AUS vs PAK : పాక్‌ భద్రతపై మాకు నమ్మకముంది: స్టీవ్‌ స్మిత్

క్రికెటర్‌ ఆస్టన్‌ అగర్‌కు ఆన్‌లైన్‌ వేదికగా బెదిరింపులు రావడంతో ...

Updated : 03 Mar 2022 15:11 IST

ఇంటర్నెట్ డెస్క్‌: క్రికెటర్‌ ఆస్టన్‌ అగర్‌కు ఆన్‌లైన్‌ వేదికగా బెదిరింపులు రావడంతో ఆస్ట్రేలియా క్రికెటర్లకు పాకిస్థాన్‌ ప్రభుత్వం భారీ భద్రతను కల్పించింది. దాదాపు 24 ఏళ్ల తర్వాత ఆసీస్‌ జట్టు పాక్‌లో పర్యటిస్తోంది. ఆస్టన్ అగర్‌కు బెదిరింపు వచ్చినప్పటికీ తమ ఆటగాళ్లందరూ భద్రంగా ఉంటామనే భావనను కలిగి ఉన్నారని ఆసీస్‌ టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్ పేర్కొన్నాడు. మార్చి 4 నుంచి రావల్పిండి స్టేడియం వేదికగా పాక్‌, ఆసీస్‌ జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. 

ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో స్మిత్ మాట్లాడుతూ పాక్‌తో పోరు కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని తెలిపాడు. ‘‘మాకు సామాజిక మాధ్యమాల మీద పూర్తి అవగాహన ఉంది. దురదృష్టవశాత్తూ ఇలాంటి (అగర్‌కు బెదిరింపులు) సంఘటనలు జరగడం బాధాకరం. ఇక్కడ  చాలామంది ప్రజలు మాతో పని చేసేందుకు ఉన్నారు. పాక్‌ కల్పిస్తున్న భద్రతపై మాకు పూర్తి నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నాడు. గతనెల శ్రీలంకతో టీ20 మ్యాచ్‌ సందర్భంగా బంతిని ఆపే క్రమంలో స్మిత్ తల గ్రౌండ్‌ను తాకింది. దీంతో కన్‌కషన్‌ తీసుకుని మైదానం వీడాల్సి వచ్చింది. అయితే గాయం నుంచి కోలుకున్నట్లు స్మిత్ వెల్లడించాడు. ప్రస్తుతం సిరీస్‌లో పాక్‌తో ఆసీస్‌ మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టీ20లో తలపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని