Ashwin: ఆ రోజు రోహిత్‌ ఏం చేశాడంటే..?

ఇటీవల ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు మధ్యలో టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ రాజ్‌కోట్‌ నుంచి చెన్నైకి వెళ్లిరావడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

Updated : 13 Mar 2024 10:07 IST

చెన్నై: ఇటీవల ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు మధ్యలో టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ రాజ్‌కోట్‌ నుంచి చెన్నైకి వెళ్లిరావడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తన తల్లి అనారోగ్యంతో ఐసీయూలో చేరడంతో అతను అత్యవసరంగా చెన్నై వెళ్లి వచ్చాడు. అయితే ఆ సమయంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తనకు ఇచ్చిన మద్దతును ఎప్పటికీ మరిచిపోలేనని అంటున్నాడు అశ్విన్‌. తాను కెప్టెన్‌గా ఉన్నా కూడా ఓ ఆటగాడికి అంత అండగా నిలిచేవాడిని కాదేమో అని అతనన్నాడు.

‘‘ఆ రోజు నేను నా గదిలోకి వెళ్లి ఏడుస్తూ ఉన్నా. ఎవరి కాల్స్‌ తీయలేదు. రోహిత్‌, ద్రవిడ్‌ నా దగ్గరికి వచ్చారు. నేను తుది జట్టులో సభ్యుడిని. మ్యాచ్‌ నుంచి వెళ్లిపోతే జట్టు పదిమందితో ఆడాల్సి ఉంటుంది. అదే సమయంలో చివరగా అమ్మతో ఎప్పుడు మాట్లాడానా అని ఆలోచిస్తున్నా. డాక్టర్‌కు ఫోన్‌ చేసి అమ్మ స్పృహలోనే ఉందా అని అడిగా. ఇప్పుడు తనను చూసే పరిస్థితి లేదన్నాడు. నా గుండె పగిలింది. మరోవైపు ఆ సమయానికి ఏ విమానం కూడా అందుబాటులో లేదు. ఏం చేయాలో పాలుపోని ఆ సమయంలో రోహిత్‌ వచ్చి.. ఎక్కువ ఆలోచించొద్దన్నాడు. ముందు అక్కడ్నుంచి బయల్దేరమని చెప్పి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసే పనిలో పడ్డాడు. నేను విమానాశ్రయానికి వెళ్లేసరికి ఫిజియో కమలేశ్‌ నాకోసం సిద్ధంగా ఉన్నాడు. నాకు తోడుగా వెళ్లమని రోహితే అతడికి చెప్పాడు. నాతో పాటు పుజారా సైతం వచ్చాడు. ఆ సమయంలో నా వెంట ఎవరూ లేకుంటే చాలా కష్టమయ్యేది. నేను కెప్టెన్‌గా ఉన్నా సరే ఆటగాడిని మ్యాచ్‌ నుంచి వెళ్లమంటా. కానీ అలాంటి ఏర్పాట్లు చేయించి ఉండను. అది నాకు నమ్మశక్యంగా అనిపించలేదు. రోహిత్‌లో ఆ రోజు గొప్ప నాయకుడిని చూశా’’ అని అశ్విన్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని