఎందుకు ఆడించలేదనేది నాకర్థమైంది

ఆసీస్‌తో జరిగిన వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌లో రవిచంద్రన్ అశ్విన్‌కు అవకాశం వస్తుందని చాలా మంది భావించారు. కానీ, టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం మార్పులు చేయకుండా సెమీస్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగాడు. ఈ క్రమంలో తనను పక్కన పెట్టడంపై అర్థం చేసుకున్నట్లు అశ్విన్‌ తెలిపాడు. ‘‘వ్యక్తిగతంగా నేను ఎందుకు ఫైనల్‌లో ఆడలేదు? అనే దానిపై ఆందోళన చెందుతాం. ఆ తర్వాతే జట్టు కూర్పు గురించి ఆలోచిస్తాం. కానీ, కెప్టెన్‌కు మాత్రం కాంబినేషన్‌ చాలా కీలకం. దాని గురించి వందలసార్లు ఆలోచిస్తారు. జట్టుకు ఏది మంచిదనేదే తొలి ప్రాధాన్యం. అందుకే, కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాసెస్‌ను అర్థం చేసుకున్నా. ఫైనల్‌లో ఆడటం ఎప్పటికీ ప్రత్యేకమే. ఈ మ్యాచ్‌ తర్వాత చాలా మంది సందేశాలు పంపారు. ఎక్కువగా సమాధానం కూడా ఇవ్వలేదు. ఒక దశలో ఫోన్‌ను పక్కన పెట్టేశా. అవకాశం వస్తే ఆడేందుకు ఎప్పుడూ సన్నద్ధంగా ఉంటా’’ అని అశ్విన్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని