Kuldeep Yadav: బాగా ఆడుతున్నాడని కుల్‌దీప్‌ను పాక్‌ జట్టుకు సెలెక్ట్ చేయలేం కదా.. ఇంజమామ్ చమత్కారం

వన్డే ప్రపంచకప్‌ కోసం పాకిస్థాన్‌ (Pakistan) జట్టును ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ పాకిస్థాన్ స్పిన్నర్ల గణాంకాలను టీమ్‌ఇండియా స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ (Kuldeep Yadav) గణాంకాలతో పోల్చాడు. దీనికి పాకిస్థాన్‌ చీఫ్‌ సెలెక్టర్ ఇంజమామ్-ఉల్-హక్ (Inzamam ul Haq) ఫన్నీగా సమాధానమిచ్చారు. 

Published : 23 Sep 2023 14:41 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్ (World Cup 2023) కోసం పాకిస్థాన్‌ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఆసియాకప్‌లో టీమ్‌ఇండియా  (team india)తో మ్యాచ్‌లో గాయపడిన యువ పేసర్‌ నసీమ్‌ షాకు చోటు దక్కలేదు. త్వరలో శస్త్ర చికిత్స చేయించుకోబోతున్న అతడు కోలుకోవడానికి 3-4 నెలల సమయం పట్టనుంది. నసీమ్‌ స్థానంలో హసన్‌ అలీ జట్టులోకి వచ్చాడు. మహ్మద్‌ నవాజ్‌, షాదాబ్‌ ఖాన్‌, ఒసామా మీర్‌లను స్పిన్నర్లుగా తీసుకున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లో పాక్‌ స్పిన్నర్లు ఆశించిన మేరకు ప్రభావం చూపలేకపోయారు. ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో పాక్‌ జట్టును వెల్లడిస్తున్న క్రమంలో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఓ రిపోర్టర్ పాకిస్థాన్ స్పిన్నర్ల గణాంకాలను టీమ్‌ఇండియా స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ (Kuldeep Yadav) గణాంకాలతో పోల్చాడు. దీనికి పాకిస్థాన్‌ చీఫ్‌ సెలెక్టర్ ఇంజమామ్-ఉల్-హక్ (Inzamam ul Haq))ఫన్నీగా సమాధానమిచ్చారు.  

వన్డేల్లో పాక్ స్పిన్నర్లు మహ్మద్‌ నవాజ్‌, షాదాబ్‌ ఖాన్‌ కంటే కుల్‌దీప్‌ యాదవ్‌ గణాంకాలు మెరుగ్గా ఉన్నాయని ఇంజమామ్-ఉల్-హక్ అంగీకరించారు. అయితే, గణాంకాలు మెరుగ్గా ఉన్నాయని తాను కుల్‌దీప్‌ యాదవ్‌ను పాకిస్థాన్‌ జట్టుకు ఎంపిక చేయలేను కదా, అతడు మరో జట్టులో ఉన్నాడు.. అదే మాకు సమస్య అంటూ చమత్కరించాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వారు.

వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్థాన్‌ జట్టు:

బాబర్‌ అజామ్‌ (కెప్టెన్‌), షాదాబ్‌ఖాన్‌ (వైస్‌ కెప్టెన్‌), రిజ్వాన్‌, ఇమాముల్‌ హక్‌, షఫీఖ్‌, షకీల్‌, ఫకార్‌ జమాన్‌, హారిస్‌ రవూఫ్‌, హసన్‌ అలీ, ఇఫ్తికార్‌, మహ్మద్‌ నవాజ్‌, మహ్మద్‌ వసీమ్‌, ఆగా సల్మాన్‌, షహీన్‌షా అఫ్రిది, ఒసామా మీర్‌. 


పాక్‌ జట్టుకు వీసా సమస్యలు! 

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా సెప్టెంబర్ 29న హైదరాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌ మధ్య వార్మప్ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం హైదరాబాద్‌కు చేరుకునే ముందు పాక్‌ జట్టు దుబాయ్‌ వెళ్లాల్సి ఉంది. అయితే, భారత్‌కు రావడానికి పాక్‌ ఆటగాళ్లకు ఇంకా వీసాలు రాకపోవడంతో ఆ జట్టు దుబాయ్ ట్రిప్ రద్దు అయింది. ప్రపంచకప్‌నకు ముందు ఆటగాళ్ల మధ్య స్నేహాపూర్వక వాతావరణం మెరుగుపడేందుకు ఈ ట్రిప్‌నకు ప్లాన్‌ చేశారు. భారత్‌లో జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు వస్తున్న తొమ్మిది జట్లలో పాకిస్థాన్‌కు మినహా అన్ని టీమ్‌లకు వీసాలు వచ్చాయి. వీసాల సమస్యలు పరిష్కారం కాగానే పాక్ జట్టు వచ్చేవారం కరాచీ నుంచి నేరుగా హైదరాబాద్‌కు చేరుకునే అవకాశముంది. 2012-13 తర్వాత పాక్‌ టీమ్‌ భారత్‌కు రానుండటం ఇదే తొలిసారి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని