Hardik Pandya: చీలమండ వాచిపోయింది.. రక్తాన్ని తొలగించాల్సి వచ్చింది: హార్దిక్‌ పాండ్య

గాయం కారణంగా ఆటకు దూరం కావడం తననెంతో నిరాశపరిచిందని.. బయట నుంచి వచ్చే కామెంట్లను పట్టించుకోనని భారత స్టార్‌ క్రికెటర్ హార్దిక్‌ పాండ్య వ్యాఖ్యానించాడు.

Published : 17 Mar 2024 18:48 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్‌ (ODI World Cup 2023) సందర్భంగా గాయపడి దాదాపు నాలుగు నెలలపాటు హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) ఆటకు దూరమయ్యాడు. ఐపీఎల్ 17వ సీజన్‌ (IPL 2024) కోసం ప్రాక్టీస్‌ను ప్రారంభించిన పాండ్య గత వరల్డ్‌ కప్‌ కోసం సన్నద్ధత, గాయపడినప్పుడు ఎదురైన ఇబ్బందుల గురించి మాట్లాడాడు. మెగా టోర్నీకి ముందు 25 రోజులపాటు రిహాబిలిటేషన్‌కు సమయం ఇచ్చినా.. ఐదు రోజుల్లోనే జట్టుతో చేరేందుకు పాండ్య వచ్చాడు. కానీ, టోర్నీ మధ్యలో తీవ్రంగా ఇబ్బందిపడి వైదొలిగాడు. దీంతో మళ్లీ ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. 

‘‘రెండు లేదా మూడు నెలల ముందే వరల్డ్‌ కప్‌ కోసం సన్నద్ధమయ్యే ఆటగాడిని కాదు. నా ప్రయాణం ఏడాదిన్నర ముందే మొదలుపెట్టా. ఎలా సిద్ధం కావాలనే దానిపై ప్రణాళికలు రూపొందించుకున్నా. ఒక్కసారిగా గాయపడటంతో ఇబ్బందిపడ్డా. చాలా తక్కువ మందికే దాని గురించి తెలుసు. ఒకవేళ 25 రోజులపాటు విశ్రాంతి తీసుకుంటే నేను వరల్డ్‌ కప్‌ మిస్‌ అయ్యేవాడిని. కానీ, ఐదు రోజుల్లోనే వస్తానని మేనేజ్‌మెంట్‌కు చెప్పా. దాని కోసం నా చీలమండకు వివిధ చోట్ల ఇంజెక్షన్లు చేయించుకున్నా. వాచిపోవడంతో ఒకసారి రక్తాన్ని తొలగించాల్సి వచ్చింది’’ అని చెప్పాడు.

‘‘ఇలాంటి పరిస్థితుల్లో వెనక్కి వెళ్లకూడని బలంగా నిశ్చయించుకున్నా. నా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాలని భావించా.ఒకవేళ మళ్లీ గాయానికి గురైతే సుదీర్ఘకాలంపాటు ఆటకు దూరం కావాల్సి ఉంటుంది. దానికి నా వద్ద సమాధానం లేదు. ఒక్క శాతం అవకాశం ఉన్నా జట్టుతో పాటు ఉండేందుకు ప్రయత్నిస్తా. దురదృష్టవశాత్తూ గాయం మళ్లీ తిరగబెట్టింది. దాంతో మూడు నెలలపాటు ఆటకు దూరంగా ఉండాలని చెప్పారు. ఆరంభంలో నడవడానికి కూడా వీలు కాలేదు. వరల్డ్‌ కప్‌లో ఆడటం నాకెంతో గర్వకారణం. అంతకుమించిన మరొకటి ఉండదు. అందుకోసం పెయిన్‌ కిల్లర్స్‌ను తీసుకొని పది రోజుల్లోనే సిద్ధమయ్యా’’ అని హార్దిక్‌ తెలిపాడు. ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌గా ఈసారి హార్దిక్‌ పాండ్య ఐపీఎల్‌ ఆడనున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని