Team India: వారిద్దరి తర్వాత మూడో పేసర్‌గా మయాంక్‌ : భారత మాజీ క్రికెటర్

అద్భుతమైన బౌలింగ్‌ యాక్షన్‌తో 21 ఏళ్ల యువ పేసర్ మయాంక్‌ యాదవ్‌ సంచలనంగా మారాడు. ఐపీఎల్‌ 17వ సీజన్‌లో అత్యంత వేగవంతమైన బంతి (156.7 కి.మీ)ని విసిరాడు.

Published : 05 Apr 2024 16:55 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో అందరి నోటా ఎక్కువగా వినిపిస్తున్న పేరు మయాంక్‌ యాదవ్ (Mayank Yadav). ఈ ఎడిషన్‌లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన పేసర్‌గా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ లఖ్‌నవూ బౌలర్‌ను ఎదుర్కోడానికి స్టార్‌ క్రికెటర్లే ఇబ్బందిపడ్డారు. వేగంతోపాటు కచ్చితమైన లెంగ్త్‌తో బంతిని వేయడం అద్భుతమని సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. దీంతో ఈ కుర్రాడిని వచ్చే టీ20 ప్రపంచకప్‌ జట్టులోకి తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్లు సూచించారు. అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకొనే యాక్షన్‌తో బౌలింగ్‌ వేస్తున్నాడని.. షమీ, బుమ్రా తర్వాత మూడో పేసర్‌గా మయాంక్‌ను తీసుకోవాలని మనోజ్‌ తివారీ పేర్కొన్నాడు. వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తంచేశాడు. 

‘‘ఒకవేళ నేను అజిత్‌ అగార్కర్‌ నిర్వర్తిస్తున్న చీఫ్‌ సెలక్టర్‌ పదవిలో ఉంటే.. మయాంక్‌ను తప్పకుండా ఎంపిక చేస్తా. బుమ్రా, షమీ తొలి రెండు స్థానాల్లో ఉంటారు. ఆ తర్వాత మయాంక్‌కే ఇస్తా. అతడి బౌలింగ్‌ యాక్షన్, బంతిని వదిలే విధానం, ఫామ్‌ అద్భుతంగా ఉన్నాయి. పూర్తి నియంత్రణతో కూడిన బౌలింగ్‌ వల్ల పేస్‌ను రాబట్టగలుగుతున్నాడు. అలాంటి పేసర్‌కు పెద్ద వేదికల్లో అవకాశం కల్పిస్తే మరింత రాణించగలడనే నమ్మకం ఉంది. ఐపీఎల్‌లో ఎంతోమంది విదేశీ క్రికెటర్లు వచ్చి ఫామ్‌ను అందుకొంటున్నారు. అలాంటివారిపైనా మయాంక్‌ ఆధిపత్యం ప్రదర్శించాడు’’ అని మనోజ్‌ తివారీ వ్యాఖ్యానించాడు. జూన్‌ 1 నుంచి టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. భారత జట్టును ఇంకా బీసీసీఐ ప్రకటించలేదు.

ఐపీఎల్‌ తర్వాత భారత్‌కు ఆడేందుకు అవకాశం: సెహ్వాగ్

‘‘గతంలో ఉమ్రాన్‌మాలిక్‌ కూడా వేగంగా బంతులేసేవాడు. ఇప్పుడు మయాంక్‌ స్పీడ్‌ బౌలర్‌గా శభాష్ అనిపించుకొంటున్నాడు. వీరిద్దరికి మధ్య ప్రధాన వ్యత్యాసం.. లైన్‌ అండ్‌ లెంగ్త్‌తోపాటు బౌలింగ్‌లో కచ్చితత్వం. ఉమ్రాన్‌ ఇంకా లెంగ్త్‌ను అందుకోలేకపోతున్నాడు. ఒకవేళ వేగంగా బంతిని వేసి గతి తప్పితే మాత్రం బౌండరీలను సమర్పించుకోవాల్సి ఉంటుందని మయాంక్‌కు తెలుసు. దానిపై తీవ్రంగా శ్రమించినట్లు ఉన్నాడు. అందుకే, ఐపీఎల్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి తప్పకుండా అడుగుపెడతాడని భావిస్తున్నా. అయితే, ఫిట్‌నెస్‌ అత్యంత కీలకం. అప్పుడే జాతీయ జట్టుకు ఆడగలడు’’ అని సెహ్వాగ్ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని