ఎర్రకోట ఇగాఇలాకా

ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ అనగానే అస్థిర ఫలితాలుంటాయ్‌! ఎర్ర మట్టి కోర్టులో ఎవరు ఛాంపియన్‌ అవుతారో ఊహించలేం! సెరెనా విలియమ్స్‌ లాంటి దిగ్గజాలు కూడా రొలాండ్‌ గారోస్‌లో ఆధిపత్యం చెలాయించలేకపోయారు.

Published : 11 Jun 2023 03:02 IST

స్వైటెక్‌కు మూడో ఫ్రెంచ్‌ టైటిల్‌
ఫైనల్లో ముచోవాపై గెలుపు

ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ అనగానే అస్థిర ఫలితాలుంటాయ్‌! ఎర్ర మట్టి కోర్టులో ఎవరు ఛాంపియన్‌ అవుతారో ఊహించలేం! సెరెనా విలియమ్స్‌ లాంటి దిగ్గజాలు కూడా రొలాండ్‌ గారోస్‌లో ఆధిపత్యం చెలాయించలేకపోయారు. అలాంటిది గత నాలుగేళ్లలో మూడో ఫ్రెంచ్‌ టైటిల్‌ గెలవడం అంటే!! అది ఇగా స్వైటెక్‌కే సాధ్యమైంది. ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ.. ఈ టోర్నీలో మరోసారి తన ముద్ర వేసిన లేడీ నాదల్‌.. అదిరే ఆటతో టైటిల్‌ నిలబెట్టుకుంది. తుది పోరులో ముచోవా నుంచి ప్రతిఘటన ఎదురైనా నిలిచిన ఈ 22 ఏళ్ల పోలెండ్‌ స్టార్‌ ట్రోఫీ చేజిక్కించుకుంది.

పారిస్‌

ప్రపంచ నంబర్‌వన్‌ స్వైటెక్‌ అదరగొట్టింది. జోరు కొనసాగిస్తూ ఈ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ను మరోసారి ముద్దాడింది. శనివారం మహిళల సింగిల్స్‌ ఫైనల్లో స్వైటెక్‌ 6-2, 5-7, 6-4తో కరోలినా ముచోవా (చెక్‌ రిపబ్లిక్‌)ను ఓడించింది. ఈ మ్యాచ్‌ ఆరంభంలో స్వైటెక్‌ దూకుడు చూస్తే ఫైనల్‌ ఏకపక్షం అయ్యేలా కనిపించింది. తొలి సెట్‌ గెలిచి.. రెండో సెట్లో 3-0తో తిరుగులేని ఆధిక్యంలో ఉన్న స్వైటెక్‌.. ఛాంపియన్‌షిప్‌ గెలిచేందుకు మూడు గేమ్‌ల దూరంలో నిలిచింది. కానీ అనూహ్యంగా పుంజుకున్న ముచోవా.. ఇగాకు గట్టిపోటీ ఇచ్చింది. తొలి సెట్‌తో పోలిస్తే మెరుపు సర్వీసులతో విజృంభించిన ఈ చెక్‌ అమ్మాయి.. ఫోర్‌హ్యాండ్‌ విన్నర్లతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. దీంతో అనవసర తప్పిదాలు చేసిన ఇగా.. అయిదో గేమ్‌లో సర్వీస్‌ కోల్పోయింది. ముచోవా పట్టు వదలకపోవడం.. స్వైటెక్‌ తగ్గకపోవడంతో సెట్‌ నువ్వానేనా అన్నట్టుగా సాగింది. పదకొండో గేమ్‌లో మరో బ్రేక్‌ సాధించిన ముచోవా.. ఆ తర్వాత సర్వీస్‌ నిలబెట్టుకుని సెట్‌ గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. ఆఖరి సెట్‌ ఆరంభంలోనూ సర్వీస్‌ కోల్పోయినా.. ముచోవా పోరాటం ఆపలేదు. ఆ తర్వాత స్వైటెక్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేసి మళ్లీ స్కోరు సమం చేసింది. కానీ ఒత్తిడిలోనూ స్థిరంగా ఆడి తొమ్మిదో గేమ్‌ నిలబెట్టుకున్న ఇగా 5-4తో విజయం ముంగిట నిలిచింది. పదో గేమ్‌లో 15-40తో వెనుకబడిన సమయంలో ముచోవా డబుల్‌ఫాల్ట్‌ చేయడంతో ఇగా సెట్‌తో పాటు టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ను కాట్లో (జపాన్‌)-పజ్‌ (జర్మనీ) జోడీ నెగ్గింది. ఫైనల్లో ఈ జోడీ 4-6, 6-4, 10-6తో ఆండ్రెస్క్యూ (కెనడా)- మైకేల్‌ వీనస్‌ (ఆస్ట్రేలియా)ను ఓడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని