సిరాజ్ కోసం దేవుడికి థ్యాంక్స్ చెప్పా‌: శార్దూల్‌

ఇకపై తనని పేసర్‌గా మాత్రమే భావించరని, బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా పిలుస్తారని టీమిండియా ఆటగాడు శార్దూల్‌ ఠాకూర్‌ అన్నాడు. గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నిర్ణయాత్మక టెస్టులో ఏడు వికెట్లతో పాటు ...

Published : 23 Jan 2021 01:24 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఇకపై తనని పేసర్‌గా మాత్రమే భావించరని, బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా పిలుస్తారని టీమిండియా ఆటగాడు శార్దూల్‌ ఠాకూర్‌ అన్నాడు. గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నిర్ణయాత్మక టెస్టులో ఏడు వికెట్లతో పాటు అర్ధశతకంతో శార్దూల్‌ సత్తాచాటిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 188/6తో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సుందర్‌తో కలిసి శతక భాగస్వామ్యం నెలకొల్పాడు. కాగా, ఆసీస్ పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న శార్దూల్‌ సిరీస్‌లో తన అనుభవాలు పంచుకున్నాడు.

‘‘ఇక నుంచి నన్ను బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా పిలుస్తారు. నాకు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉంది. భవిష్యత్‌లోనూ రాణిస్తా. క్రీజులోకి దిగాల్సిన పరిస్థితి వస్తే పరుగులు సాధించి జట్టుకు తోడ్పడతా. అయితే బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో ఆడటం అంత సులువు కాదు. గబ్బాలో వారి రికార్డులు అందరికీ తెలుసు. అయినా వాళ్లని ఓడించాం. కాగా, ఆఖరి టెస్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించినందుకు ఎంతో సంతోషంగా ఉంది’’ అని శార్దూల్‌ తెలిపాడు.

సుందర్‌తో కలిసి నెలకొల్పిన 123 పరుగుల భాగస్వామ్యం గురించి శార్దూల్‌ మాట్లాడుతూ.. ‘‘మేం ఎక్కువసేపు క్రీజులో నిలవాలని భావించాం. వీలైనంత సేపు బౌలర్లను ఎదుర్కోవాలనేది మా ప్రణాళిక. ఆ సమయంలో వికెట్లను కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. స్కోరుబోర్డు గురించి అసలు ఆలోచించలేదు. ఒకరికొకరం సహకరించుకుంటూ భాగస్వామ్యాన్ని నిర్మించాం. మా ఇద్దరి మధ్య ఉన్న సమన్వయం వల్లే శతక భాగస్వామ్యం సాధ్యమైంది’’ అని అన్నాడు.

రెండో ఇన్నింగ్స్‌లో శార్దూల్ నాలుగు వికెట్లు తీయగా, హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌ అయిదు వికెట్లతో సత్తాచాటాడు. కాగా, అయిదు వికెట్లు తీయలేకపోయినందుకు ఏమైనా బాధపడ్డారా అని అడిగిన ప్రశ్నకు శార్దూల్‌ సమాధానమిచ్చాడు. ‘‘ఎలాంటి బాధ లేదు. నిజం చెప్పాలంటే.. ఆ ఘనత సిరాజ్‌ సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. అతడు అయిదు వికెట్లు సాధించాలని కోరుకున్నా. ఎందుకంటే అతడు ఎన్నో క్లిష్టపరిస్థితుల మధ్య ఈ సిరీస్ ఆడాడు’’ పేర్కొన్నాడు.

‘‘సిరాజ్‌కు ఈ సిరీస్ ఎంతో కీలకం‌. ఇటీవల అతడు తన తండ్రిని కోల్పోయాడు. సిరాజ్‌ టెస్టు క్రికెట్‌ ఆడాలనేది అతడి తండ్రి కల. అయితే ఆయన ఈ లోకంలో లేనప్పటికీ, పైనుంచి సిరాజ్‌ ప్రదర్శన చూశాడనుకుంటున్నా. అయిదు వికెట్ల ఘనత అందుకున్న సిరాజ్‌ను చూసి ఆయన కచ్చితంగా సంతోషించి ఉంటారు. సిరాజ్‌ తీసిన అయిదో వికెట్‌లో నేను భాగస్వామ్యం అయినందుకు ఎంతో ఆనందించా. అతడికి అయిదు వికెట్లు సాధించిన క్షణంలో దేవుడికి కృతజ్ఞతలు చెప్పా’’ అని శార్దూల్ తెలిపాడు. రెండో ఇన్నింగ్స్‌లో హేజిల్‌వుడ్‌ను ఔట్‌ చేసి సిరాజ్‌ అయిదో వికెట్‌ సాధించిన విషయం తెలిసిందే. హేజిల్‌వుడ్‌ థర్డ్‌మ్యాన్‌ దిశగా షాట్‌కు యత్నించగా శార్దూల్ బంతిని ఒడిసిపట్టాడు.

ఇవీ చదవండి

పంత్ బాగా ఆడితే నా కెరీర్‌ ముగిసిపోదు

ఆసీస్‌ కాదు.. టీమిండియాపై దృష్టిపెట్టండి  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని