ODI WC 2023: పాక్‌ కోచ్‌ మికీ ఆర్థర్‌ ‘బీసీసీఐ’ ఈవెంట్‌ కామెంట్లకు ఐసీసీ కౌంటర్!

 వరల్డ్‌ కప్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన భారత్-పాకిస్థాన్‌ (INDvsPAK) మ్యాచ్‌ నిర్వహణపై కోచ్‌ మికీ ఆర్థర్‌ చేసిన కామెంట్లపై ఐసీసీ స్పందించింది. 

Published : 17 Oct 2023 11:30 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వరల్డ్‌ కప్‌లో భారత్-పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్‌ను చూస్తుంటే ఐసీసీ ఈవెంట్‌లా కాకుండా బీసీసీఐ ఈవెంట్‌ వలే ఉందన్న మికీ ఆర్థర్‌ వ్యాఖ్యలపై ఐసీసీ స్పందించింది. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ ఐసీసీ ఛైర్మన్‌ గ్రెగ్‌ బార్‌క్లే పేర్కొన్నాడు. ‘‘మేం నిర్వహించే ప్రతి ఈవెంట్‌ సందర్భంగా ఏదో ఒక దశలో ఇలాంటి విమర్శలు వస్తుంటాయి. అయితే, వాటికి దూరంగా ఉంటాం. మరింత ఉత్తమంగా టోర్నీని నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడే ఈ మెగా సమరం (ODI World Cup 2023) ప్రారంభమైంది. ఇంకా చాలా మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఇంకేం మార్పులు చేయాలి..? మరింత నాణ్యంగా ఎలా నిర్వహించాలి? అనే విషయాలపై కసరత్తు చేస్తాం. క్రికెట్‌ను ప్రతి ఒక్కరికీ చేరువ చేసేందుకు ఎల్లవేళలా ప్రయత్నిస్తూనే ఉంటాం. కచ్చితంగా ఇదొక అత్యుత్తమ వరల్డ్‌ కప్‌గా నిలుస్తుందన్నది మా నమ్మకం’’ అని బార్‌క్లే స్పష్టం చేసినట్లు క్రికెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. 

ఇంతకీ మికీ ఆర్థర్‌ ఏమన్నాడంటే..?

బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో పాక్‌పై భారత్ ఆధిపత్యంతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌ అనంతరం పాక్‌ క్రికెట్ జట్టు కోచ్‌ మికీ ఆర్థర్‌ విలేకర్ల సమావేశంలో మాట్లాడాడు. తమ జట్టు ప్రదర్శన నిరాశపరిచిందని చెబుతూనే.. ఐసీసీపై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. తమ జట్టు ఆడేటప్పుడు మైదానంలో సరైన మద్దతు లభించలేదని.. ఇది ఐసీసీ ఈవెంట్‌లా కాకుండా ద్వైపాక్షిక సిరీస్‌ మ్యాచ్‌ అనిపించిందని వ్యాఖ్యానించాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో పాక్‌ మాజీ క్రికెటర్ల నుంచే మికీ ఆర్థర్ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయడం కంటే ముందు ఓటమికిగల కారణాలను విశ్లేషించుకోవాలని పాక్‌ మాజీలు హితవు పలికారు.

వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో పాక్‌పై భారత్‌ (IND vs PAK) ఆధిక్యం కొనసాగింది. తాజా విజయం మెగా టోర్నీల్లో ఎనిమిదోది కావడం విశేషం. గతంలో కాస్త పోటీనిచ్చే పాక్‌.. ఈసారి మాత్రం ఘోరంగా విఫలమైంది. అదే సమయంలో కోహ్లీ నుంచి పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ భారత జెర్సీలను అడిగి తీసుకోవడంపైనా విమర్శలు రేగాయి. ఇలాంటి సమయంలో బహిరంగంగా కాకుండా.. ప్రైవేట్‌గా తీసుకొని ఉంటే బాగుండేదని మాజీలు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని