IPL 2021:ఐపీఎల్‌లో ధోనీ పరుగులు చేయడం కష్టమే:గౌతమ్ గంభీర్‌

ఐపీఎల్-14 సీజన్‌ రెండో దశలో చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్కే) కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ పరుగులు చేయడం కష్టమేనని భారత మాజీ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ధోనీకి ఐపీఎల్‌లో నాణ్యమైన బౌలర్లను ఎదుర్కొవడం కష్టమని పేర్కొన్నాడు.

Published : 16 Sep 2021 19:38 IST

(Photo:Chennai Super Kings Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్-14 సీజన్‌ రెండో దశలో చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్కే) కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ పరుగులు చేయడం కష్టమేనని భారత మాజీ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ధోనీకి ఐపీఎల్‌లో నాణ్యమైన బౌలర్లను ఎదుర్కొవడం కష్టమని పేర్కొన్నాడు. ‘ధోనీ సాధారణంగా నాలుగు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తాడు. కానీ, ఐపీఎల్-14 మొదటి దశలో ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్‌ వచ్చాడు. కొన్నిసార్లు అతని కన్నా ముందు సామ్ కరన్ వచ్చిన సందర్భాలున్నాయి’ అని గంభీర్ అన్నాడు.

‘ధోనీ పరుగులు చేయడం చాలా కష్టం. ఐపీఎల్ చాలా క్లిష్టమైన టోర్నీ. ఇది కరేబియన్ ప్రీమియర్ లీగ్ లేదా మరో టోర్నీలా కాదు. ఇందులో అత్యుత్తమ బౌలర్లు ఆడుతుంటారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కి దూరమైన ధోనీ.. వారిని ఎదుర్కొని పరుగులు చేయడం కష్టం. కాబట్టి.. ధోనీ నుంచి చెన్నై టాప్ ఆర్డర్ ఎక్కువగా ఆశించకూడదు. మరోవైపు ధోనీ కూడా వికెట్ కీపింగ్‌, జట్టు మెంటార్ పాత్రని పోషించడంపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాడు’అని గంభీర్‌ వ్యాఖ్యానించాడు.

2019 ఐపీఎల్‌లో ధోనీ 416 పరుగులు సాధించి సీఎస్కే తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన తర్వాత.. 2020 ఐపీఎల్‌లో 14 మ్యాచులు ఆడి 200 పరుగులు చేశాడు. ఇక, 2021 తొలి దశ ఐపీఎల్‌లో ఏడు మ్యాచులు ఆడి కేవలం 37 పరుగులు మాత్రమే  చేశాడు. అక్టోబరులో మొదలవనున్న టీ20 ప్రపంచకప్‌  కోసం భారత జట్టుని బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ జట్టుకు మెంటార్‌గా  ధోనీని బీసీసీఐ నియమించిన విషయం తెలిసిందే.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని