IRE vs IND: క్లీన్‌స్వీప్‌పై భారత్‌ కన్ను

క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన టీమ్‌ఇండియా ఐర్లాండ్‌తో ఆఖరి పోరుకు సిద్ధమైంది. బుధవారమే చివరిదైన మూడో టీ20. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయంతో భారత్‌ ఇప్పటికే సిరీస్‌ను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.

Updated : 23 Aug 2023 11:26 IST

ఐర్లాండ్‌తో చివరి టీ20 నేడు

రాత్రి 7.30 నుంచి డబ్లిన్‌

క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన టీమ్‌ఇండియా ఐర్లాండ్‌తో ఆఖరి పోరుకు సిద్ధమైంది. బుధవారమే చివరిదైన మూడో టీ20. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయంతో భారత్‌ ఇప్పటికే సిరీస్‌ను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. గాయాల నుంచి కోలుకుని పునరాగమనం చేసిన పేస్‌ బౌలర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ట ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడం జట్టుకు సంతోషాన్నిచ్చే విషయం. మరోవైపు రిజర్వ్‌ ఆటగాళ్లను పరీక్షించేందుకు ఈ నామమాత్రమైన మ్యాచ్‌ టీమ్‌ఇండియాకు ఓ చక్కని అవకాశం. అవేష్‌ ఖాన్‌, జితేశ్‌ శర్మ, షాబాజ్‌ అహ్మద్‌ ఇప్పటివరకు సిరీస్‌లో ఆడలేదు. నిజానికి విండీస్‌ పర్యటనలోనూ జట్టులో ఉన్న అవేష్‌ మొత్తంగా వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో బెంచ్‌కు పరిమితం కావాల్సివచ్చింది. ఈ నేపథ్యంలో నిలకడగా రాణించలేకపోతున్న అర్ష్‌దీప్‌ సింగ్‌ స్థానంలో అతణ్ని తుది జట్టులోకి తీసుకునే అవకాశముంది. సంజు శాంసన్‌కు విశ్రాంతినిచ్చి వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ జితేశ్‌ శర్మకు అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వొచ్చు. దేవధర్‌ ట్రోఫీలో విశేషంగా రాణించి ఆత్మవిశ్వాసంతో ఉన్న షాబాజ్‌ అహ్మద్‌ భారత్‌కు మరో ఆల్‌రౌండ్‌ ప్రత్యామ్నాయం. వాషింగ్టన్‌ సుందర్‌కు విశ్రాంతి కల్పించి షాబాజ్‌ను ఆడించే అవకాశాలు మెండు. ఆసియాకప్‌కు ముందు కెప్టెన్‌ బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ణ మరింత మ్యాచ్‌ టైమ్‌ కోరుకుంటున్న నేపథ్యంలో వారికి విశ్రాంతినిచ్చే అవకాశం లేదు. ఇక సంజు స్థానంలో జితేశ్‌ను ఆడించడం మినహా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు ఉండే వీలు లేదు. రెండో టీ20తో అరంగేట్రం చేసిన రింకూ 21 బంతుల్లో 38 పరుగులతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అతడితో పాటు యశస్వి, రుతురాజ్‌ గైక్వాడ్‌లు తమదైన ముద్ర వేయాలనుకుంటున్నారు. ఇక ఐర్లాండ్‌ తరఫున ఎడమచేతి వాటం స్పిన్నర్‌ వాన్‌ వోర్కమ్‌ అరంగేట్రం చేయొచ్చు. తిరుగులేని ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న భారత్‌ను క్లీన్‌స్వీప్‌ చేయకుండా అడ్డుకోవడం ఐర్లాండ్‌కు కష్టమైన పనే.

పిచ్‌ ఎలా ఉందంటే..: వాతావరణం మబ్బు పట్టి ఉంటుంది. ఆటకు వర్షం అంతరాయం కలిగించే అవకాశముంది. కానీ మ్యాచ్‌ పూర్తిగా జరగొచ్చు.


4.88

ఈ సిరీస్‌లో బుమ్రా ఎకానమీ. మరే బౌలర్‌కు కూడా ఓవర్‌కు ఆరు లోపు ఎకానమీ లేదు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని