Gavaskar: స్లిమ్‌గా ఉన్నవారే కావాలనుకుంటే ఫ్యాషన్‌ షోకి వెళ్లండి.. సెలెక్టర్లపై సన్నీ ఆగ్రహం

ఆటగాళ్లను వారి శరీర ఆకారాలను బట్టి కాకుండా వారి ఆటతీరును బట్టి ఎంపిక చేయాలని సునీల్ గావస్కర్‌ (Sunil Gavaskar) సెలెక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Updated : 20 Jan 2023 13:11 IST

ఇంటర్నెట్ డెస్క్: గత కొంతకాలంగా రంజీ ట్రోఫీలో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్‌ ఖాన్‌(Sarfaraz Khan)ని టెస్టు జట్టులోకి ఎంపిక చేయకపోవడంపై భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) తీవ్రంగా స్పందించారు. సెలెక్టర్లు క్రికెటర్లను ఆకారాన్ని బట్టి కాకుండా వారి ఫామ్‌ని చూసి ఎంపిక చేయాలని సూచించారు. స్లిమ్‌గా ఉన్నవారిని మాత్రమే ఎంపిక చేయాలనుకుంటే సెలెక్టర్లు ఫ్యాషన్ షోకి వెళ్లి కొంతమంది మోడల్స్‌ని ఎంచుకుని వారికి బ్యాట్, బాల్‌ ఇచ్చి ఆపై వారిని చేర్చుకోవాలని  గావస్కర్‌ వ్యాఖ్యానించారు.

‘అన్‌ఫిట్‌గా ఉంటే సెంచరీలు చేయలేరు. కాబట్టి క్రికెట్‌లో ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. మీరు యో-యో టెస్ట్ చేయాలనుకోవడంలో నాకు ఇబ్బంది లేదు. కానీ, యో-యో టెస్ట్ మాత్రమే ప్రామాణికం కాదు. ఆటగాడు క్రికెట్‌కు సరిపోతాడనుకుంటే యో-యో టెస్టు ముఖ్యమైనదిగా భావించకూడదు. ఒక ఆటగాడు సెంచరీలు బాదుతున్నాడంటే అతడు క్రికెట్‌కు ఆడటానికి ఫిట్‌గా ఉన్నాడని అర్థం. మీకు స్లిమ్‌గా ఉన్న క్రికెటర్లు మాత్రమే కావాలనుకుంటే మీరు ఫ్యాషన్ షోకి వెళ్లి కొంతమంది మోడల్స్‌ని ఎంచుకుని, ఆపై వారికి బ్యాట్, బాల్ ఇచ్చి జట్టులోకి చేర్చుకోండి. క్రికెటర్లు శారీరకంగా చాలా ఆకారాల్లో ఉన్నారు. ఆకారాన్ని బట్టి కాకుండా వారు చేసే పరుగులు, తీసే వికెట్ల ఆధారంగా ఎంపిక చేయండి’ అని  గావస్కర్‌ అన్నారు.  

దేశవాళీ క్రికెట్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌ టన్నుల కొద్ది పరుగులు చేస్తున్నా జాతీయ జట్టులోకి పిలుపు రావట్లేదు. బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో తొలి రెండు టెస్టుల కోసం ఇటీవల భారత జట్టును ప్ర్టకటించారు. ఈ సిరీస్‌కు సెలెక్టర్ల నుంచి పిలుపొస్తుందని సర్ఫరాజ్‌ ఆశించాడు. కానీ, అతడికి మరోసారి నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలోనే సెలెక్టర్లపై సన్నీ ఫైరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని