Kuldeep Yadav: మైదానంలో రోహిత్ ఏమన్నా మేం బాధపడం: కుల్‌దీప్‌ యాదవ్‌

టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మైదానంలో దురుసుగా ఉంటాడనే కామెంట్లను కుల్‌దీప్‌ యాదవ్ కొట్టిపడేశాడు. 

Published : 18 Mar 2024 00:09 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో (IND vs ENG) కుర్రాళ్లపై ఒత్తిడి లేకుండా చేయడంలో కెప్టెన్ రోహిత్ శర్మ విజయవంతమయ్యాడు. అరంగేట్రం చేసిన ఆటగాళ్లు తమ సత్తా చాటారు. మరీ ముఖ్యంగా సీనియర్‌ స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్‌ తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ తుది జట్టులో స్థానం దక్కించుకుని అద్భుత ప్రదర్శన చేశాడు. రోహిత్ నాయకత్వం వల్లే తన కెరీర్‌ మళ్లీ పుంజుకోగలిగిందని.. తమ మధ్య చక్కటి అనుబంధం ఉందని కుల్‌దీప్‌ అన్నాడు. మైదానంలో అతడేమన్నా సరే యువ క్రికెటర్లు బాధపడరని తెలిపాడు. 

‘‘గతంలో ఎన్‌సీఏలో ఉన్నప్పుడు రోహిత్ అక్కడికి వచ్చాడు. నా బౌలింగ్‌ యాక్షన్ చూశాడు. కొన్ని మార్పులు చేసుకోవాలని సూచించాడు. ఇక మ్యాచుల్లో నేను స్లిప్‌లో ఉన్నప్పుడు బ్యాటర్‌ ఆఫ్‌ పిచ్‌ మీద వేసిన బంతిని ఎలా ఆడుతున్నాడనేది గమనించమని చెప్పాడు. తగినంత సమయం ఇవ్వకుండా బౌలింగ్‌ చేయాలని.. దాని కోసం మరింత శక్తివంతంగా మారాలని చెప్పాడు. ఒకవేళ బ్యాక్‌ఫుట్‌ మీదుగా ఆడేందుకు ప్రయత్నిస్తే... బంతి వికెట్లను గిరాటేసేలా లేదా ప్యాడ్లను తాకేలా బౌలింగ్‌ చేయడం ప్రారంభించాను’’ అని కుల్‌దీప్‌ చెప్పాడు. 

‘‘రోహిత్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. మా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటాం. అయితే, మైదానంలోకి దిగాక అవేవీ పట్టించుకోం. ఫీల్డింగ్‌ మిస్ అయినప్పుడు అనే మాటలకు బాధపడం. ఎందుకంటే బయట అతడు మాపై అలాంటి ప్రేమ చూపిస్తాడు. ఇప్పుడు ఏదైనా మ్యాచ్‌లో నా బౌలింగ్‌ గురించి ఏమీ సూచనలు చేయడం లేదు. ఎందుకంటే నేను ఆ స్థాయికి చేరానని అతడి భావన. కానీ, బ్యాటింగ్‌పై దృష్టిపెట్టమని చెబుతుంటాడు. నెట్స్‌లోనూ, టెస్టు సిరీస్‌ సందర్భంగా అదే విషయం గుర్తు చేశాడు. బ్రేక్‌ సమయంలో ఏం చేస్తే బాగుంటుందనే సూచనలు కూడా ఇచ్చాడు’’ అని కుల్‌దీప్‌ వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని