Ashwin: కోహ్లీ కళ్లలో పవర్‌ కనిపించింది.. ఒక్క బాల్‌ ఆడటానికి ఏడు ఆప్షన్లు ఇచ్చాడు: అశ్విన్‌

గతేడాది జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో భారత్‌ చివరి బంతికి విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ చివరి ఓవర్లో జరిగిన హై డ్రామా గురించి అశ్విన్ (Ravichandran Ashwin) తాజాగా గుర్తు చేసుకున్నాడు. 

Published : 29 Jun 2023 19:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్: గతేడాది జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌ (Pakistan)తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో భారత్‌ (Team India) చివరి బంతికి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా.. 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ కష్టకాలంలో విరాట్ కోహ్లీ (82*; 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అశ్విన్‌ చివరి బంతికి సింగిల్‌ తీసి భారత్‌కు విజయాన్ని అందించాడు. అయితే, మ్యాచ్‌ చివరి ఓవర్లో జరిగిన హై డ్రామా గురించి అశ్విన్ (Ravichandran Ashwin) తాజాగా గుర్తు చేసుకున్నాడు.  టీమ్‌ఇండియా గెలవడానికి ఆఖరి రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరం కాగా..  మహ్మద్‌ నవాజ్‌ వేసిన ఐదో బంతికి దినేశ్‌ కార్తిక్ స్టంపౌటయ్యాడు. దీంతో అశ్విన్‌ క్రీజులోకి వచ్చాడు. తక్కువ ఎత్తులో వచ్చిన చివరి బంతి వైడ్‌గా వెళ్తుందని అశ్విన్‌ ముందే ఊహించి పక్కకు జరిగాడు. ఆఖరి బంతికి అశ్విన్‌ సింగిల్ తీయడంతో భారత అభిమానులు సంబరాల్లో మునిగితేలారు. 

‘‘ఐదో బంతికి దినేశ్‌ కార్తిక్‌ ఔట్‌ కావడంతో అతడిపై నేను చాలా కోపంగా ఉన్నా. అతడి వల్ల నేను చాలా కష్టమైన పనిచేయాల్సి వచ్చింది. అభిమానులు చేస్తున్న నినాదాలను విన్నాను. ఎంత పెద్ద బాధ్యతను మోస్తున్నానో అప్పుడు అర్థమైంది. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి వాతావరణాన్ని, మద్దతును చూడలేదు. నేను చివరి బంతికి ఎదుర్కొవడానికి వెళ్లినప్పుడు విరాట్‌ కోహ్లీ (Virat Kohli) నా దగ్గరకు వచ్చాడు. ఆ బాల్‌ ఆడటానికి ఏడు ఆప్షన్లు ఇచ్చాడు. అన్ని షాట్లు ఆడే సామర్థ్యం ఉంటే ఎనిమిదో స్థానంలో ఎందుకు బ్యాటింగ్ చేస్తా? అని నా మనసులో అనుకున్నా.

 కోహ్లీతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ కోహ్లీ కళ్లలో ఏదో పవర్‌ కనిపించింది. వేరే గ్రహం నుంచి వచ్చినవాడిలా కనిపించాడు. నవాజ్‌ వైడ్‌ వేయగానే ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తామనే నమ్మకం కలిగింది. రోజూ పడుకునే ముందు ఈ మ్యాచ్‌ గురించి ఆలోచిస్తూ అసలేం జరిగిందని వీడియో చూస్తాను. ఒకవేళ చివరి బంతి నా ప్యాడ్‌ను తాకి ఉంటే అక్కడితో నా కెరీర్‌ ముగిసిపోయేది. విరాట్ కోహ్లీ మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు’’ అని  అశ్విన్‌ వివరించాడు. ఇదిలా ఉండగా, 2023 వన్డే ప్రపంచ కప్‌ షెడ్యూల్ ఇటీవల విడుదలైంది. అక్టోబర్‌ 15న అహ్మదాబాద్‌ వేదికగా భారత్, పాకిస్థాన్‌ తలపడనున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని