Rohit Sharma: రోహిత్‌.. నువ్వు ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టు: భారత క్రికెట్‌ దిగ్గజం

భారత్‌ను (Team India) అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిపేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే వన్డేలు, టీ20ల్లో టాప్‌ స్థానంలో ఉన్న.. టెస్టుల్లోనూ ఆ దిశగా సాగుతోంది. ఆసీస్‌పై మరో టెస్టు గెలిస్తే టాప్‌ ర్యాంక్‌ సొంతమవుతుంది.  ఈ క్రమంలో రోహిత్‌కు భారత క్రికెట్‌ దిగ్గజం కీలక సూచనలు చేశాడు.

Published : 23 Feb 2023 13:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) భాగంగా ఆసీస్‌పై రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమ్‌ఇండియా (Team India) వరుసగా రెండు టెస్టులను గెలిచింది. దీంతో నాలుగు టెస్టుల (IND vs AUS) సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆసీస్‌పై తొలి టెస్టులో అద్భుత శతకంతో కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఫామ్‌ అందుకొన్నాడు. అయితే, రోహిత్ ఉత్తమంగానే బ్యాటింగ్‌ చేస్తున్నప్పటికీ.. ఓ విషయంలో మాత్రం క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ (Kapil Dev) ఆందోళన వ్యక్తం చేశాడు. రోహిత్ తన ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాలని సూచించాడు. అతడు కాస్త అధిక బరువుతో ఉన్నట్లు కనిపిస్తోందని పేర్కొన్నాడు. 

‘‘ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యం. అదీనూ ఓ కెప్టెన్‌గా ఇంకొంచెం దృష్టిపెట్టాలి. సారథే ఫిట్‌గా లేడంటే ఎంత అవమానం. అందుకే, రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై తీవ్ర కసరత్తు చేయాలి. నిజమే, అతడు గొప్ప బ్యాటరే.. కానీ, ఫిట్‌నెస్‌ విషయం మాట్లాడుకుంటే అతడు అధిక బరువుతో ఉన్నట్లు అనిపిస్తోంది. టీవీలో చూస్తుంటే లావుగా అనిపించాడు. కానీ, నేను చూసిన వారిలో రోహిత్ గొప్ప ఆటగాడు.. గొప్ప కెప్టెన్‌.. అయితే, అతడు ఫిట్‌గా ఉండాల్సిన అవసరం ఉంది’’ అని కపిల్ దేవ్‌ తెలిపాడు. 

మార్చి 1వ తేదీ నుంచి భారత్ - ఆసీస్‌ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత్‌ భావిస్తోంది. మరోవైపు ఆసీస్‌ కీలకమైన ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగబోతోంది. మూడో టెస్టులోనూ టీమ్‌ఇండియా గెలిస్తే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరడం ఖాయం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని