
ఐపీఎల్: ‘ఓపెనర్లుగా రోహిత్-రితికా?’
ఇంటర్నెట్‌డెస్క్: ఐపీఎల్ పదమూడో సీజన్ ప్రారంభం కాకముందే ‘ సందడి’ మొదలైంది. ప్రత్యర్థులకు సరదా కవ్వింపులు, సహచర ఆటగాళ్ల పోస్టుల్లో ఫన్నీ కామెంట్లతో ప్రాంఛైజీలు, ఆటగాళ్లు అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా మంగళవారం కేకేఆర్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఆటగాళ్లు మహమ్మారి కరోనా బారిన పడకుండా జట్టు యాజమాన్యాలు ‘బయోబబుల్’ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని భావిస్తున్నాయి. అయితే కోల్‌కతా నైట్ రైడర్స్ మాత్రం తమకి ఎనిమిదేళ్ల క్రితమే బయోబబుల్ అనుభవం ఉందని సరదాగా ట్వీట్ చేసింది. ఐపీఎల్-2012లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ప్లాస్టిక్ బబుల్‌లో ఉన్న కోల్‌కతా ఆటగాళ్ల చిత్రాన్ని పోస్ట్ చేసింది. ‘దీన్ని ఎవరైనా బయోసెక్యుర్ బబుల్ అంటారా? మాకు దీనిలో ఎంతో అనుభవం ఉంది’ అని వ్యాఖ్య జత చేసింది.
మరోవైపు ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్పిన్నర్ చాహల్ సరదాగా కామెంట్ చేశాడు. తన భార్య రితికాతో వ్యాయామం చేస్తున్న వీడియోను రోహిత్ ఇన్‌స్టాలో మంగళవారం అభిమానులతో పంచుకున్నాడు. దీనికి చాహల్ ‘ఐపీఎల్‌లో ఈ సారి వదినతో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్నావా?’ అని ఫన్నీగా కామెంట్ చేశాడు. పోస్ట్ చేసిన కొద్దిక్షణాల్లోనే ఈ వీడియోను లక్షల మంది వీక్షించడం విశేషం. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పేసర్ మహమ్మద్ షమి క్వారంటైన్‌లో కసరత్తులతో శ్రమిస్తున్నాడు. అతడు వ్యాయామం చేసిన వీడియోను పంజాబ్ జట్టు తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేసింది. దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.