Team India: టీ20లకు ప్రత్యేక కోచ్‌ని నియమించండి: హర్భజన్‌ సింగ్‌

2024 టీ20 ప్రపంచకప్‌ని దృష్టిలో ఉంచుకుని టీమ్‌ఇండియా జట్టు యాజమాన్యానికి మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) కీలక సూచన చేశాడు.

Published : 26 Feb 2023 13:43 IST

ఇంటర్నెట్ డెస్క్: మొట్టమొదటి టీ20 ప్రపంచకప్‌ (2007)ని సొంతం చేసుకున్న టీమ్‌ఇండియా (Team India)..మరోసారి ఆ టోర్నీలో విజేతగా నిలవలేకపోయింది. 2014లో ఓ అవకాశం వచ్చినా.. శ్రీలంక చేతిలో ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. తర్వాత ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేదు. 2021లో సెమీస్‌కు కూడా చేరని భారత్.. గతేడాది జరిగిన ప్రపంచకప్‌లో నాకౌట్‌ పోరులో ఇంగ్లాండ్‌ చేతిలో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో 2024 టీ20 ప్రపంచకప్‌ని దృష్టిలో ఉంచుకుని టీమ్‌ఇండియా  యాజమాన్యానికి మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) కీలక సూచన చేశాడు. జట్టు తడబడకుండా ఉండాలంటే టీ20లకు ప్రత్యేక కోచ్‌ని నియమించాలన్నాడు. మిగిలిన ఫార్మాట్లలో బాధ్యతలను మరో కోచ్‌ చూసుకోవాలని చెప్పాడు.

‘అవును, టీమ్‌ఇండియాకు ఇద్దరు కెప్టెన్‌లు ఉన్నారు. భిన్నంగా ఎందుకు ఆలోచించకూడదు. ఇంగ్లాండ్‌ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ని కోచ్‌గా నియమించుకుంది. మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ లేదా ఆశిశ్‌ నెహ్రాతో ప్రయోగం చేయవచ్చు. నెహ్రా శిక్షణలో హార్దిక్‌ పాండ్య ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు కెప్టెన్‌గా పని చేసి విజయం సాధించాడు. కాబట్టి, టీ20 కాన్సెప్ట్‌ను, ఆ ఫార్మాట్‌ అవసరాలను గుర్తించే వారిని కోచ్‌గా నియమించండి. ప్రస్తుతం దృష్టంతా టీ20లపైనే ఉంది. పొట్టి ఫార్మాట్‌లో భారత జట్టును ఛాంపియన్‌గా ఎలా తీర్చిదిద్దాలో నెహ్రాకు తెలుసు. టెస్టులు, వన్డేలలో టీమ్‌ఇండియాను అగ్రస్థానానికి చేర్చడానికి అవసరమైన ప్రణాళికలు ద్రవిడ్‌ వద్ద ఉన్నాయి’ అని హర్భజన్‌ సింగ్ పేర్కొన్నాడు. 2024లో టీ20 ప్రపంచకప్‌ జరగనుండటంతో బీసీసీఐ ఇప్పటి నుంచే యువ జట్టుని తయారు చేయడంపై దృష్టిసారించింది. ఇందులో భాగంగానే సీనియర్లు అయిన రోహిత్‌, విరాట్ కోహ్లీలను టీ20లకు ఎంపిక చేయకుండా పాండ్యకు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని