DK: అతడే భవిష్యత్తులో ఐపీఎల్‌ బిగ్‌ స్టార్‌: దినేశ్‌ కార్తిక్‌

కుర్రాళ్లలోని ప్రతిభను బయటకు తేవడంతోపాటు వారికి ఆడే అవకాశాలను కల్పిస్తున్న లీగ్ ఐపీఎల్ (IPL 2023). అయితే, ఈసారి కొన్ని జట్లలోని యువ క్రికెటర్లు అదరగొట్టేస్తున్నారు. వారిలో అత్యుత్తమం ఎవరనే దానిపై సీనియర్‌ ఆటగాళ్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. 

Published : 01 May 2023 01:48 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో (IPL 2023) కొంతమంది కుర్రాళ్లు అదరగొట్టేస్తున్నారు. సన్‌రైజర్స్ నుంచి అభిషేక్ శర్మ, కోల్‌కతా ఆటగాడు రింకూ సింగ్‌, రాజస్థాన్‌ ఓపెనర్ యశస్వి జైస్వాల్, సీఎస్‌కే ఆటగాడు శివమ్‌ దూబె.. ఇలా తమ సత్తా ఏంటో నిరూపించుకుంటున్నారు. ఈ క్రమంలో వీరిలో ఎవరు బిగ్‌ స్టార్‌గా మారతారని అభిమానుల్లో తలెత్తిన అనుమానాలకు టీమ్‌ఇండియా ప్రస్తుత, మాజీ ఆటగాళ్లు స్పందించారు. భారత సీనియర్‌ ఆటగాడు దినేశ్‌ కార్తిక్‌ అయితే తాను యశస్వి జైస్వాల్ వైపే మొగ్గు చూపుతానని చెప్పాడు. సురేశ్‌ రైనా కూడా యశస్వి ప్రతిభను ప్రశంసించాడు. 

రాజస్థాన్‌ రాయల్స్‌ యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ భవిష్యత్తులో టాప్‌ ఆటగాడిగా మారతాడని దినేశ్‌ కార్తిక్‌ తెలిపాడు. యశస్వి ఈ సీజన్‌లో 8 మ్యాచుల్లోనే 304 పరుగులు సాధించాడు. అతడి స్ట్రైక్‌రేట్ 147.57 కావడం విశేషం. రాజస్థాన్‌ రాయల్స్‌ 2020 వేలంలో అతడిని రూ.2.4 కోట్లకు  దక్కించుకుంది.

అతడి షాట్లలో అదే ప్రత్యేకం: రైనా

‘‘యశస్వి ఆడే విధానం చాలా బాగుంది. బంతిని గమనించే తీరు నన్ను ఆకట్టుకుంది. అతడు రివర్స్‌ స్వీప్‌ ఆడితే అలాగే చూడాలనిపిస్తుంది. తన శరీరానికి దగ్గరగా బంతిని ఆడేందుకు ప్రయత్నిస్తాడు. అదెంతో నచ్చింది. పెద్దగా కదలకుండానే భారీగా షాట్లు కొట్టేయగలుగుతున్నాడు. స్వింగ్‌ అవుతున్న బంతులను కూడా చాలా బాగా ఆడుతున్నాడు. మరీ ముఖ్యంగా కవర్‌డ్రైవ్‌లను ఆడే తీరు సూపర్బ్. ఉత్తమంగా వేసే బౌలర్‌ను గౌరవించి.. చెత్త  బంతులను ఏమాత్రం ఉపేక్షించకుండా ధాటిగా ఆడేస్తాడు. తొలి ఆరు ఓవర్లలో ఓపెనర్‌ దూకుడుగా ఆడేయాలి. ఆ తర్వాత మిడిల్‌ ఓవర్లలో ఇన్నింగ్స్‌ వేగం తగ్గకుండా చూసుకోవాలి. ఇలాంటి ఐపీఎల్‌ సూపర్‌స్టార్లు భవిష్యత్తులో దేశానికి గర్వకారణమవుతారు’’ అని రైనా మెచ్చుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని