Rohit Sharma: కొత్త కెప్టెన్‌కు రవిశాస్త్రి సూచనలివే..! 

టీమ్‌ఇండియా కొత్త కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అనవసర విషయాలకు స్పందించాల్సిన అవసరం లేదని మాజీ కోచ్‌ రవిశాస్త్రి సూచించాడు. జట్టుకు ఏది అవసరమో అదే చేస్తూ ముందుకు సాగాలని పేర్కొన్నాడు.

Updated : 10 Dec 2021 14:17 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా కొత్త కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అనవసర విషయాలకు స్పందించాల్సిన అవసరం లేదని మాజీ కోచ్‌ రవిశాస్త్రి సూచించాడు. జట్టుకు ఏది అవసరమో అదే చేస్తూ ముందుకు సాగాలని పేర్కొన్నాడు. రోహిత్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడంపై ఆనందం వ్యక్తం చేసిన రవిశాస్త్రి అతడికి పలు సూచనలు చేశాడు. గత బుధవారం (డిసెంబరు 8న) సెలెక్టర్లు.. కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి.. ఆ బాధ్యతలను రోహిత్‌కి అప్పగించిన విషయం తెలిసిందే.

‘రోహిత్‌ అనవసర విషయాలకు స్పందించాల్సిన అవసరం లేదు. పరిస్థితులను బట్టి జట్టుకు ఏది అవసరమో అదే చేస్తూ ముందుకు సాగాలి. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడిని సమర్థంగా ఉపయోగించుకుంటేనే విజయవంతమైన నాయకుడిగా రాణించగలుగుతాడు’ అని రవిశాస్త్రి సూచించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో అత్యంత విజయవంతమైన నాయకుడిగా పేరు పొందిన రోహిత్‌ శర్మకు.. అంతర్జాతీయ క్రికెట్లోనూ కెప్టెన్‌గా మెరుగైన రికార్డే ఉంది. ఇప్పటి వరకు 32 మ్యాచ్‌లకు తాత్కాలిక సారథిగా వ్యవహరించిన అతడు.. 26 మ్యాచుల్లో విజయం సాధించాడు. రోహిత్‌ సారథ్యంలోనే భారత్.. నిదాహస్‌ ట్రోఫీ, 2018లో ఆసియా కప్‌ విజేతగా నిలిచింది. 

అలాగే, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై కూడా రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. ‘కోహ్లీ సమర్థవంతమైన ఆటగాడే. కానీ, అతడు సాధించిన రికార్డులను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కెప్టెన్‌గా అతడు సాధించిన విజయాల ఆధారంగానే గౌరవిస్తుంటాం. టీమ్ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించడం అనేది మామూలు విషయం కాదు. కెప్టెన్‌గా కోహ్లీ సాధించిన విజయాల పట్ల గర్వపడాలి. వ్యూహాత్మకంగా అతడు గొప్ప కెప్టెన్‌’ అని రవిశాస్త్రి అన్నాడు.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని