IND Vs NZ: ఈసారి బౌలర్లు..

పరుగుల ఖాతా తెరవడానికంటే ముందు వికెట్ల వేట షురూ.. పది పరుగులకు చేరడానికి ఏడు ఓవర్లు.. తొమ్మిదో ఓవర్లో తొలి బౌండరీ.. 15 పరుగులకే సగం మంది బ్యాటర్లు పెవిలియన్‌లో.. ఇదీ రెండో వన్డేలో భారత పేసర్ల బుల్లెట్‌ బంతుల ధాటికి   కకావికలమైన న్యూజిలాండ్‌ పరిస్థితి.

Updated : 22 Jan 2023 07:40 IST

రెండో వన్డేలో కివీస్‌పై టీమ్‌ఇండియా విజయం
చెలరేగిన షమి, హార్దిక్‌, సుందర్‌
2-0తో సిరీస్‌ వశం

పరుగుల ఖాతా తెరవడానికంటే ముందు వికెట్ల వేట షురూ.. పది పరుగులకు చేరడానికి ఏడు ఓవర్లు.. తొమ్మిదో ఓవర్లో తొలి బౌండరీ.. 15 పరుగులకే సగం మంది బ్యాటర్లు పెవిలియన్‌లో.. ఇదీ రెండో వన్డేలో భారత పేసర్ల బుల్లెట్‌ బంతుల ధాటికి   కకావికలమైన న్యూజిలాండ్‌ పరిస్థితి.

ఓ బంతిని లోపలికి వేస్తూ.. మరో బంతిని బయటకు పంపిస్తూ.. ఇంకో బంతిని బౌన్సర్‌గా సంధిస్తూ.. ఇలా ఏ బంతి ఎలా వస్తుందో తెలీని అనిశ్చితిలోకి బ్యాటర్లను నెట్టేసి.. ప్రత్యర్థిపై ముప్పేట దాడి చేసి బౌలర్లు అదరగొట్టారు. కొత్త స్టేడియంలో పచ్చికతో కూడిన పిచ్‌పై మొదట పేసర్లు చెలరేగితే.. తోకను కత్తిరించడంలో స్పిన్నర్లు సాయపడ్డారు.

మొత్తానికి.. ఇదేం బౌలింగ్‌? అంటూ ఉప్పల్‌ వన్డే తర్వాత వచ్చిన విమర్శలకు    మన బౌలర్లు అదిరే బదులిచ్చారు. 108కే కివీస్‌ను కూల్చారు. స్వల్ప ఛేదనలో అలవోకగా లక్ష్యాన్ని చేరుకుని.. టీమ్‌ఇండియా మరో సిరీస్‌ను సొంతం చేసుకుంది.

ప్రపంచ క్రికెట్లోకి రాయ్‌పుర్‌ స్టేడియం అరంగేట్రం అదిరింది. తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చిన షహీద్‌ వీర్‌ నారాయణ్‌ సింగ్‌ మైదానంలో టీమ్‌ఇండియా సత్తాచాటింది. శనివారం రెండో వన్డేలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి కివీస్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచింది. క్రమశిక్షణ, కచ్చితత్వంతో భారత బౌలర్లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదట న్యూజిలాండ్‌ 34.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో ఫిలిప్స్‌ (36), బ్రాస్‌వెల్‌ (22), శాంట్నర్‌ (27) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ షమి (3/18), హార్దిక్‌ పాండ్య (2/16), వాషింగ్టన్‌ సుందర్‌ (2/7) చెలరేగారు. ఛేదనలో రెండు వికెట్లు కోల్పోయిన టీమ్‌ఇండియా 20.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (51; 50 బంతుల్లో 7×4, 2×6), శుభ్‌మన్‌ గిల్‌ (40 నాటౌట్‌; 53 బంతుల్లో 6×4) సత్తాచాటారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ 2-0తో సొంతం చేసుకుంది. నామమాత్రమైన చివరి వన్డే మంగళవారం ఇండోర్‌లో జరుగుతుంది.

అందుకున్నారు అలవోకగా..: కివీస్‌ బ్యాటర్లు చేతులెత్తేసిన పిచ్‌పై.. భారత ఆటగాళ్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. స్వల్ప ఛేదనలో ఎలాంటి తడబాటు లేకుండా బ్యాటింగ్‌ చేశారు. ముఖ్యంగా ఓపెనర్లు రోహిత్‌, గిల్‌ తొలి వికెట్‌కు 72 పరుగులు జోడించి విజయానికి బలమైన పునాది వేశారు. ఈ జోడీని ప్రత్యర్థి బౌలర్లు ఎలాంటి ఇబ్బంది పెట్టలేకపోయారు. ఈ ఇద్దరూ బౌండరీల వేటలో సాగారు. ముఖ్యంగా రోహిత్‌ దూకుడు ప్రదర్శించాడు. ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో తనదైన శైలిలో పుల్‌ షాట్‌తో సిక్సర్‌ రాబట్టాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న గిల్‌ కూడా కచ్చితత్వం, నియంత్రణతో షాట్లు ఆడాడు. ఈ ఇద్దరూ పరుగుల వేటలో సాగిపోవడంతో జట్టు లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. చూస్తుండగానే రోహిత్‌ 47 బంతుల్లో అర్ధసెంచరీ అందుకున్నాడు. ఆ వెంటనే అతను ఔటైనా.. రెండు ఫోర్లు బాది కోహ్లి (11) వెనుదిరిగినా భారత్‌కు కలవరపడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇషాన్‌ (8 నాటౌట్‌) జతగా గిల్‌ అజేయంగా నిలిచి పని పూర్తి చేశాడు. దీంతో మరో 29.5 ఓవర్లు మిగిలి ఉండగానే టీమ్‌ఇండియా గెలిచింది.

పడగొట్టారు కసిగా..: పచ్చికతో కళకళలాడుతున్న పిచ్‌.. గత వన్డేలో తమ బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్న ప్రత్యర్థి.. ఇంకేముంది టీమ్‌ఇండియా బౌలర్లు కసితీరా ప్రతీకారం తీర్చుకున్నారు. 15కే 5 వికెట్లు.. మధ్యలో రెండు 40కి పైగా పరుగుల భాగస్వామ్యాలు.. చివర్లో పతనం.. ఇదీ క్లుప్తంగా కివీస్‌ ఇన్నింగ్స్‌. బౌలింగ్‌కు స్వర్గధామంగా మారిన పిచ్‌పై సీమ్‌ను ఉపయోగించుకుని.. స్వింగ్‌ను రాబట్టి.. బౌన్స్‌తో ప్రత్యర్థిని పరీక్షించి.. భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. ఇన్నింగ్స్‌ అయిదో బంతికే అలెన్‌ (0)ను బౌల్డ్‌ చేసిన షమి వికెట్ల పతనాన్ని ప్రారంభించాడు. మరో ఎండ్‌ నుంచి సిరాజ్‌ (1/10) పకడ్బందీ ప్రణాళికతో బౌలింగ్‌ చేశాడు. ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లో తొలి రెండు బంతులను లెగ్‌స్టంప్‌పై వేసిన అతను.. మూడో బంతిని మధ్యలో వేసి అవతలికి స్వింగ్‌ చేసి నికోల్స్‌ (2)ను బలితీసుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్లోనే రిటర్న్‌ క్యాచ్‌ను ఎడమ చేత్తో అద్భుతంగా అందుకున్న షమి.. మిచెల్‌ (1)ను వెనక్కిపంపాడు. అనంతరం బౌలింగ్‌కు వచ్చిన శార్దూల్‌, హార్దిక్‌ కూడా వికెట్ల వేటలో సఫలమయ్యారు. ప్రమాదకర కాన్వేె (7)ను సూపర్‌ రిటర్న్‌ క్యాచ్‌తో హార్దిక్‌ పెవిలియన్‌ చేర్చాడు. కెప్టెన్‌ లేథమ్‌ (1)ను శార్దూల్‌ ఔట్‌ చేయడంతో కివీస్‌ 11 ఓవర్లలో 15/5తో నిలిచింది. ఫిలిప్స్‌, బ్రాస్‌వెల్‌, శాంట్నర్‌ కీలక పరుగులు చేసి స్కోరును వంద దాటించారు. తొలి వన్డేలో మెరుపు శతకం బాది.. మరోసారి ప్రమాదకరంగా మారుతున్న బ్రాస్‌వెల్‌ను షమి బౌన్సర్‌తో బోల్తా కొట్టించాడు. అయితే శాంట్నర్‌తో కలిసి ఫిలిప్స్‌ పోరాటం కొనసాగించాడు. శాంట్నర్‌ రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. క్లిష్టమైన క్యాచ్‌ను రోహిత్‌ అందుకోకపోగా.. సులువైన రిటర్న్‌ క్యాచ్‌ను కుల్‌దీప్‌ జారవిడిచాడు. 30వ ఓవర్లో స్కోరు 100 దాటింది. కానీ పుంజుకున్న బౌలర్లు 5 పరుగుల వ్యవధిలో చివరి నాలుగు వికెట్లు పడగొట్టారు. సుందర్‌ వరుస ఓవర్లలో ఫిలిప్స్‌, ఫెర్గూసన్‌ (1) భారీ షాట్లకు ప్రయత్నించి డీప్‌ మిడ్‌వికెట్లో సూర్య చేతికి చిక్కారు.


న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: అలెన్‌ (బి) షమి 0; కాన్వె (సి) అండ్‌ (బి) హార్దిక్‌ 7; నికోల్స్‌ (సి) గిల్‌ (బి) సిరాజ్‌ 2; మిచెల్‌ (సి) అండ్‌ (బి) షమి 1; లేథమ్‌ (సి) గిల్‌ (బి) శార్దూల్‌ 1; ఫిలిప్స్‌ (సి) సూర్యకుమార్‌ (బి) సుందర్‌ 36; బ్రాస్‌వెల్‌ (సి) ఇషాన్‌ (బి) షమి 22; శాంట్నర్‌ (బి) హార్దిక్‌ 27; షిప్లీ నాటౌట్‌ 2; ఫెర్గూసన్‌ (సి) సూర్యకుమార్‌ (బి) సుందర్‌ 1; టిక్నర్‌ ఎల్బీ (బి) కుల్‌దీప్‌ 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (34.3 ఓవర్లలో ఆలౌట్‌) 108; వికెట్ల పతనం: 1-0, 2-8, 3-9, 4-15, 5-15, 6-56, 7-103, 8-103, 9-105; బౌలింగ్‌: షమి 6-1-18-3; సిరాజ్‌ 6-1-10-1; శార్దూల్‌ 6-1-26-1; హార్దిక్‌ 6-3-16-2; కుల్‌దీప్‌ 7.3-0-29-1; వాషింగ్టన్‌ సుందర్‌ 3-1-7-2

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ ఎల్బీ (బి) షిప్లీ 51; శుభ్‌మన్‌ గిల్‌ నాటౌట్‌ 40; కోహ్లి (స్టంప్డ్‌) లేథమ్‌ (బి) శాంట్నర్‌ 11; ఇషాన్‌ నాటౌట్‌ 8; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం: (20.1 ఓవర్లలో 2 వికెట్లకు) 111; వికెట్ల పతనం: 1-72, 2-98; బౌలింగ్‌: ఫెర్గూసన్‌ 5-0-21-0; హెన్రీ షిప్లీ 5-0-29-1; టిక్నర్‌ 4-0-19-0; శాంట్నర్‌ 4.1-0-28-1; బ్రాస్‌వెల్‌ 2-0-13-0


భారత్‌లో అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చిన 50వ స్టేడియంగా రాయ్‌పుర్‌ మైదానం నిలిచింది.


7

స్వదేశంలో రికార్డు స్థాయిలో వరుసగా భారత్‌ సాధించిన ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ విజయాలు. 2019లో వెస్టిండీస్‌తో సిరీస్‌ నుంచి వరుసగా జట్టు విజయాలు సాధిస్తోంది. గతంలో రెండుసార్లు (2009-11, 2016-18) వరుసగా ఆరు వన్డే సిరీస్‌లు గెలిచింది.


15

అయిదు వికెట్ల నష్టానికి కివీస్‌ చేసిన పరుగులు. భారత్‌తో వన్డేల్లో సగం వికెట్లు పడేసరికి ఓ ప్రత్యర్థి చేసిన తక్కువ పరుగులు ఇవే. గతంలో ఇంగ్లాండ్‌ (2022) 26 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని