MS Dhoni: ఐపీఎల్‌ ఎదుగుదలలో ధోనీ కీలక పాత్ర: రవిశాస్త్రి

టీమ్‌ఇండియాను అద్భుతంగా నడిపించిన ఎంఎస్ ధోనీ (MS Dhoni).. ఐపీఎల్‌లోనూ (IPL) తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. సీఎస్‌కేను ధోనీ నాలుగుసార్లు విజేతగా నిలిపాడు. ప్రస్తుత సీజన్‌లోనూ ధోనీ ఆడుతుంటే మైదానమంతా హోరెత్తిపోతోంది.

Published : 22 Apr 2023 01:42 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) గత పదిహేను సంవత్సరాలుగా అప్రతిహతంగా సాగిపోతోంది. ప్రస్తుతం ఐపీఎల్‌ 16వ సీజన్‌ కొనసాగుతోంది. తొలి సీజన్‌ నుంచి ఆడుతున్న అతికొద్ది ఆటగాళ్లలో కెప్టెన్‌ కూల్‌ ‘ఎంఎస్ ధోనీ’ (MS Dhoni) ఉన్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌కు (CSK) సారథ్య బాధ్యతలు స్వీకరించి విజయవంతంగా జట్టును నడిపిస్తున్న ధోనీ ఇప్పటి వరకు నాలుగు టైటిళ్లను అందించాడు. మరోసారి చెన్నైను విజేతగా నిలిపేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో.. ధోనీపై టీమ్‌ఇండియా మాజీ ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌ సీజన్‌లో 9సార్లు సీఎస్‌కే ఫైనల్‌కు దూసుకెళ్లగా.. 11 ప్లేఆఫ్స్‌ను చెన్నై జట్టు ఆడింది. 

‘‘ఐపీఎల్‌ వృద్ధిలో ఎంఎస్ ధోనీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతడు జట్టులో ఉంటే చాలు.. అభిమానులు భారీ స్థాయిలో వచ్చేస్తున్నారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీని ఓ బ్రాండ్‌గా మార్చాడు. ఫ్యాన్స్‌ అతడిని ‘తలా’గా పిలుచుకునేలా చేశాడు. చెన్నై మైదానంలో అడుగు పెడితే అభిమానుల కోలాహలం తారస్థాయిలో ఉంటుంది. ఐపీఎల్‌లో ఇలాంటి ఆటగాడిని వర్ణించడానికి తగిన మాటలు కూడా లేవు. కెప్టెన్‌గా నాలుగు టైటిళ్లను అందించాడు. అతడి ముద్ర అసాధారణం’’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. ఇటీవలే ఎంఎస్ ధోనీ సీఎస్‌కే తరఫున 200వ మ్యాచ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని