Asia Cup 2023: ఆసియా ధమాకా
వన్డే ప్రపంచకప్‌కు ముందు తమ కూర్పును సరిచూసుకోవడానికి, లోపాలను సవరించుకోవడానికి, బలాబలాలను అంచనా వేసుకోవడానికి, ఎంతో విలువైన ప్రాక్టీస్‌ను పొందడానికి ఆసియా జట్లకు ఓ చక్కని అవకాశం.
నేటి నుంచే ఆరు జట్ల సమరం
తొలి మ్యాచ్‌లో నేడు పాకిస్థాన్ × నేపాల్
మధ్యాహ్నం 3 నుంచి
వన్డే ప్రపంచకప్‌కు ముందు తమ కూర్పును సరిచూసుకోవడానికి, లోపాలను సవరించుకోవడానికి, బలాబలాలను అంచనా వేసుకోవడానికి, ఎంతో విలువైన ప్రాక్టీస్‌ను పొందడానికి ఆసియా జట్లకు ఓ చక్కని అవకాశం. నేటి నుంచే ఆసియాకప్. ఆరు జట్లు పోటీలో ఉన్నా.. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థానే పోరే అత్యంత ఆసక్తిరేపుతోంది. బుధవారం పాకిస్థాన్, నేపాల్ మధ్య మ్యాచ్‌తో టోర్నీ ఆరంభమవుతుంది.
కొలంబో
ఆసియాకప్‌కు వేళైంది. పాకిస్థాన్, శ్రీలంకలు ఆతిథ్యమిస్తున్న టోర్నీ బుధవారం ముల్తాన్ (పాకిస్థాన్)లో పాక్, నేపాల్ మధ్య జరిగే గ్రూప్-ఎ మ్యాచ్‌తో ఆరంభం కానుంది. గత దశాబ్దకాలంలో ద్వైపాక్షిక సిరీస్‌లు పెరిగిపోవడం, వన్డే క్రికెట్ ప్రాభవం తగ్గడంతో ఆసియాకప్ ఉపయుక్తతపై తరచూ ప్రశ్నలు తలెత్తాయి. కానీ భారత్ వన్డే ప్రపంచకప్ (అక్టోబరు 5 నుంచి)కు ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో ఈసారి ఈ టోర్నీ ప్రాధాన్యం పెరిగింది. ఆడుతున్నది ఆసియాకప్‌లోనైనా అన్ని జట్ల దృష్టీ ప్రపంచకప్‌పైనే ఉందనడంలో సందేహం లేదు. విశ్వ సమరానికి ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లున్నా.. ఆసియాకప్ బహుళ జట్ల టోర్నీ వాతావరణాన్ని కల్పించడం జట్లకు కలిసొచ్చే అంశం. ప్రపంచకప్‌లో ఆడే జట్లలో అయిదు ఈ టోర్నీలో ఆడుతున్నాయి. పాకిస్థాన్, శ్రీలంకలు ఆసియాకప్‌కు ఆతిథ్యమిస్తుండగా.. భారత్ తన మ్యాచ్‌లన్నింటీ లంకలోనే ఆడనుంది. మాజీ విజేతలు భారత్, పాకిస్థాన్, శ్రీలంకలే ఆసియాకప్‌లో మేటి జట్లు అయినా.. బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లనూ తీసిపారేయలేం. ఈ టోర్నీలో ఆడడం నేపాల్‌కు ఇదే తొలిసారి.
ఫార్మాట్ ఇలా..
రౌండ్ రాబిన్ విధానంలో జరిగే టోర్నీలో రెండు గ్రూపులు ఉన్నాయి. గ్రూప్-ఎలో భారత్, పాకిస్థాన్, నేపాల్.. గ్రూప్-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ తలపడనున్నాయి. గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ ఫోర్ దశకు అర్హత సాధిస్తాయి. అందులో తొలి టాప్-2 ఫైనల్‌కు చేరుకుంటాయి. టోర్నీలో పాక్‌తో భారత్ రెండు లేదా మూడు సార్లు తలపడే అవకాశముంది.
సచిన్‌ను వాళ్లు దాటేస్తారా..!
సచిన్ తెందుల్కర్ 23 మ్యాచ్‌ల్లో 971 (2 శతకాలు, 7 అర్ధశతకాలు) పరుగులతో ఆసియాకప్‌లో భారత తరఫున అత్యధిక స్కోరర్‌గా ఉన్నాడు. అతణ్ని అధిగమించేందుకు కెప్టెన్ రోహిత్, కోహ్లీలకు ప్రస్తుత టోర్నీ ఓ అవకాశం. రోహిత్ ఇప్పటివరకు 22 మ్యాచ్‌ల్లో 745 పరుగులు చేశాడు. కోహ్లి 613 పరుగులు సాధించాడు. అతడు సచిన్ కన్నా 358 పరుగులు వెనుకబడి ఉన్నాడు. ఈ వ్యత్యాసం ఎక్కువే అనిపించవచ్చు కానీ.. కోహ్లి సామర్థ్యం గురించి వేరే చెప్పక్కర్లేదు.
భారత్ ఏడుసార్లు..
ఇది 16వ ఆసియాకప్. గత 15 ఆసియాకప్పుల్లో 13 వన్డే ఫార్మాట్లోనే జరిగాయి. రెండు సార్లు మాత్రమే టీ20 ఫార్మాట్లో నిర్వహించారు. గత టోర్నీలో పొట్టి క్రికెట్ ఆడారు. ప్రపంచకప్ నేపథ్యంలో ఈసారి వన్డే ఫార్మాట్లో ఆసియాకప్ ఆడుతున్నారు. టోర్నీలో అదిరే రికార్డు భారత్ సొంతం. టీమ్‌ఇండియా ఏడుసార్లు (1984, 1988, 1990-91, 1995, 2010, 2016-టీ20, 2018) ఆసియాకప్ విజేతగా నిలిచింది. 1984లో మొదలైన టోర్నీలో టీమ్‌ఇండియా 49 వన్డేలు ఆడి 31 గెలిచింది.
ఆ మ్యాచ్ కోసం
బాబర్ అజామ్ నేతృత్వంలోని పాక్, రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ మ్యాచ్ (గ్రూప్-ఎ) అత్యంత ఆసక్తి రేపుతోంది. శనివారం జరిగే ఈ పోరు కోసం రెండు దేశాల అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చిరకాల ప్రత్యర్థులకు ఈ టోర్నీలో హోరాహోరీ చరిత్రే ఉంది. ఆసియాకప్‌లో రెండు జట్లు ఇప్పటివరకు 13 సార్లు తలపడగా.. ఏడు సార్లు భారత్, అయిదు సార్లు పాక్ గెలిచాయి. 2018లో తలపడ్డ రెండుసార్లూ టీమ్‌ఇండియానే పైచేయి సాధించింది. పాక్‌తో గత అయిదు ఆసియాకప్ మ్యాచ్‌ల్లో భారత్ నాలుగు సార్లు నెగ్గడం విశేషం. ఈసారి ఆసియాకప్ గెలవడం సంతోషాన్నిచ్చే విషయమే అయినా.. కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్‌లకు ప్రధానంగా దృష్టిసారించే అంశాలు ఇంకా ఉన్నాయి. ఈ టోర్నీతో మిడిల్ ఆర్డర్‌పై స్పష్టత రానుంది. గాయాల నుంచి కోలుకుని పునరాగమనం చేస్తున్న ఆటగాళ్లు కఠినమైన క్రికెట్‌కు పూర్తి సంసిద్ధంగా ఉన్నారా లేదా అన్నది తేలిపోనుంది.
ఆసియాకప్ వన్డే ఫార్మాట్లో..
30 అత్యధిక వికెట్ల వీరుడు మురళీధరన్ పడగొట్టిన వికెట్ల సంఖ్య
87 అత్యల్ప స్కోరు. 2000లో పాకిస్థాన్‌పై బంగ్లా ఇలా తడబడింది.
183 ఓ బ్యాటర్ అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఈ రికార్డు (2012లో పాకిస్థాన్‌పై) కోహ్లి సొంతం.
1220 టాప్ స్కోరర్ చేసిన పరుగులు. జయసూర్య (25 మ్యాచ్‌ల్లో) పేరిట ఈ రికార్డు ఉంది.
385/7 అత్యధిక స్కోరు. 2010లో బంగ్లా దేశ్‌పై పాకిస్థాన్ ఈ స్కోరు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Bihar Caste survey: బిహార్‌లో ఓబీసీ, ఈబీసీలే 63%.. కులగణన సర్వేలో వెల్లడి
-
Harish Rao: ఎవరెన్ని ట్రిక్కులు చేసినా.. హ్యాట్రిక్ కొట్టేది సీఎం కేసీఆరే: మంత్రి హరీశ్
-
Amazon River: అమెజాన్ నదిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. వందకుపైగా డాల్ఫిన్ల మృత్యువాత
-
DL Ravindra Reddy: తెదేపా, జనసేనకు 160 సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు: డీఎల్
-
Salaar: ‘సలార్’ ఆ సినిమాకు రీమేక్..? ఈ రూమర్‌కు అసలు కారణమిదే!
-
PM modi: గహ్లోత్‌కు ఓటమి తప్పదని అర్థమైంది: మోదీ