India vs England: అదిగో సెమీస్‌ బెర్తు.. ఇంగ్లాండ్‌తో భారత్‌ ఢీ

చిన్నదైనా, పెద్దదైనా.. ప్రపంచకప్‌లో ఏ జట్టు ఎదురొచ్చినా తగ్గట్లేదు టీమ్‌ఇండియా. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ విసిరిన సవాళ్లను కూడా కాచుకుంది. మధ్యలో మిగతా జట్లు అసలు భారత్‌కు పోటీనే ఇవ్వలేకపోయాయి.

Updated : 29 Oct 2023 09:48 IST

గెలిస్తే నాకౌట్‌కు
ఇంగ్లాండ్‌తో నేడు భారత్‌ పోరు
లఖ్‌నవూ

చిన్నదైనా, పెద్దదైనా.. ప్రపంచకప్‌లో ఏ జట్టు ఎదురొచ్చినా తగ్గట్లేదు టీమ్‌ఇండియా. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ విసిరిన సవాళ్లను కూడా కాచుకుంది. మధ్యలో మిగతా జట్లు అసలు భారత్‌కు పోటీనే ఇవ్వలేకపోయాయి. అయిదుకు అయిదు విజయాలతో సెమీస్‌కు అత్యంత చేరువగా నిలిచిన రోహిత్‌ సేన.. ఇంకొక్క గెలుపు సాధిస్తే నాకౌట్‌లో అడుగు పెడుతుంది. కివీస్‌ను ఓడించాక వారం విరామం పొందిన టీమ్‌ఇండియా.. తర్వాతి పోరుకు సిద్ధమైంది. టోర్నీలో పేలవ ప్రదర్శనతో షాక్‌ల మీద షాక్‌లు తిన్న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ను ఢీకొనబోతున్న భారత్‌.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే సెమీస్‌ చేరుతుంది.

సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో ఎదురు లేకుండా సాగిపోతున్న టీమ్‌ఇండియా.. సెమీస్‌ బెర్తుపై గురి పెట్టింది. టోర్నీలో ఒక్క ఓటమీ లేకుండా సాగిపోతున్న ఏకైక జట్టయిన భారత్‌.. ఆదివారం ఇంగ్లాండ్‌తో పోరులోనూ ఆ రికార్డును నిలబెట్టుకుంటే కూడా నాకౌట్‌లో అడుగు పెడుతుంది. టోర్నీలో ఇరు జట్లదీ భిన్నమైన ప్రయాణం. మంచి అంచనాలతో బరిలో దిగిన భారత్‌.. అనుకున్నదానికంటే మెరుగైన ప్రదర్శన చేస్తూ ఆడిన అయిదు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. ఇక భారత్‌ను మించి హాట్‌ ఫేవరెట్‌గా ప్రపంచకప్‌లో అడుగు పెట్టిన డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ మాత్రం ఘోరమైన ప్రదర్శన చేసింది. అయిదు మ్యాచ్‌ల్లో ఒకటే విజయం, అది కూడా బంగ్లాదేశ్‌పై సాధించింది. అఫ్గానిస్థాన్‌, శ్రీలంక లాంటి చిన్న జట్ల చేతుల్లో ఓటమి పాలవడంతో ఆ జట్టు దాదాపుగా సెమీస్‌కు దూరమైనట్లే కనిపిస్తోంది. అయితే మిగతా నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి, వేరే సమీకరణాలు కూడా కలిసొస్తే ముందంజ వేయగలమేమో అని ఆ జట్టు చూస్తోంది. బలమైన భారత్‌ను ఓడించి మళ్లీ గాడిన పడాలని ఇంగ్లిష్‌ జట్టు భావిస్తోంది.

పిచ్‌

ఏకనా స్టేడియం పిచ్‌ మందకొడిగా ఉంటుంది. భారీ స్కోర్లు నమోదు కాకపోవచ్చు. స్పిన్నర్లతో పాటు పేసర్లూ బాగా ప్రభావం చూపుతారు. కుదురుకుంటే పరుగులు చేయొచ్చు. ఆరంభంలో పేస్‌ బౌలింగ్‌ ఎదుర్కోవడం కష్టం. మ్యాచ్‌ సాగేకొద్దీ స్పిన్‌కు అనుకూలిస్తుంది.

ఎదురుదాడికి సిద్ధమా?

ఈ టోర్నీలో ప్రదర్శన ఎంత పేలవంగా ఉన్నప్పటికీ.. ఇంగ్లాండ్‌ బలమైన జట్టు అనడంలో సందేహం లేదు. ప్రపంచకప్‌ ముందు వరకు అన్ని జట్లనూ భయపెట్టింది. ఒక మ్యాచ్‌లో అన్నీ కలిసొస్తే ఆ జట్టు ఆటతీరే మారిపోవచ్చు. కాబట్టి బట్లర్‌ సేనను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. సెమీస్‌ అవకాశాలు బాగా సన్నగిల్లి, ఈ మ్యాచ్‌ కూడా ఓడితే టోర్నీలో ఆ జట్టు కథ ముగుస్తుంది కాబట్టి ఇంగ్లాండ్‌ ఇక తెగించే ఆడే అవకాశముంది. మలన్‌, బెయిర్‌స్టో, రూట్‌, స్టోక్స్‌, బట్లర్‌, లివింగ్‌స్టన్‌లతో కూడిన బ్యాటింగ్‌ ఆర్డర్‌ తనదైన రోజున ఎలాంటి బౌలింగ్‌నైనా తుత్తునియలు చేయగలదు. హార్దిక్‌ పాండ్య లేక కొంచెం బలహీన పడ్డ భారత బౌలింగ్‌ విభాగం.. ఈ మ్యాచ్‌లో జాగ్రత్తగా ఉండాల్సిందే. బౌలింగ్‌లో వుడ్‌, వోక్స్‌ ఆ జట్టును తీవ్రంగా నిరాశపరుస్తున్నారు.

తుది జట్లు (అంచనా)... భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌, కోహ్లి, శ్రేయస్‌, రాహుల్‌, సూర్యకుమార్‌, జడేజా, కుల్‌దీప్‌, అశ్విన్‌/సిరాజ్‌, బుమ్రా, షమి.

ఇంగ్లాండ్‌: మలన్‌, బెయిర్‌స్టో, రూట్‌, స్టోక్స్‌, బట్లర్‌ (కెప్టెన్‌), లివింగ్‌స్టన్‌, బ్రూక్‌/మొయిన్‌ అలీ, రషీద్‌, విల్లీ, వోక్స్‌, వుడ్‌/అట్కిన్సన్‌.


కూర్పు ఎలా?

ఫామ్‌ పరంగా భారత్‌కు బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో పెద్ద సమస్యలేమీ లేవు. రోహిత్‌, కోహ్లి, శ్రేయస్‌, రాహుల్‌ నిలకడగా రాణిస్తూ జట్టును గెలిపిస్తున్నారు. శుభ్‌మన్‌ కూడా మంచి లయతో కనిపిస్తున్నాడు. బౌలింగ్‌లో బుమ్రా, కుల్‌దీప్‌, జడేజా సత్తా చాటుతున్నారు. గత మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్న షమి కూడా అదరగొట్టాడు. వీళ్లందరూ ఇదే జోరును కొనసాగిస్తే ఇంగ్లాండ్‌ను ఓడించడం కష్టమేమీ కాదు. అయితే ఈ మ్యాచ్‌కు ఎలాంటి కూర్పుతో బరిలోకి దిగాలనే విషయంలో జట్టు యాజమాన్యం తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. హార్దిక్‌ గాయపడి కొన్ని మ్యాచ్‌లకు దూరం కావడంతో.. గత మ్యాచ్‌లో శార్దూల్‌ను కూడా తప్పించి సూర్యకుమార్‌, షమిలను తుది జట్టులో ఆడించారు. షమి అయిదు వికెట్లతో అదరగొట్టగా.. సూర్య విఫలమయ్యాడు. లఖ్‌నవూ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలమన్న అంచనాల నేపథ్యంలో మూడో స్పిన్నర్‌గా అశ్విన్‌ను ఎంచుకోవడం మంచిదనే చర్చ నడుస్తోంది. అతణ్ని ఆడించాలంటే సూర్యను, లేదా ఒక పేసర్‌ను తప్పించాల్సి ఉంటుంది.


69

వన్డేల్లో 2 వేల మైలురాయిని అందుకోవడానికి శ్రేయస్‌కు అవసరమైన పరుగులు.


8

ప్రపంచకప్‌లో భారత్‌, ఇంగ్లాండ్‌ తలపడ్డ మ్యాచ్‌లు. మూడుసార్లు భారత్‌ నెగ్గితే, నాలుగు మ్యాచ్‌లు ఇంగ్లాండ్‌ సొంతమయ్యాయి. ఒక మ్యాచ్‌ టై అయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని