Jasprit Bumrah: బుమ్రా లేని జట్టును.. ప్రత్యర్థులు అలాగే చూస్తారు: మాజీ కోచ్‌

టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా దూరమవ్వడంపై భారత మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ స్పందించారు.

Updated : 22 Oct 2022 13:48 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా దూరం కావడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. మెగా టోర్నీలో బుమ్రా లేకపోవడం రోహిత్ సేనకు గట్టి ఎదురుదెబ్బే అని ఇప్పటికే పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ దీనిపై స్పందించారు. బుమ్రా లేని భారత జట్టును ప్రత్యర్థులు మరో కోణంలో చూస్తారని, వాళ్ల వ్యూహాలపై కూడా ఇది ప్రభావం చూపిస్తుందని అన్నారు.

‘‘నిజానికి బుమ్రా విషయంలో అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ తొలి మ్యాచ్‌లో అతడు ఆడలేదు. రెండో మ్యాచ్‌కు జట్టులో చేరాడు. ఆ తర్వాత మళ్లీ దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరమయ్యాడు. అంతకుముందు కూడా చాలా కాలం పాటు గాయాలతో జట్టుకు దూరంగానే ఉన్నాడు. అయితే, టీమిండియాకు అతడు బలం అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ప్రపంచకప్‌ టోర్నీకి అతడు లేకపోవడం భారత్‌కు పెద్ద దెబ్బే. ఎందుకంటే బుమ్రా లేని టీమిండియాను ప్రత్యర్థి జట్లు మరో కోణంలో చూస్తాయి. బుమ్రా లేని భారత బౌలింగ్‌ దళాన్ని ఎలా ఎదుర్కోవాలో వ్యూహాలు సిద్ధం చేసుకుంటాయి. అయితే, క్రీడల్లో ఒకరి నష్టం.. మరో ఆటగాడికి అవకాశం. బహుశా దీపక్‌ చహార్‌, షమీ లేదా అర్షదీప్‌ జట్టులో చేరి ప్రపంచకప్‌లో సత్తా చాటుతారని విశ్వసిస్తున్నా’’ అని ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ సంజయ్‌ బంగర్‌ వ్యాఖ్యానించారు.

టీ20 ప్రపంచకప్‌ ముంగిట టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే మోకాలి గాయంతో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా జట్టుకు దూరమవ్వగా.. వెన్ను గాయంతో బుమ్రా ఆస్ట్రేలియాకు వెళ్లలేదు. బుమ్రా స్థానంలో జట్టులోకి ఎవరిని తీసుకుంటారన్నది బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. స్టాండ్‌బైగా ఉన్న షమీకి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని