Mumbai Indians: కొత్త ముంబయి.. కొట్టేనా సిక్సర్‌

ముంబయి ఇండియన్స్‌ అంటే రోహిత్‌ శర్మ కెప్టెన్సీ గుర్తొస్తుంది. దశాబ్ద కాలంగా ఆ జట్టును నడిపించి.. ఏకంగా అయిదు టైటిళ్లు అందించాడు. కానీ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అలా ఉండదు.

Updated : 20 Mar 2024 07:06 IST

మరో 2 రోజుల్లో ఐపీఎల్‌-17

ముంబయి ఇండియన్స్‌ అంటే రోహిత్‌ శర్మ కెప్టెన్సీ గుర్తొస్తుంది. దశాబ్ద కాలంగా ఆ జట్టును నడిపించి.. ఏకంగా అయిదు టైటిళ్లు అందించాడు. కానీ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అలా ఉండదు. ఇకపై రోహిత్‌ కేవలం ఆటగాడే. రెండేేళ్ల క్రితం ఆటగాడిగా ముంబయి నుంచి బయటకు వెళ్లిన హార్దిక్‌ పాండ్య ఇప్పుడు కెప్టెన్‌గా తిరిగొచ్చాడు. ముంబయి నవ శకంలో ఈ సీజనే తొలి అడుగు. మరి హార్దిక్‌ అంచనాలను అందుకుంటాడా? ముంబయి టైటిళ్ల సిక్సర్‌ కొడుతుందా?

ఈనాడు క్రీడావిభాగం

2022లో లీగ్‌లో అడుగుపెట్టిన గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా హార్దిక్‌.. ముంబయిని వదిలి వెళ్లాడు. ఆ ఏడాది గుజరాత్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. నిరుడు మరోసారి ఫైనల్‌ చేర్చాడు. ఇప్పుడు ముంబయి ఇండియన్స్‌ సారథిగా తన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఎక్కడైతే ఆల్‌రౌండర్‌గా ఎదిగాడో.. ఇప్పుడు అక్కడే నాయకుడిగా మరింత మెరుగయ్యేందుకు ప్రయాణం ప్రారంభిస్తున్నాడు. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ది ఘనమైన చరిత్ర. ఇప్పటివరకూ అయిదు టైటిళ్లతో అత్యధిక సార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టుగా సీఎస్కేతో కలిసి అగ్రస్థానంలో ఉంది. అయితే చివరగా 2020లో ట్రోఫీ సొంతం చేసుకున్న తర్వాత రెండు సీజన్ల పాటు లీగ్‌ దశలోనే నిష్క్రమించింది. నిరుడు పుంజుకుని ప్లేఆఫ్స్‌ వరకూ వెళ్లింది. ఈ సారి మరో అడుగు ముందుకేసి ఆరో టైటిల్‌ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. కొత్త ఉత్సాహంతో, ఉత్తేజంతో బరిలో దిగనుంది.

బలాలు: లీగ్‌లో మరే జట్టుకు లేని దుర్భేద్యమైన బ్యాటింగ్‌ లైనప్‌ ముంబయి సొంతం. ఇన్నింగ్స్‌ను నిర్మించే ఆటగాళ్లు, పరిస్థితులకు తగ్గట్లు ఆడే బ్యాటర్లు, ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చే పవర్‌ హిట్టర్లు ఆ జట్టులో ఉన్నారు. రోహిత్‌, సూర్యకుమార్‌, ఇషాన్‌తో పాటు హైదరాబాదీ ఆటగాడు తిలక్‌ వర్మతో కూడిన బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఏ బౌలర్‌నైనా హడలెత్తించేదే. వీళ్లకు తోడు మళ్లీ హార్దిక్‌ జట్టులోకి రావడంతో పాటు టిమ్‌ డేవిడ్‌, బ్రేవిస్‌, మహమ్మద్‌ నబి రూపంలో బ్యాటింగ్‌ లోతు ఎక్కువగానే ఉంది. మరోవైపు అత్యుత్తమ పేస్‌ దళం ఆ జట్టుకున్న మరో బలం. గాయంతో గత సీజన్‌కు దూరమైన బుమ్రా ఇప్పుడు జట్టుతో చేరాడు. కొయెట్జీ, మదుశంకతో పాటు నువాన్‌ను ముంబయి వేలంలో తీసుకుంది. వీళ్లకు తోడు బెరెండార్ఫ్‌, ఆకాశ్‌ మధ్వాల్‌ ఉండనే ఉన్నారు. నబి, హార్దిక్‌, షెఫర్డ్‌, నేహాల్‌ ఉండటంతో ఆల్‌రౌండర్ల పరంగానూ ఆ జట్టుకు లోటు లేదు.

బలహీనతలు: అంతర్జాతీయ క్రికెట్లో సత్తాచాటుతున్నప్పటికీ ఐపీఎల్‌లో మాత్రం కొన్నేళ్లుగా రోహిత్‌ ఫామ్‌ అంతంతమాత్రంగానే ఉంది. 2019 నుంచి అతను లీగ్‌లో 70 మ్యాచ్‌ల్లో 28.49 సగటుతో 1718 పరుగులే చేశాడు. ఈ సారి కెప్టెన్సీ దూరం కావడంతో, కేవలం బ్యాటర్‌గానే ఆడబోతున్న అతను ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. ఇక రంజీల్లో ఆడని కారణంగా బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు కోల్పోయిన ఇషాన్‌ ఎలా ఆడతాడన్నది ఆసక్తికరం. స్పిన్‌ విభాగం మరోసారి బలహీనంగా కనిపిస్తోంది. మళ్లీ వెటరన్‌ స్పిన్నర్‌ పియూష్‌ చావ్లాపైనే ఆధారపడొచ్చు. శామ్స్‌ ములాని, శ్రేయస్‌ గోపాల్‌, కుమార్‌ కార్తీకేయపై పూర్తిగా నమ్మకం పెట్టుకోలేని పరిస్థితి. టీ20 ప్రపంచకప్‌ దృష్ట్యా పనిభారం, గాయాలు కూడా ముంబయికి ఇబ్బంది కలిగించేవే. బుమ్రా, రోహిత్‌ అన్ని మ్యాచ్‌ల్లో ఆడటంపై సందేహాలున్నాయి. గాయం నుంచి పూర్తిగా కోలుకోని సూర్యకుమార్‌ ఆరంభ మ్యాచ్‌ ఆడే అవకాశం లేదు. మదుశంక, కొయెట్జీ కూడా కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశముంది. రోహిత్‌ను కాదని హార్దిక్‌ను కెప్టెన్‌ చేయడంతో ముంబయి ఇండియన్స్‌ అభిమానులే కాకుండా ఆ జట్టులోని కొంతమంది సీనియర్‌ ఆటగాళ్లూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జట్టును ఒక్కతాటిపై నడిపించడం, డ్రెస్సింగ్‌ గదిలో మెరుగైన వాతావరణం ఉండేలా చూసుకోవడం హార్దిక్‌కు సవాలే. అతని సారథ్యంలో జట్టు పుంజుకోకుంటే తీవ్రమైన విమర్శలు తప్పవు.

దేశీయ క్రికెటర్లు: రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మ, విష్ణు వినోద్‌, అర్జున్‌ తెందుల్కర్‌, శామ్స్‌ ములాని, నేహాల్‌ వధెరా, హార్దిక్‌ పాండ్య, అన్షుల్‌, నమన్‌ ధీర్‌, శివాలిక్‌ శర్మ, బుమ్రా, కుమార్‌ కార్తీకేయ, పియూష్‌ చావ్లా, ఆకాశ్‌ మధ్వాల్‌, శ్రేయస్‌ గోపాల్‌.

విదేశీయులు: డెవాల్డ్‌ బ్రేవిస్‌, టిమ్‌ డేవిడ్‌, మహమ్మద్‌ నబి, రొమారియో షెఫర్డ్‌, గెరాల్డ్‌ కొయెట్జీ, బెరెండార్ఫ్‌, మదుశంక, నువాన్‌ తుషార.

కీలక ఆటగాళ్లు: హార్దిక్‌, రోహిత్‌, సూర్యకుమార్‌, బుమ్రా, ఇషాన్‌, తిలక్‌.

ఉత్తమ ప్రదర్శన: 2013, 2015, 2017, 2019, 2020లో ఛాంపియన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని