BCCI : విదేశీ లీగుల్లో ధోనీ.. బీసీసీఐ ఏమందంటే..?

ప్రస్తుతం ఎక్కడ చూసినా టీ20 లీగ్‌ల హంగామా.. ఇప్పటికే భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లా, ఆసీస్‌ వంటి దేశాల్లో లీగ్‌లు ఉన్న విషయం తెలిసిందే. యూఏఈ, దక్షిణాఫ్రికాలోనూ...

Published : 17 Aug 2022 14:35 IST

(ఫొటో సోర్స్‌: రాజీవ్ శుక్లా ట్విటర్)

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రస్తుతం ఎక్కడ చూసినా టీ20 లీగ్‌ల హంగామా.. ఇప్పటికే భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లా, ఆసీస్‌ వంటి దేశాల్లో లీగ్‌లు ఉన్న విషయం తెలిసిందే. యూఏఈ, దక్షిణాఫ్రికాలోనూ ఇలాంటి లీగ్‌ల జోరు ప్రారంభమైంది. అయితే విదేశీ క్రికెటర్లు భారత టీ20 లీగ్‌లో ఆడొచ్చు.. కానీ టీమ్‌ఇండియా ఆటగాళ్లు మాత్రం ఇతర లీగుల్లో ఆడేందుకు అనుమతి లేదు. అంతేకాకుండా ఆ లీగుల్లోని జట్లతో ఆటగాళ్లకు ఎలాంటి అనుబంధం ఉండకూడదు. కానీ ఇతర లీగుల్లోని జట్లను భారత ఫ్రాంచైజీలు కొనుగోలు చేయడం విశేషం. దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లోని ఓ జట్టును చెన్నై ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. దీంతో ఆ జట్టుకు టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సారథి ఎంఎస్ ధోనీ మెంటార్‌ లేదా కోచ్‌గా వెళ్తాడనే వార్తలు హల్‌చల్‌ చేశాయి. కానీ భారత క్రికెట్‌తో అన్ని సంబంధాలను తెంచుకుంటేనే ఇతర లీగుల్లో ఎలాంటి పాత్రనైనా పోషించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే బీసీసీఐ అనుమతి మంజూరు చేసినప్పుడే ఇతర లీగ్‌ల్లో ఆడాలి.

ఈ నేపథ్యంలో విదేశీ లీగుల్లో ఆడేందుకు భారత క్రికెటర్లకు అనుమతి ఇవ్వాలని పలు దేశాల నుంచి బీసీసీఐకి విజ్ఞప్తులు భారీగా వచ్చాయి. ధోనీ వెళ్తాడనే వార్తలు, విజ్ఞప్తులపై బీసీసీఐ మరోసారి స్పష్టతనిచ్చింది. ఆటగాళ్లకు అనుమతిచ్చే విధానం బోర్డు వద్ద లేదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. ‘‘విదేశాల్లోని లీగుల్లో ఆడేందుకు మా ఆటగాళ్లకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. దీనిపై మాకంటూ స్పష్టమైన విధానం ఉంది. భారత టీ20 లీగ్‌ అతి పెద్ద టోర్నమెంట్. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ టీమ్‌ఇండియా ఆటగాళ్లను విదేశీ లీగుల్లో ఆడేందుకు అనుమతినివ్వం’’ అని శుక్లా స్పష్టం చేశారు. దక్షిణాఫ్రికా, ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డులు వచ్చే ఏడాది టీ20 లీగ్‌లను నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని