ICC: కమిన్స్‌ నాలుగేళ్ల నంబర్‌ 1 ర్యాంక్‌ మిస్‌.. దూసుకొచ్చిన భారత స్పిన్‌ద్వయం

ఆసీస్‌పై (IND vs AUS) అద్భుతమైన ప్రదర్శనతో భారత స్టార్‌ స్పిన్నర్లు (Team India) జడేజా, అశ్విన్‌ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో (ICC Rankigs) దూసుకొచ్చారు.

Published : 22 Feb 2023 16:15 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా ఆటగాళ్లు దూసుకొచ్చారు. అలాగే దాదాపు నాలుగేళ్లపాటు టెస్టు బౌలింగ్‌ విభాగంలో నంబర్‌వన్‌ ర్యాంకర్‌గా ఉన్న ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (858 పాయింట్లు) కిందికి పడిపోయాడు. రెండు స్థానాలు దిగజారడంతో ప్రస్తుతం కమిన్స్‌ మూడో ర్యాంక్‌లో నిలిచాడు. ఇంగ్లాండ్‌ పేసర్ జేమ్స్ అండర్సన్‌ (866) అగ్రస్థానం దక్కించుకొన్నాడు. అండర్సన్ తర్వాత టీమ్‌ఇండియా టాప్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ (864) రెండో ర్యాంక్‌లో నిలిచాడు. ఆసీస్‌తో మూడో టెస్టులోనూ రాణిస్తే టాప్‌ ర్యాంక్‌ అశ్విన్‌ సొంతమయ్యే అవకాశం ఉంది. 

గత ఆరు నెలల నుంచి క్రికెట్‌కు దూరమైన భారత పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా (795) ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆసీస్‌తో రెండో టెస్టులో పది వికెట్లు తీసిన రవీంద్ర జడేజా (763) ఏకంగా ఏడు స్థానాలను మెరుగుపర్చుకొని 9వ స్థానంలో నిలిచాడు. 2019 తర్వాత టాప్‌ -10 లోకి రావడం ఇదే మొదటిసారి. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో భారత స్పిన్నర్లకు తిరుగులేకుండా పోయింది. జడేజా (460), రవిచంద్రన్ అశ్విన్ (376) తొలి రెండు స్థానాల్లో ఉండగా.. యువ బౌలర్‌ అక్షర్ పటేల్‌ (283) ఐదో ర్యాంక్‌కు చేరాడు. బ్యాటింగ్‌ విభాగంలో టాప్‌ -10 లిస్ట్‌లో ఇద్దరు భారత బ్యాటర్లు మాత్రమే ఉన్నారు. రోడ్డు ప్రమాదానికి గురై విశ్రాంతి తీసుకొంటున్న రిషభ్‌ పంత్ (781), భారత కెప్టెన్ రోహిత్ శర్మ (777) వరుసగా ఆరేడు స్థానాల్లో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని