Suryakumar Yadav : టీ20లంటే చాలు.. ఫార్మాట్‌ మారగానే చెలరేగిపోయాడు

నాలుగు రోజుల క్రితం వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియాతో టీమ్‌ఇండియా పోరు. జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉండగా అతనొచ్చాడు.

Updated : 24 Nov 2023 08:33 IST

నాలుగు రోజుల క్రితం వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియాతో టీమ్‌ఇండియా పోరు. జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉండగా అతనొచ్చాడు. ఆఖర్లో భారీ షాట్లతో జట్టుకు పోరాడే స్కోరు అందిస్తాడేమోనని అందరూ ఆశగా ఎదురు చూశారు. కానీ విఫలమయ్యాడు. ఇప్పుడు అదే ప్రత్యర్థి.. అదే ఒత్తిడి పరిస్థితి.. కానీ అతను విరుచుకుపడ్డాడు. వన్డే నుంచి టీ20కి ఫార్మాట్‌ మారగానే చెలరేగిపోయాడు. ఆ ఆటగాడు సూర్యకుమార్‌ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీ20 అంటే చాలు సూర్యకు పూనకం వచ్చేస్తోంది. వన్డేల్లో పరిస్థితులకు తగ్గట్లుగా ఆడటంలో విఫలమవుతున్న అతను.. పొట్టి ఫార్మాట్లో మాత్రం ఇరగదీస్తున్నాడు. ప్రపంచకప్‌ ఫైనల్లో స్లో బౌన్సర్లు వేసి సూర్యను ఆస్ట్రేలియా కట్టడి చేసింది. కానీ ఈ మ్యాచ్‌లో ఆ వ్యూహాన్ని చిత్తుచేస్తూ అతను విధ్వంసం సృష్టించాడు. ప్రపంచకప్‌లో 7 మ్యాచ్‌ల్లో 17.66 సగటుతో 106 పరుగులే చేశాడు. కానీ టీ20 అనగానే వాటన్నింటిని వెనక్కితోస్తూ అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగులతో కొనసాగుతున్న భారత బ్యాటర్‌ అతనే.

ఆ రనౌట్‌ చేసి ఉంటే..

మ్యాచ్‌లో శతకంతో విధ్వంసం సృష్టించిన ఇంగ్లిస్‌.. 32 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే ఔట్‌ కావాల్సింది. కానీ అతణ్ని రనౌట్‌ చేసే అవకాశాన్ని రవి బిష్ణోయ్‌ వృథా చేశాడు. ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్‌ మూడో బంతిని షార్ట్‌థర్డ్‌ వైపు ఇంగ్లిస్‌ ఆడాడు. స్మిత్‌ పిలవగానే నెమ్మదిగా స్పందించిన ఇంగ్లిస్‌ పరుగు కోసం వెళ్లాడు. కానీ అతను క్రీజులోకి చేరకముందే ఫీల్డర్‌ విసిరిన త్రో బిష్ణోయ్‌ చేతుల్లోకి వచ్చింది. కానీ అతను బంతిని పట్టలేకపోయాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న ఇంగ్లిస్‌ శతకంతో దెబ్బకొట్టాడు. అయితే రనౌట్‌ విషయంలో ఇంగ్లిస్‌ను అదృష్టం వరించగా.. స్మిత్‌ను దురదృష్టం వెంటాడింది. ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ అయిదో బంతికి వికెట్లకు అడ్డంగా వచ్చి వెనక్కి షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన స్మిత్‌ జారి కిందపడ్డాడు. తిరిగి లేచి పరుగు అందుకున్నాడు.  అతను క్రీజులోకి చేరేలోపు త్రో అందుకున్న ముకేశ్‌ స్టంప్స్‌ను ఎగరగొట్టాడు.
 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని