WTC Final: అది విరాట్‌కే బాగా తెలుసు: యువీ

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌కే కాస్త ఎక్కువ ప్రయోజనం కనిపిస్తోందని టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ అన్నాడు. తన ఫేవరెట్‌ మాత్రం భారతేనని స్పష్టం చేశాడు. టెస్టు ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకోవడం ప్రపంచకప్‌ను గెలవడంతో సమానవుతుందో లేదో....

Published : 18 Jun 2021 01:28 IST

ముంబయి: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌కే కాస్త ఎక్కువ ప్రయోజనం కనిపిస్తోందని టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ అన్నాడు. తన ఫేవరెట్‌ మాత్రం భారతేనని స్పష్టం చేశాడు. టెస్టు ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకోవడం ప్రపంచకప్‌ను గెలవడంతో సమానవుతుందో లేదో తనకు తెలిదన్నాడు. బహుశా విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ దీనికి జవాబు చెప్పేందుకు సరైన వాళ్లని వెల్లడించాడు. ఫైనల్‌కు ముందు యువీ మీడియాతో మాట్లాడాడు.

‘నా ఫేవరెట్‌ టీమ్‌ఇండియానే. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ ఆడటంతో న్యూజిలాండ్‌కు కాస్త ఎక్కువ ప్రయోజనం. ఎక్కువ మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభించింది. ఫైనల్‌ మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగాలని కోరుకుంటున్నా. కొన్నిసార్లు టెస్టు క్రికెట్‌ చనిపోతోందని అనిపిస్తుంది. అలాంటప్పుడే భారత్‌, ఆస్ట్రేలియా వంటి పోరాటాలతో మళ్లీ జవసత్వాలు వచ్చినట్టు అనిపిస్తుంది. న్యూజిలాండ్‌.. ఇంగ్లాండ్‌ను ఇంగ్లాండ్‌లో ఓడించడమూ అలాంటిదే. నేను చూసిన, ఆడిన గొప్ప ఫార్మాట్‌ టెస్టే’ అని యువీ అన్నాడు.

టెస్టు ఛాంపియన్‌షిప్‌ కైవసం చేసుకోవడం ప్రపంచ కప్‌ గెలవడంతో సమానమో కాదో తెలియదని యువీ అన్నాడు. ‘దీన్ని వివరించేందుకు విరాట్‌ కోహ్లీ లేదా రోహిత్‌ శర్మ సరైనవాళ్లు. 2011 ప్రపంచకప్‌ జట్టులో ఉన్నాడు కాబట్టి విరాటే చెప్పగలడు. నిజానికి డబ్ల్యూటీసీ ఫైనల్లో మూడు మ్యాచులు ఉంటే బాగుండేది. పిచ్‌, పరిస్థితులను బట్టి జట్టును ఎంపిక చేసుకోవాలి. వేగానికి అనుకూలిస్తే అదనపు పేసర్‌ను తీసుకోవాలి. లేదంటే జడ్డూ, యాష్‌ను ఆడించాలి. టీమ్‌ఇండియా టెస్టుల్లో గెలుస్తుందంటే వారి బ్యాటింగూ ఓ కారణమే. శుభ్‌మన్‌ గిల్‌ ఆస్ట్రేలియాలో అదరగొట్టాడు. ఇంగ్లాండ్‌లో రాణించాలని కోరుకుంటున్నా. మిథాలీసేన తొలిసారి గులాబి టెస్టు ఆడబోతుండటం ఆసక్తి కలిగిస్తోంది’ అని యువీ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని