SA vs IND: రెండో టెస్టులో టీమ్ఇండియా విజయం.. 1-1తో సిరీస్‌ సమం

దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌ను టీమ్‌ఇండియా 1-1 తేడాతో సమం చేసింది. కేప్‌టౌన్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Updated : 04 Jan 2024 17:38 IST

కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా పర్యటన (SA vs IND)ను టీమ్‌ఇండియా ఘన విజయంతో ముగించింది. సఫారీలతో జరిగిన రెండో టెస్టులో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను రోహిత్ సేన 1-1 తేడాతో సమం చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 55 పరుగులకు ఆలౌట్‌ కాగా.. టీమ్ఇండియా 153 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాను టీమ్‌ఇండియా 176 పరుగులకు కట్టడి చేసింది. అనంతరం 79 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యశస్వి జైస్వాల్ (28; 23 బంతుల్లో 6 ఫోర్లు)  క్రీజులో ఉన్నంతసేపు బౌండరీలతో అలరించాడు. రోహిత్ శర్మ (17*; 22 బంతుల్లో 2 ఫోర్లు) కూడా దూకుడుగా ఆడాడు. విరాట్ కోహ్లీ (12), శుభ్‌మన్‌ గిల్ (10), శ్రేయస్ అయ్యర్ (4*) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ, నండ్రీ బర్గర్, మార్కో జాన్సన్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టెస్టు కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలుకుదామనుకున్న డీన్ ఎల్గర్‌కు నిరాశే ఎదురైంది. బ్యాటింగ్‌లోనూ అతడు విఫలమయ్యాడు. ఎల్గర్ చివరి టెస్టు సందర్భంగా అతడికి భారత ఆటగాళ్లు అభినందనలు తెలిపారు.  

అంతకుముందు ఓవర్‌నైట్ 62/3 స్కోరుతో రెండో రోజు ఆట ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దక్షిణాఫ్రికా మరో 114 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. 36 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రెండో రోజు ఆటను కొనసాగించిన మార్‌క్రమ్ (106; 103 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.జస్‌ప్రీత్ బుమ్రా (6/61) విజృంభణతో ఆతిథ్య జట్టు మొదటి 10 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓ వైపు మిగతా బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించకున్నా మార్‌క్రమ్ మాత్రం ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ముకేశ్ కుమార్ 2, సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ ఒక్కో వికెట్ పడగొట్టారు. 

సఫారీలను బెంబేలెత్తించిన సిరాజ్

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికాను మహ్మద్‌ సిరాజ్‌ (6/15) బెంబేలెత్తించాడు. నిప్పులు చెరిగే బంతులు సంధించి ఆతిథ్య జట్టుకు పట్టపగలే చుక్కలు చూపించాడు. అతడి ధాటికి దక్షిణాఫ్రికా తొలి సెషన్‌లోనే 23.2 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. 1991లో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత టెస్టుల్లో దక్షిణాఫ్రికాకు అత్యల్ప స్కోరు ఇదే. ఆతిథ్య జట్టులో మిడిల్ ఆర్డర్‌ బ్యాటర్లు డేవిడ్ బెడింగ్‌హమ్‌ (12), వెరినే (15) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ముకేశ్‌, బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. 

అనుహ్యంగా కుప్పకూలిన భారత్

ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (39; 50 బంతుల్లో), వన్‌డౌన్‌ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ (36; 55 బంతుల్లో 5 ఫోర్లు), విరాట్ కోహ్లీ (46; 59 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) నిలకడగా ఆడటంతో తొలి ఇన్నింగ్స్‌లో మెరుగైన స్కోరు చేసేలా కనిపించింది. కానీ, ఒకే స్కోరు వద్ద చివరి ఆరు వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. మొదటి రోజు టీ విరామ సమయానికి 111/4 స్కోరుతో నిలిచిన టీమ్‌ఇండియా..  11 బంతుల వ్యవధిలో ఆరు వికెట్లను చేజార్చుకుంది. యశస్వి జైస్వాల్ (0), శ్రేయస్ అయ్యర్ (0), రవీంద్ర జడేజా (0) పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరారు.  కేఎల్ రాహుల్ (8) కూడా నిరాశపరిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ, ఎంగిడి, నండ్రీ బర్గర్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని