Gautam Gambhir: సెలెక్టర్లు ఆ ముగ్గుర్ని మించి.. ఆలోచించొచ్చు : గంభీర్‌

ఆటలో వ్యక్తులు ముఖ్యం కాదని.. జట్టు లక్ష్యాలే ప్రధానమని గౌతమ్‌ గంభీర్‌ అన్నారు. వచ్చే టీ20 ప్రపంచకప్‌(2024) గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు ఉండాలన్నాడు.

Updated : 30 Dec 2022 15:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : టీమ్‌ఇండియా(Team India) సీనియర్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లీ(Virat Kohli), రోహిత్‌ శర్మ(Rohit Sharma), కేఎల్‌ రాహుల్‌(KL Rahul)ను మించి బీసీసీఐ(BCCI) సెలెక్టర్లు ఇతరుల వైపు చూడాలని అనుకుంటే.. అలాగే చేయాలని మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌(Gautam Gambhir) సూచించాడు. అయితే దీనిపై స్పష్టత ఉండాలని కోరాడు.

‘ఈ అంశంపై స్పష్టత ఉండాలి. ఈ ఆటగాళ్లకు.. సెలెక్టర్లకు మధ్య మంచి కమ్యూనికేషన్‌ ఉండాలి. ఒకవేళ సెలెక్టర్లు వీళ్లను మించి ఇతరులను తీసుకోవాలని నిర్ణయించుకుంటే.. అలాగే చేయాలి. చాలా దేశాలు ఇలా చేశాయి’ అని గంభీర్‌ ఓ క్రీడా ఛానల్‌తో అన్నాడు. అలాగే సీనియర్లను తొలగించినప్పుడు జరిగే రాద్దాంతంపై కూడా గంభీర్‌ స్పందించాడు. సెలెక్టర్లు, మేనేజ్‌మెంట్‌ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు.. మనం అతిగా స్పందిస్తామని చెప్పాడు.

‘‘చివరగా.. ఆటలో వ్యక్తుల గురించి ఆలోచించకూడదు. జట్టు లక్ష్యాలే ప్రధానం. వచ్చే టీ20 ప్రపంచకప్‌(2024) టోర్నీ కోసం ఎలాంటి ప్రణాళికలతో ముందుకువెళ్తున్నారన్నదే ముఖ్యం. ఎందుకంటే మనం అక్కడికి వెళ్లి గెలవాలి. ఇలాంటి వాళ్లు ఇప్పటి వరకు దాన్ని సాధించకపోతే.. సూర్యకుమార్‌ లాంటి యువ ఆటగాళ్లు ఆ కల నెరవేర్చుతారేమో ఎవరికి తెలుసు’ అని గంభీర్‌ వ్యాఖ్యానించాడు. ఇక ఈ ముగ్గురు సీనియర్లు పొట్టిఫార్మాట్‌లో తిరిగి పుంజుకోవడం ప్రస్తుతానికైతే కష్టమేనని పేర్కొన్నాడు. కేఎల్ రాహుల్‌ ఫామ్‌లో లేకపోవడం.. విరాట్, రోహిత్ వయసును దృష్టిలో ఉంచుకొని గంభీర్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చాలా దేశాలు యువకులతోనే తమ జట్లను తయారు చేసుకొనే కార్యాచరణలో మునిగిపోయాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని