Suryakumar Yadav: ‘వన్డే ప్రపంచకప్‌ జట్టులో సూర్యకుమార్‌ తప్పకుండా ఉంటాడు’

సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) వచ్చే వన్డే ప్రపంచకప్‌ జట్టులో తప్పకుండా చోటు దక్కించుకుంటాడని భారత మాజీ సెలక్టర్ శరణ్‌దీప్‌ సింగ్ అభిప్రాయపడ్డాడు. 

Published : 29 Mar 2023 23:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో సూర్యకుమార్‌ యాదవ్ (Suryakumar Yadav) ఘోరంగా విఫలమయ్యాడు. మూడు వన్డేల్లోనూ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగి విమర్శలపాలయ్యాడు. దీంతో అతడిని వన్డేల్లోంచి తప్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే, టీమ్‌ఇండియా మాజీ సెలక్టర్ శరణ్‌దీప్‌ సింగ్‌ సూర్యకుమార్‌కు మద్దతుగా నిలిచాడు. సూర్యకుమార్‌ అద్భుతమైన ఆటగాడని, అతను మళ్లీ పుంజుకుని ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌  జట్టులో సూర్యకుమార్‌ తప్పకుండా చోటు దక్కించుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

‘‘సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్రికెటర్. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల్లో పరుగుల ఖాతా తెరవకుండా ఔటైనందుకు అతనికి బాధగా ఉంది. కానీ, తిరిగి పుంజుకునే సత్తా సూర్యకు ఉంది. నేను తప్పకుండా అతడిని వన్డే ప్రపంచకప్‌ జట్టులో చూస్తాను. మేం సెలక్టర్లుగా ఉన్నప్పుడు ఒక ప్రణాళిక, జట్టును కలిగి ఉన్నాం. మేం చివరి వరకు ఆటగాళ్లకు మద్దతు ఇచ్చాం. సూర్యకుమార్‌ యాదవ్‌ గతేడాది అద్భుతంగా ఆడాడు. అతను దేశవాళీ క్రికెట్‌లో చాలా పరుగులు చేసి జాతీయ జట్టులోకి వచ్చాడు. సూర్య విషయంలో ఎవరైనా నా అభిప్రాయం అడిగితే.. నేను కచ్చితంగా అతనికి మరొక అవకాశం ఇస్తాను’’ అని శరణ్‌దీప్‌ సింగ్‌ వివరించాడు. ప్రస్తుతం సూర్యకుమార్‌ యాదవ్‌ ఐపీఎల్‌-16 సీజన్‌పై దృష్టిపెట్టాడు. అతడు ముంబయి ఇండియన్స్‌కు కీలక ఆటగాడిగా ఉన్న సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని