Jaydev Unadkat: చెన్నైతో మ్యాచ్‌.. స్లో బంతులు సంధించడానికి కారణమదే: జయ్‌దేవ్‌ ఉనద్కత్

ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నైను ఓడించిన హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకింది. హార్డ్‌ హిట్టర్లు కలిగిన చెన్నైను కట్టడి చేయడంలో హైదరాబాద్‌ బౌలర్లు సక్సెస్ అయ్యారు.

Published : 06 Apr 2024 13:16 IST

ఇంటర్నెట్ డెస్క్: చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ పేసర్లు ఎక్కువగా స్లో ఆఫ్ కట్టర్‌ బంతులను సంధించారు. దీంతో అప్పటి వరకు దూకుడుగా ఆడిన శివమ్‌ దూబె కూడా ఇబ్బంది పడ్డాడు. చివర్లో వేగంగా ఆడేందుకు ప్రయత్నించి రవీంద్ర జడేజాను హైదరాబాద్‌ బౌలర్లు కట్టడి చేయడంలో విజయవంతమయ్యారు. అలా స్లో బంతులు సంధించడానికి గల  కారణాన్ని బయటపెట్టాడు హైదరాబాద్‌ బౌలర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌. పిచ్‌ కూడా మందకొడిగా ఉండటంతో ఫాస్ట్‌ కంటే స్లో బంతులను సంధించడం మంచిదని భావించినట్లు తెలిపాడు. జయ్‌దేవ్‌ తన నాలుగు ఓవర్ల కోటాలో ఒక వికెట్‌ తీసి 29 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

‘‘ఉప్పల్‌ పిచ్‌ నెమ్మదిగా మారిపోయింది. ఫాస్ట్‌గా బంతులేసినా బ్యాటర్లకు పరుగులు రాబట్టేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. దీంతో పరిస్థితికి అనుగుణంగా పిచ్‌ను సద్వినియోగం చేసుకోవాలని భావించాం. ఆఫ్‌ కట్టర్లు, స్లో బంతులను సంధించాం. వైవిధ్యంగా బౌలింగ్‌ చేయడం వల్ల చెన్నై బ్యాటర్లను కట్టడి చేయగలిగాం’’ అని ఉనద్కత్ తెలిపాడు. హైదరాబాద్‌ పిచ్‌పై ఐపీఎల్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన అతడు 14 వికెట్లు పడగొట్టాడు. 

ఆ విషయంలో రుతురాజ్‌ తికమక పడ్డాడు: మాజీ క్రికెటర్లు

ఎంఎస్ ధోనీ (MS Dhoni) చివరి మూడు బంతులు ఉండగా క్రీజ్‌లోకి వచ్చాడు. కేవలం రెండు బంతులను మాత్రమే ఎదుర్కొని ఒక్క పరుగే చేశాడు. అతడు ఇంకాస్త ముందుగా బ్యాటింగ్‌కు పంపిస్తే బాగుండేదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ‘‘ధోనీ విషయంలో కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్ తికమకపడుతున్నట్లు ఉంది. దిల్లీపై అదరగొట్టిన ధోనీని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందు పంపాల్సింది. కేవలం మూడు బంతుల కోసమే మైదానంలోకి రావాల్సి అవసరం ఏముంది? ఇలాంటి నిర్ణయాలు ఆశ్చర్యానికి గురి చేస్తోంది’’ అని మైకెల్ వాన్‌ అన్నాడు. ‘‘భువనేశ్వర్‌, ఉనద్కత్‌ ఆఫ్‌ కట్టర్లు, స్లో బంతులు వేస్తున్నప్పుడు.. రవీంద్ర జడేజా కాకుండా కుడి చేతివాటం బ్యాటర్ ధోనీ క్రీజ్‌లోకి వచ్చుంటే బాగుండేది. అలాంటి బౌలింగ్‌లో ధోనీ భారీ షాట్లు కొట్టగలడు’’ అని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్‌ పఠాన్ పోస్టు పెట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని