Hardik Pandya: నువ్వు ఛేదనలో కింగ్‌.. నాది సాయం మాత్రమే: విరాట్‌తో హార్దిక్‌ చిట్‌చాట్

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ చిరస్మరణీయ విజయం సాధించింది. టీమ్‌ఇండియా తరఫున విరాట్ కోహ్లీ, హార్దిక్‌ పాండ్య కీలక పాత్ర పోషించారు. దీంతో ఆసీస్‌ వేదికగా జరుగుతోన్న పొట్టికప్‌లో టీమ్‌ఇండియా శుభారంభం చేసింది.

Updated : 24 Oct 2022 11:13 IST

(ఫొటో సోర్స్‌: బీసీసీఐ ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించడంలో విరాట్ కోహ్లీ, హార్దిక పాండ్య కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ శతక భాగస్వామ్యం నిర్మించారు. మరీ ముఖ్యంగా విరాట్ తనదైన శైలిలో పాక్ బౌలర్లపై విరుచుకుపడి చివరి వరకు క్రీజ్‌లో ఉండి జట్టుకు విజయం చేకూర్చాడు. ప్రమాదకరమైన పాక్‌ బౌలర్‌ హారిస్‌ రవుఫ్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదిన విరాట్ మ్యాచ్‌ను భారత్‌వైపు తిప్పాడు. మ్యాచ్‌ అనంతరం ప్రత్యేకంగా విరాట్‌తో హార్దిక్‌ సంభాషించిన వీడియోను బీసీసీఐ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. కోహ్లీ అద్భుత ప్రదర్శనను హార్దిక్‌ ఆకాశానికి ఎత్తేశాడు.

‘‘హారిస్‌ బౌలింగ్‌లో విరాట్ కొట్టిన ఆ రెండు సిక్స్‌లు చాలా కీలకం. ఒకవేళ అప్పుడు కొట్టకపోతే మ్యాచ్‌ దూరమై ఉండేది. నేను చాలాసార్లు సిక్స్‌లు కొట్టాను.. కానీ విరాట్ బాదిన ఇవి మాత్రం చాలా చాలా ప్రత్యేకం. అవే మమ్మల్ని మ్యాచ్‌ విజయం వైపు నడిపించాయి. చాలా మంది క్రికెటర్లతో ఆడా. అయితే ఇలాంటి రెండు షాట్లు మాత్రం కోహ్లీ తప్పించి మరెవరూ కొట్టినట్లు నాకైతే గుర్తు లేదు. ఇక మ్యాచ్‌లో అత్యుత్తమం ఏంటంటే తీవ్రంగా ఇబ్బందిపడి గెలుపు శిఖరాలకు చేరాం. ఆ అనుభూతి కూడా అద్భుతం. ఛేదన సందర్భంగా మనం ఇద్దరం (కోహ్లీతో) మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయితే ఇక్కడ పాక్‌ బౌలర్లను తక్కువగా అంచనా వేయకూడదు. వారు చాలా బాగా బౌలింగ్‌ చేశారు’’

(ఫొటో సోర్స్‌: బీసీసీఐ ట్విటర్)

‘‘మ్యాచ్‌ సందర్భంగా డ్రెస్సింగ్‌ రూమంతా తీవ్ర ఒత్తిడిలో ఉంది. నాకు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే నేను పెద్ద మ్యాచ్‌లో ఉన్నా. అయితే నావరకైతే ఎందుకో తెలియదు గ్రౌండ్‌లోకి వచ్చేసరికి నా మైండ్‌ మొద్దుబారిపోయింది. ఇదే నేను కోరుకుంది. ఇక్కడ ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. మన జట్టుతో ఉన్న బంధం అద్భుతం. ఇక కీలక సమయంలో నేను రిస్క్‌ తీసుకొన్నా. ఒత్తిడి రాకుండా ఉండేందుకు చూశా. నా లక్ష్యం చాలా సింపుల్‌. జీవితం సులభతరం కావడానికి ఏం చేయాలో దానిని చేయడానికి సిద్ధంగా ఉంటా. ఇలా చాలాసార్లు నువ్వు (కోహ్లీ) చేశావు. నీకంటే ఒత్తిడిని హ్యాండిల్‌ చేయగల సమర్థులు మరొకరు లేరు’’ అని హార్దిక్‌ కొనియాడాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని