FIFA World Cup: ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌.. ఫ్రాన్స్‌పై అర్జెంటీనా విజయం

ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌లో అర్జెంటీనా అదరగొట్టింది. ఫ్రాన్స్‌తో జరిగిన నరాలు తెగే టైటిల్‌ పోరులో పెనాల్టీ షూటౌట్‌లో ఆ జట్టు నెగ్గింది. దీంతో మూడోసారి అర్జెంటీనా ఛాంపియన్‌గా అవతరించింది. ఈ విజయంతో అర్జెంటీనా స్టార్‌ లియోనల్‌ మెస్సి కల నెరవేరినట్లైంది. 

Updated : 19 Dec 2022 06:03 IST

(Photo: FIFA Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫిఫా ప్రపంచకప్‌ విజేతగా అర్జెంటీనా నిలిచింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ జరిగిన పోరులో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌పై ఆ జట్టు పెనాల్టీ షూటౌట్‌లో 4-2 తేడాతో గెలిచింది. దీంతో అర్జెంటీనా మరోసారి ఛాంపియన్‌గా అవతరించింది. ఆద్యంతం అత్యంత ఆసక్తిగా సాగిన ఈ పోరులో తొలుత ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. దీంతో అదనపు సమయం కేటాయించారు. అదనపు సమయంలో సైతం ఇరు జట్లు చెరో గోల్‌ చేయడంతో మ్యాచ్‌ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. దీంతో పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా వరుసగా నాలుగు గోల్స్‌ చేయగా, ఫ్రాన్స్‌ 2 గోల్స్‌ చేసింది. ఈ విజయంతో అర్జెంటీనా జట్టు మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ టోర్నీ విజయంతో అర్జెంటీనా స్టార్‌ ఆటగాడు మెస్సి కల నెరవేరింది. తన సారథ్యంలో అర్జెంటీనాకు కప్పు రావడం ఇదే తొలిసారి. గతంలో 1978, 1986లో అర్జెంటీనా విజేతగా నిలచింది. అయితే మెస్సి తృటిలో ‘గోల్డెన్‌ బూట్‌’ అవార్డును కోల్పోయాడు. మ్యాచ్‌కు ముందు మెస్సి, ఫ్రాన్స్‌ ఆటగాడు ఎంబాపే చెరో 5 గోల్స్‌తో సమంగా ఉన్నారు. ఫైనల్లో ఎవరు ఎక్కువగా గోల్స్‌ చేస్తే వారికే ఈ ‘గోల్డెన్‌ బూట్‌’ అవార్డు సొంతం. ఈ మ్యాచ్‌లో మెస్సీ రెండు గోల్స్‌ చేసినప్పటికీ, ఎంబాపే హ్యాట్రిక్‌ గోల్స్ చేసి ఈ అవార్డును అందుకున్నాడు. ఇక ఫిఫా చరిత్రలో ఫైనల్‌ ఫలితం షూటౌట్‌లో తేలడం ఇది మూడో సారి.  

నువ్వా నేనా అన్నట్లు సాగిన ఫైనల్‌ పోరులో తొలి నుంచి అర్జెంటీనా ఆధిపత్యం సాధించింది. 23వ నిమిషంలో పెనాల్టీని మెస్సి గోల్‌గా మలిచి అర్జెంటీనాను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఇక 36వ నిమిషంలో ఏంజెల్ డి మారియా మరో గోల్‌ చేయడంతో అర్జెంటీనా మరింత ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయినప్పటికీ ఫ్రాన్స్‌ ఖాతా తెరవలేదు. రెండో అర్ధ భాగం చివరిలో ఫ్రాన్స్‌ అనూహ్యంగా పుంజుకుంది. ఆ జట్టు స్టార్‌ ఆటగాడు ఎంబాపే అర్జెంటీనాకు షాక్‌ ఇచ్చాడు. 80వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ ద్వారా గోల్‌ చేసి ఫ్రాన్స్‌ని పోటీలోకి తెచ్చాడు. ఆ వెంటనే 81 నిమిషంలోనూ ఎంబాపే మరో గోల్‌ చేసి స్కోరును సమం చేశాడు. దీంతో మరో గోల్‌ కోసం ఇరు జట్లు హోరాహోరీ తలపడ్డాయి. ఇరు జట్లు ప్రత్యర్థి గోల్‌ పోస్టులపై పదే పదే దాడులు చేసినప్పటికీ నిర్ణీత సమయం వరకు ఇంకో గోల్‌ నమోదు కాలేదు. స్కోర్‌ సమంగా ఉండడంతో అదనపు సమయం కేటాయించారు. దీంతో 108 నిమిషాల వద్ద మెస్సి అద్భుతంగా గోల్‌ చేయడంతో 3-2 తేడాతో అర్జెంటీనా మరోసారి ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. అయితే 118 నిమిషాల వద్ద పెనాల్టీని ఉపయోగించుకున్న ఫ్రాన్స్‌ ఆటగాడు ఎంబాపే గోల్‌ చేశాడు. దీంతో స్కోరు 3-3తో సమమైంది. అదనపు సమయం కూడా అయిపోవడంతో మ్యాచ్‌ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా వరుసగా నాలుగు బంతులను గోల్స్‌గా మలిచింది. ఫ్రాన్స్‌ కేవలం రెండు బంతులను గోల్‌పోస్ట్‌లోకి కొట్టింది. దీంతో 3-3 (4-2)  తేడాతో మ్యాచ్‌ అర్జెంటీనా వశమైంది. కాగా ఈ మ్యాచ్‌లో బంతి 55 శాతం అర్జెంటీనా నియంత్రణలో ఉండగా, 45 శాతం ఫ్రాన్స్‌ నియంత్రణలో ఉంది. లక్ష్యం దిశగా అర్జెంటీనా ఆటగాళ్లు 10 షాట్‌లు కొట్టగా, ఫ్రాన్స్‌ ఆటగాళ్లు 5 షాట్లు కొట్టారు. అర్జెంటీనా 26 ఫౌల్స్‌ చేయగా, ఫ్రాన్స్‌ 19 ఫౌల్స్‌ చేసింది.  

 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని