IND vs AUS: మ్యాక్స్‌వెల్‌ మెరుపు సెంచరీ.. భారత్‌కు షాక్‌

భారత్‌తో జరిగిన మూడో టీ20 ఆస్ట్రేలియా విజయం సాధించింది. 

Updated : 29 Nov 2023 00:02 IST

గువాహటి: హ్యాట్రిక్‌ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలనుకున్న టీమ్‌ఇండియాకు ఆస్ట్రేలియా షాక్ ఇచ్చింది. చివరి బంతికి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఆసీస్‌దే పైచేయి అయింది. ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో మ్యాచ్‌(India vs Australia)లో ఆసీస్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాక్స్‌వెల్ (Maxwell) (104*; 48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపు సెంచరీతో చెలరేగి ఆస్ట్రేలియాను గెలిపించాడు. భారత్‌ నిర్దేశించిన 223 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

చివరి ఓవర్‌లో నరాలు తెగేంత ఉత్కంఠ  

చివరి ఓవర్‌లో ఆసీస్ విజయానికి 21 పరుగులు అవసరం కాగా.. మొదటి రెండు బంతుల్లో 5 పరుగులు వచ్చాయి. దీంతో సమీకరణం 4 బంతుల్లో 16గా మారింది. ఈ దశలో మ్యాక్స్‌వెల్ మూడో బంతికి సిక్స్, నాలుగో బంతికి ఫోర్ బాదాడు. ఐదో బంతికి కూడా మ్యాక్సీ బౌండరీ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. మ్యాక్స్‌వెల్ ఫోర్ బాదడంతో ఆసీస్‌ విజయం సాధించింది.

లక్ష్యఛేదనకు దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (35; 18 బంతుల్లో 8 ఫోర్లు), ఆరోన్ హార్డీ (16; 12 బంతుల్లో 3 ఫోర్లు) శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ జోడీని అర్ష్‌దీప్‌ సింగ్ విడదీశాడు. షాట్‌ ఆడే క్రమంలో హార్డీ.. ఇషాన్‌ కిషన్‌కు చిక్కాడు. కాసేపటికే హెడ్‌ను అవేశ్ ఖాన్, జోష్‌ ఇంగ్లిస్ (10)ని రవి బిష్ణోయ్ వెనక్కి పంపారు. మరోవైపు క్రీజులో ఉన్న మ్యాక్స్‌వెల్ దూకుడుగా ఆట మొదలుపెట్టాడు. ప్రసిద్ధ్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌లో రెండు సిక్స్‌లు, రెండు సిక్స్‌లు బాదాడు. తర్వాత మ్యాక్సీ కాస్త దూకుడు తగ్గించాడు. ఇంతలోనే స్టాయినిస్ (17), టిమ్ డేవిడ్ (0) వరుస ఓవర్లలో ఔట్‌ కావడంతో ఆసీస్ ఒత్తిడిలో పడింది. అయితే మ్యాక్స్‌వెల్ మళ్లీ జోరందుకోవడంతో లక్ష్యం కరుగుతూ వచ్చింది. చివరి 12 బంతుల్లో 43 పరుగులు అవసరం కాగా.. 19 ఓవర్‌లో మాథ్యూ వేడ్ (28*; 16 బంతుల్లో) రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదాడు. ఈ ఓవర్‌లో మొత్తం 22 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్‌లో మ్యాక్స్‌వెల్ పని పూర్తి చేశాడు. 

రుతురాజ్ మెరుపులు 

భారత్ ఇన్నింగ్స్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది రుతురాజ్ ఇన్నింగ్స్‌ గురించే. యశస్వి జైస్వాల్ (6), ఇషాన్ కిషన్‌ (0) విఫలం కావడంతో మొదట్లో నెమ్మదిగా ఆడిన గైక్వాడ్ తర్వాత క్రమంగా దూకుడు పెంచాడు. మొదటి 22 బంతుల్లో 22 పరుగులు చేసిన రుతురాజ్ తర్వాత ఎదుర్కొన్న 35 బంతుల్లో 100 పరుగులు రాబట్టాడు. హార్డీ వేసిన 18 ఓవర్‌లో రుతురాజ్‌ మూడు సిక్సర్లు, ఓ బౌండరీ బాదేశాడు. చివరి ఓవర్‌లో అతడు ఏకంగా 27 పరుగులు సాధించాడు. తొలి బంతికి సిక్స్ బాది టీ20ల్లో తొలి సెంచరీ నమోదు చేసుకున్న గైక్వాడ్.. తర్వాత రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లు బాదాడు. సూర్యకుమార్ (39; 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్ వర్మ (31*; 24 బంతుల్లో 4 ఫోర్లు) చెలరేగి ఆడారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని