Gautam Gambhir: క్రీడాస్ఫూర్తి టీమ్‌ఇండియాకేనా? మీకు వర్తించదా?: ఆసీస్‌పై మండిపడ్డ గంభీర్‌

ఆస్ట్రేలియాతో రెండో టెస్టు చివరి రోజు ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ బెయిర్‌ స్టో(Jonny Bairstow) ఔటైన విధానం వివాదానికి దారితీసింది. దీంతో ఆసీస్‌ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిందంటూ పలువురు మండిపడుతున్నారు.

Updated : 03 Jul 2023 12:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  యాషెస్‌ సిరీస్‌ (Ashes Series 2023) రెండో టెస్టులో ఆస్ట్రేలియానే విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే.. ఈ టెస్టు ఐదో రోజు ఆటలో ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ బెయిర్‌ స్టో(Jonny Bairstow) ఔటైన విధానం వివాదానికి దారితీసింది. దీంతో ఆసీస్‌ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిందంటూ పలువురు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌(Gautam Gambhir) కూడా ఆస్ట్రేలియా జట్టుపై తీవ్రంగా స్పందించాడు. ‘‘హే స్లెడ్జర్స్‌.. క్రీడా స్ఫూర్తి మీకు వర్తించదా..? కేవలం ఇండియన్స్‌కేనా?’’ అంటూ ట్విటర్‌లో గంభీర్‌ మండిపడ్డాడు.

అసలేం జరిగిందంటే.. చివరి రోజు తొలి సెషన్‌ ఆటలో ఇంగ్లాండ్‌ 193/5గా ఉన్న సమయంలో.. గ్రీన్‌ బౌన్సర్‌ను తప్పించుకునేందుకు బెయిర్‌స్టో కిందకు వంగాడు. బంతి వికెట్‌ కీపర్‌ కేరీ చేతుల్లోకి వెళ్లింది. ఇంతలో ఓవర్‌ పూర్తయిందనే ఉద్దేశంతో బెయిర్‌స్టో క్రీజు దాటాడు. వెంటనే వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ కేరీ బంతిని కింద నుంచి విసిరి స్టంప్స్‌ పడగొట్టాడు. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లందరూ అప్పీల్‌ చేయగా.. బెయిర్‌స్టో, స్టోక్స్‌తో పాటు ఇంగ్లాండ్‌ క్రికెటర్లు, స్టాండ్స్‌లోని అభిమానులు ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు. బెయిర్‌స్టో పరుగు తీసేందుకు ప్రయత్నించలేదు కాబట్టి మూడో అంపైర్‌ ఎరాస్మస్‌ నాటౌట్‌ అంటాడేమోనని అనుకున్నారు. కానీ బంతి డెడ్‌ కాలేదని భావించి బెయిర్‌స్టోను అతడు స్టంపౌట్‌గా ప్రకటించాడు. దీంతో ఆస్ట్రేలియా సంబరాల్లో తేలిపోగా.. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు షాక్‌లో మునిగిపోయారు. ఆసీస్‌ కెప్టెన్‌ కమిన్స్‌తో బెయిర్‌స్టో, మరో ఎండ్‌లో ఉన్న కెప్టెన్‌ స్టోక్స్‌ మాట్లాడినా ఫలితం లేకపోయింది.

ఈ ఘటన అనంతరం స్టేడియంలోని ఇంగ్లాండ్‌ అభిమానులు ఆస్ట్రేలియాపై విమర్శలు చేస్తూ కేకలు వేశారు. ‘’ఇది పాత ఆసీస్‌ జట్టే.. ఎప్పుడూ మోసం చేస్తూనే ఉంటుంది’’ అని నినాదాలు చేస్తూ గతంలో బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడిన ఘటనను వారు గుర్తు చేశారు.

ఇక ఈ ఘటనపై ఆసీస్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ మ్యాచ్‌ అనంతరం స్పందించాడు. ‘రన్నౌట్‌ అప్పీల్‌ను కమిన్స్‌ ఉపసంహరించుకోవాల్సి ఉండేదని స్టోక్స్‌ అన్నాడు. దీనిపై మీరేమంటారు?’ అని ప్రశ్నించగా.. ‘ఓకే’ అంటూ కమిన్స్‌ క్లుప్తంగా సమాధానమిచ్చాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని