Gautham Gambhir: మా ఆటగాళ్లను రక్షించుకోవాల్సిన బాధ్యత నాదే : గంభీర్‌

ముక్కుసూటిగా మాట్లాడుతూ.. అవతలి వారు ఎవరైనా సరే దూకుడుగా వ్యవహరించే స్వభావం గౌతమ్‌ గంభీర్‌ది (Gautam Gambhir). సహచరులైనా.. ప్రత్యర్థులైనా ఒకేలా స్పందిస్తూ ఉంటాడు.

Published : 09 Dec 2023 10:59 IST

ఇంటర్నెట్ డెస్క్: గత ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు - లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ (RCB vs LSG) మ్యాచ్‌ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ (Virat Kohli) - నవీనుల్‌ హక్‌, గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి గౌతమ్‌ గంభీర్‌ వార్తల్లో నిలిచాడు. లెజెండ్‌ లీగ్ క్రికెట్‌ (LLC) సందర్భంగా గంభీర్‌ - శ్రీశాంత్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో విరాట్‌తో జరిగిన అప్పటి వాగ్వాదం మరోసారి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఆ సంఘటనపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో గంభీర్‌ మాట్లాడాడు.

‘‘విరాట్ - నవీనుల్‌ హక్‌ వివాదం.. అసలు ఆ రోజు ఏమైంది?’’  అన్న ప్రశ్నకు గంభీర్‌ స్పందిస్తూ..

‘‘మెంటార్‌గా నా జట్టు ఆటగాళ్లకు ఎల్లవేళలా అండగా ఉండాల్సిన బాధ్యత ఉంటుంది. నేను దానినే నమ్ముతా. మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు మధ్యలో జోక్యం చేసుకునే హక్కు నాకు లేదు. ఒక్కసారి మ్యాచ్‌ ముగిసిన తర్వాత నా ఆటగాళ్లతో ఎవరైనా సరే వాగ్వాదం చేస్తున్నారనిపిస్తే.. వెళ్లి అడ్డుకోవడం నా ముందున్న బాధ్యత. అటువైపు ఎంతటివారైనా సరే అడ్డుకోవాల్సిన అవసరం ఉంది.. మా ప్లేయర్లను కాపాడాల్సిన హక్కూ నాకుంది’’ అని గంభీర్‌ సూటిగా సమాధానం ఇచ్చాడు.

మన్మోహన్‌ సింగ్‌ వచ్చినప్పుడు..

ఇటీవల ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీని (PM Narendra Modi) ఉద్దేశించి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వాడిన భాషను గంభీర్‌ తప్పుబట్టాడు. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు మోదీ వెళ్లడంతోనే టీమ్ఇండియా ఓడిపోయిందనే అర్థంలో రాహుల్‌ వ్యాఖ్యలు చేశాడు. వాటిపై గంభీర్‌ స్పందించాడు. ‘‘రాహుల్ అలాంటి పదాలను వాడకుండా ఉంటే బాగుండేది. దేశ ప్రధాని పట్ల ఇలా మాట్లాడటం దారుణం. 2011 వరల్డ్‌ కప్‌ సెమీస్‌కు అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ వచ్చారు. ఒకవేళ టీమ్‌ఇండియా ఓడిపోయి ఉండి ఆటగాళ్లను కలవడానికి ఆయన వెళ్తే అందులోనూ తప్పుబడతారా?’’ అని గంభీర్‌ వ్యాఖ్యానించాడు. ఇక 2011 వరల్డ్‌కప్‌ను ధోనీ నేతృత్వంలో టీమ్‌ఇండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని