IRE vs IND: ఐర్లాండ్‌తో మూడో టీ20 వర్షార్పణం.. సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్

ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ని 3-0 క్లీన్‌స్వీప్‌ చేయాలనుకున్న టీమ్‌ఇండియా ఆశలపై వరుణుడు నీళ్లుచల్లాడు.

Updated : 23 Aug 2023 23:20 IST

డబ్లిన్‌: ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ని 3-0 క్లీన్‌స్వీప్‌ చేయాలనుకున్న టీమ్‌ఇండియా (Team India) ఆశలపై వరుణుడు నీళ్లుచల్లాడు. బుధవారం జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్‌ వర్షం కారణంగా టాస్‌ పడకుండానే రద్దయింది. దాదాపు మూడున్నర గంటలపాటు వర్షం కురిసింది. అనంతరం వర్షం తగ్గినా మైదానం చిత్తడిగా మారడంతో మ్యాచ్‌ నిర్వహణ సాధ్యం కాదని అంపైర్లు తేల్చారు. దీంతో మ్యాచ్‌ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మొదటి రెండు టీ20ల్లో విజయం సాధించిన భారత్‌ సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. సిరీస్‌లో టీమ్‌ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన జస్ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా నిలిచాడు. 

కీలకమైన వన్డే ప్రపంచకప్‌ ముందు ఐర్లాండ్‌ సిరీస్‌తో జస్ప్రీత్‌ బుమ్రా పునరాగమనం చేసి మంచిఫామ్‌ని కనబర్చడం భారత్‌కు కలిసొచ్చే అంశం. రింకూ సింగ్, ప్రసిద్ధ్‌ కృష్ణ ఇదే సిరీస్‌లో భారత్‌ తరఫున అరంగేట్రం చేసి సత్తాచాటారు. మూడో టీ20లో సంజు శాంసన్‌కు విశ్రాంతినిచ్చి వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ జితేశ్‌ శర్మకు అరంగేట్రం చేసే అవకాశం ఇస్తారనుకున్నా.. మ్యాచ్‌ రద్దవడంతో సాధ్యపడలేదు.

ఆసియా కప్‌తో తిరిగి బరిలోకి

ఆగస్టు 30 నుంచి ప్రారంభంకానున్న ఆసియా కప్‌తో తిరిగి టీమ్‌ఇండియా మైదానంలోకి దిగనుంది. ఆరు దేశాలు పాల్గొనే ఆసియా కప్‌ టోర్నీలో సెప్టెంబరు 2న తన తొలి మ్యాచ్‌ ఆడనుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ (PAK vs IND)తో ఆ మ్యాచ్‌లో భారత్‌ తలపడనుంది. గ్రూప్‌ ఏలో భారత్‌, పాకిస్థాన్‌, నేపాల్‌ ఆడుతుండగా... గ్రూప్‌ బిలో బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌, శ్రీలంక తలపడనున్నాయి. సెప్టెంబరు 17న ఫైనల్‌ మ్యాచ్‌ ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు