Sarfaraz Khan: మీటింగుల్లో రోహిత్ మాట్లాడుతుంటే.. లగాన్‌ సినిమా గుర్తుకొస్తుంది: సర్ఫరాజ్‌ ఖాన్

కుర్రాళ్లను ప్రోత్సహించడంలో కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ముందుంటాడు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ సర్ఫరాజ్ ఖాన్. డొమిస్టిక్‌ క్రికెట్‌లో భారీగా పరుగులు చేసిన అతడికి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో అవకాశం కల్పించాడు.

Published : 16 Mar 2024 13:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టి.. జాతీయ జట్టులో స్థానం కోసం చాన్నాళ్లు ఎదురు చూసిన సర్ఫరాజ్‌ ఖాన్‌కు (Sarfaraz Khan) ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో అవకాశం దక్కింది. అక్కడ తన సత్తా చాటాడు. మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. రోహిత్ శర్మ (Rohit Sharma) నాయకత్వంలో ఆడటంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మైదానంలో, డ్రెస్సింగ్ రూమ్‌, జట్టు సమావేశాల్లో సారథిగా రోహిత్ ఎలా ఉంటాడనే విషయాలను వెల్లడించాడు. 

‘‘రోహిత్ శర్మ నాయకత్వంలో ఆడటాన్ని ఆస్వాదించా. ఐపీఎల్‌లోనూ 9 ఏళ్ల నుంచి వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నా. కానీ, హిట్‌మ్యాన్‌ కెప్టెన్సీలో ఎన్నో అనుభవాలను సొంతం చేసుకున్నా. అతడిని చూసినప్పుడల్లా తెలియని గౌరవభావం కలుగుతుంది. ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తాడు. జట్టు సమావేశాల్లో అతడు దేని గురించైనా మాట్లాడుతుంటే.. నాకు ఆమిర్‌ ఖాన్‌ సినిమా లగాన్‌ గుర్తుకొస్తుంది. మైదానంలో లేదా డ్రెస్సింగ్‌ రూమ్‌లో సహచరులను రోహిత్ ఎప్పుడూ తూలనాడడు. ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా గట్టిగా చెబుతాడు. అయితే, చెప్పే విధానం విభిన్నంగా ఉంటుంది. మమ్మల్ని తిడుతున్నట్లు మాకేమీ అనిపించదు. ముంబయిలో మాట్లాడే తీరు అలానే ఉంటుంది. జట్టు సహచరులతో అతడి అనుబంధం చాలా బాగుంటుంది. సీనియర్‌ను అనే అహంభావం ప్రదర్శించడు’’

‘‘చిన్నప్పటి నుంచి టెస్టు క్రికెట్‌ గొప్పదనం గురించి వింటూనే ఉన్నా. మా నాన్న కూడా సుదీర్ఘ ఫార్మాట్‌లో సత్తా చాటితేనే క్రికెటర్‌గా నిలదొక్కుకోవచ్చని చెబుతారు. నేను తొలిసారి సిరీస్‌ ఆడుతున్నప్పుడు కాస్త ఒత్తిడి అనిపించినా.. దానిని త్వరగానే అధిగమించా. స్పిన్ దిగ్గజం అనిల్‌ కుంబ్లే చేతులమీదుగా క్యాప్‌ అందుకోవడం చిరస్మరణీయం. మరో క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ప్రశంసలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన సూచనలనూ తప్పకుండా పాటిస్తా. నేను టెస్టుల్లోకి అరంగేట్రం చేశాక.. నా ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య భారీగా పెరిగింది. అంతకుముందు 6 లక్షల నుంచి 7 లక్షలు ఉండే ఫాలోవర్లు 1.5 మిలియన్లకు చేరారు. భారత జట్టుకు ఆడటం వల్లే ఇదంతా సాధ్యమైంది’’ అని సర్ఫరాజ్‌ వ్యాఖ్యానించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని