T20 World Cup 2021:‘హార్దిక్ బౌలింగ్‌ చేయలేడు..భువీ లయ తప్పినట్లు కనిపిస్తున్నాడు’ 

పొట్టి ప్రపంచకప్‌ సన్నాహంను టీమ్‌ఇండియా ఘనంగా మొదలు పెట్టింది. సోమవారం ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో కోహ్లీ సేన 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌ (70 రిటైర్డ్‌ నాటౌట్‌; 46 బంతుల్లో 7×4, 3×6), కేఎల్‌ రాహుల్‌ (51; 24 బంతుల్లో 6×4, 3×6)

Published : 19 Oct 2021 16:49 IST

(Photo: Bhuvneshwar Kumar Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్: పొట్టి ప్రపంచకప్‌ సన్నాహకాలను టీమ్‌ఇండియా ఘనంగా మొదలు పెట్టింది. సోమవారం ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో కోహ్లీ సేన 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌ (70 రిటైర్డ్‌ నాటౌట్‌; 46 బంతుల్లో 7×4, 3×6), కేఎల్‌ రాహుల్‌ (51; 24 బంతుల్లో 6×4, 3×6) విధ్వంసం సృష్టించడంతో 189 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ బ్యాటర్లు కట్టడి చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. నాలుగు ఓవర్లలో  భువనేశ్వర్‌ కుమార్‌ 54 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేదు. స్పిన్నర్‌ రాహుల్ చాహర్‌  కూడా నిరాశపర్చాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసి 43 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీశాడు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఏ విధంగా బౌలింగ్‌ చేస్తుందోనని భారత మాజీ ఆటగాడు పార్థివ్‌ పటేల్ ఆందోళన వ్యక్తం చేశాడు. భువనేశ్వర్‌ కుమార్‌ ఫామ్‌ ఆందోళన కలిగిస్తోందన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్య ఒక్క ఓవర్‌ కూడా బౌలింగ్‌ చేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశాడు.

‘ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి కేవలం ఐదుగురు బౌలర్లతోనే బౌలింగ్‌ చేయించాడు. దీన్ని బట్టి చూస్తే మరికొన్ని మ్యాచ్‌లలో హార్దిక్ పాండ్య బౌలింగ్‌ చేస్తాడని అనుకోను. భువనేశ్వర్‌ కుమార్ బౌలింగ్‌ నన్ను ఆందోళనకు గురిచేస్తోంది. ఐపీఎల్‌లో అతడు ఆరు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. భువీ లయ తప్పినట్లు కనిపిస్తున్నాడు. ప్రాక్టీస్‌ లేనట్లుగా బౌలింగ్‌ చేస్తున్నాడు’ అని పార్థివ్‌ పటేల్‌ అన్నాడు. అక్టోబరు 20న టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వార్మప్‌ మ్యాచ్ జరగనుంది. అక్టోబరు 24న పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని