WPL: విశాఖ క్రికెటర్‌.. రెండేళ్ల పాపను వదిలి..

మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో బాగా ఆడమని తన రెండేళ్ల తనయ క్రివా చెప్పిందని, ఈ సమయంలో ఆమెకు దూరంగా ఉండడం కష్టమేనని విశాఖపట్నం క్రికెటర్‌ స్నేహ దీప్తి తెలిపింది.

Updated : 28 Feb 2023 10:51 IST

ముంబయి: మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో బాగా ఆడమని తన రెండేళ్ల తనయ క్రివా చెప్పిందని, ఈ సమయంలో ఆమెకు దూరంగా ఉండడం కష్టమేనని విశాఖపట్నం క్రికెటర్‌ స్నేహ దీప్తి తెలిపింది. దాదాపు పదేళ్ల క్రితమే భారత మహిళా క్రికెట్లో దీప్తి పేరు వినిపించింది. 2013లోనే 16 ఏళ్లకే ఆమె టీ20, వన్డేల్లో జాతీయ జట్టు తరపున అరంగేట్రం చేసింది. ఇప్పుడు టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌గా ఎదిగిన స్మృతి మంధాన కూడా అప్పుడు ఆ బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌తోనే అరంగేట్రం చేసింది. అవకాశాలు వచ్చి, అద్భుత ప్రదర్శనతో మంధాన జట్టులో కీలక బ్యాటర్‌గా మారగా.. దీప్తికి అదృష్టం కలిసి రాలేదు. అవకాశాలు రాక జట్టుకు దూరమైంది. కేవలం రెండు టీ20లు, ఓ వన్డే మాత్రమే ఆడింది. ఆంధ్ర తరపున దేశవాళీ క్రికెట్లో కొనసాగుతూ వచ్చింది.

ఇప్పుడు రెండేళ్ల చిన్నారికి అమ్మగా ఉన్న ఆమెకు.. డబ్ల్యూపీఎల్‌ రూపంలో రెండో అవకాశం తలుపు తట్టింది. ఇటీవల వేలంలో 26 ఏళ్ల దీప్తిని దిల్లీ క్యాపిటల్స్‌ రూ.30 లక్షలకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్‌లో సత్తాచాటి.. మళ్లీ జాతీయ జట్టుకు ఎంపికవాలనే లక్ష్యంతో ఆమె సన్నద్ధమవుతోంది. శనివారం ఆరంభమయ్యే డబ్లూపీఎల్‌ ఆరంభ సీజన్‌ కోసం దిల్లీ క్యాపిటల్స్‌ శిబిరంలో చేరి సాధన మొదలెట్టింది. క్రివాను వదిలిపెట్టి ప్రాక్టీస్‌కు రావడం చాలా కష్టంగా ఉందని దీప్తి భావోద్వేగానికి గురైంది.

దిల్లీ క్యాపిటల్స్‌ పోస్టు చేసిన వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ముంబయిలో జట్టు ఉన్న హోటల్‌కు వచ్చే సమయంలో తనను వదిలి వస్తున్నందుకు క్రివా ఏడ్చింది. అప్పుడు వెళ్లాలా? వద్దా? అనే సందేహం కలిగింది. క్రికెట్‌, కుటుంబం రెండూ నాకు ప్రధానమే. కెరీర్‌ ఎంతో ముఖ్యమైంది. ఇంత దూరం వచ్చా కాబట్టి ఇక వెనుకడుగు వేయొద్దనుకున్నా. జట్టుతో చేరాలని నిర్ణయించుకున్నా. పూర్తిస్థాయిలో నా ఆటను ఆస్వాదించాలి. ఇది నాకో మంచి అవకాశం. లీగ్‌లో ఉత్తమ ప్రదర్శనతో విజయవంతమవ్వాలి. అమ్మాయిలకు ఆదర్శంగా నిలవాలనుకుంటున్నా. నేను సాధించగా లేనిది.. మిగతావాళ్లు ఎందుకు చేయలేరు? అనేలా స్ఫూర్తి నింపాలనుకుంటున్నా’’ అని ఆమె తెలిపింది.

కూతురును జాగ్రత్తగా చూసుకుంటానని శిబిరానికి బయల్దేరే ముందు భర్త మాటిచ్చాడని దీప్తి వెల్లడించింది. ‘‘ఈ సమయంలో క్రివాకు దూరంగా ఉండడం చాలా కష్టం. కానీ నా భర్త మాటిచ్చాడు. ‘నువ్వు వెళ్లు, నేను క్రివాను చూసుకుంటా’ అని చెప్పాడు. హోటల్‌ చేరిన వెంటనే ఆయనకు ఫోన్‌ చేశా. అప్పుడు క్రివా నవ్వుతూ మాట్లాడింది. ‘బాగా ఆడు’ అని చెప్పింది’’ అని దీప్తి పేర్కొంది. 2021 ఫిబ్రవరిలో పాపకు జన్మనిచ్చిన దీప్తి, తిరిగి సెప్టెంబర్‌లో దేశవాళీ క్రికెట్‌ ఆడింది. ఆమెకు వేలంలో మంధాన లాగా రూ.కోట్లు రాకపోవచ్చు కానీ తాను ప్రేమించే ఆటలో సత్తాచాటేందుకు మరో గొప్ప అవకాశం దక్కింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని