PAK vs AUS: ‘నీ భర్త పాకిస్థాన్‌ పర్యటనకు వస్తే.. తిరిగి ఆస్ట్రేలియా వెళ్లడు’

ప్రస్తుతం పాకిస్థాన్‌ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ ఆష్టన్‌ అగర్‌కు చంపేస్తామనే బెదిరింపులు వచ్చాయి. అతడి భార్య మెడ్‌లీన్‌ ఇన్‌స్టాగ్రామ్‌కు గుర్తు తెలియని వ్యక్తుల...

Published : 01 Mar 2022 09:37 IST

ఆసీస్‌ ఆటగాడి భార్యకు బెదిరింపులు

(Photo: Ashton Agar Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం పాకిస్థాన్‌ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ ఆష్టన్‌ అగర్‌ను చంపేస్తామనే బెదిరింపులు వచ్చాయి. అతడి భార్య మెడ్‌లీన్‌ ఇన్‌స్టాగ్రామ్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈ హెచ్చరికలు వచ్చాయి. అయితే, వీటిని ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డులు తోసిపుచ్చాయి. ఆ హెచ్చరికలు నిజమైనవి కావని, ఎవరో కావాలనే ఇలా చేశారని తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించాయి. దీంతో ఆస్ట్రేలియా ఆటగాడికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

 ఆస్ట్రేలియా 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి ఇప్పుడు పాకిస్థాన్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆష్టన్‌కు బెదిరింపులు రావడంతో ఆసీస్‌ జట్టు ఒకింత కలవరపాటుకు గురైంది. ‘మెడ్‌లీన్‌ మీరు బాగున్నారని ఆశిస్తున్నా. అయితే, మీకో హెచ్చరిక.. మీ భర్త ఆష్టన్‌ అగర్‌ పాకిస్థాన్‌ పర్యటనకు వస్తే.. అతడు తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లడు. ఈ పర్యటనకు వస్తే మీ పిల్లలు తండ్రిని కోల్పోతారు. మావాళ్లు మీ భర్తను చంపేస్తారు’ అని ఆమెకు మెసేజ్‌లు పంపారు. ఈ విషయాన్ని మెడ్‌లీన్‌ వెంటనే ఆసీస్‌, పాక్‌ క్రికెట్‌ బోర్డులకు తెలియజేయగా భద్రతా అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. అయితే, ఆ బెదిరింపులు నిజమైనవి కాదని తేలిందన్నారు. ఒక ఫేక్‌ అకౌంట్‌ నుంచే ఆ సందేశాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ పర్యటనలో పాకిస్థాన్‌తో ఆసీస్‌ మూడు టెస్టులు, మూడు వన్డేలతో పాటు ఒక టీ20 మ్యాచ్‌లో తలపడనుంది. మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 5 వరకు ఈ పర్యటన కొనసాగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని