రోహిత్ శతకంతోనే తిరిగొస్తాడు: లక్ష్మణ్

దాదాపు ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్ శర్మ శతకంతో రీఎంట్రీ ఇస్తాడని దిగ్గజ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో జరగనున్న సిడ్నీ టెస్టులో...

Published : 05 Jan 2021 15:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దాదాపు ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్ శర్మ శతకంతో రీఎంట్రీ ఇస్తాడని దిగ్గజ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో జరగనున్న సిడ్నీ టెస్టులో అతడు సత్తాచాటుతాడని పేర్కొన్నాడు. మయాంక్ అగర్వాల్‌ విఫలమవుతుండటంతో హిట్‌మ్యాన్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడని అభిప్రాయపడ్డాడు. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన న్యూజిలాండ్ సిరీస్‌లో రోహిత్‌ గాయపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఐపీఎల్ ఆడినప్పటికీ అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు.

‘‘విరాట్ కోహ్లీ గైర్హాజరీలో సీనియర్‌ ఆటగాడు రోహిత్ శర్మ తిరిగి జట్టులో చేరడంపై టీమిండియా ఎంతో సంతోషిస్తుంది. డ్రెస్సింగ్ రూమ్‌లో మరింత అనుభవం కావాలి. ఎందుకంటే సిడ్నీలో విజయం సాధించి సిరీస్‌ను 2-1తో లేదా 3-1తో ముగించే అవకాశాలు భారత్‌కు ఉన్నాయి. రోహిత్‌ తన ప్రతిభను చూపించాలనుకుంటున్నాడు. అతడి బ్యాటింగ్ స్టైల్‌కు ఆస్ట్రేలియా పిచ్‌లు ఎంతో నప్పుతాయి. అతడు కొత్తబంతిని సమర్థవంతంగా ఎదుర్కొంటే భారీ శతకం కచ్చితంగా సాధిస్తాడు’’ అని లక్ష్మణ్‌ తెలిపాడు.

తొలి టెస్టులో ఘోరపరాజయం అనంతరం అద్భుతంగా పుంజుకుని భారత్‌ ఘనవిజయం సాధించడంపై లక్ష్మణ్ స్పందించాడు. విజయంలో ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బంది కృషి ఎంతో ఉందని అన్నాడు. ‘‘విమర్శలకు టీమిండియా సరైన సమాధానం ఇచ్చింది. 36 పరుగులకే కుప్పకూలడం, కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, మహ్మద్‌ షమి దూరమవ్వడంతో.. ఆసీస్‌ పర్యటనలో భారత జట్టు ఘోరంగా విఫలమవుతుందని విశ్లేషకులు భావించారు. కానీ భారత్‌ అద్భుత విజయం సాధించింది. సానుకూల ధోరణీతో పుంజుకోవడంలో జట్టు ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బంది పాత్ర గొప్పది. నా స్నేహితులకు, వీక్షకులకు ఓ విషయం చెబుతున్నా.. దేన్ని తక్కువగా అంచనా వేయకూడదు. ముఖ్యంగా భారత క్రికెట్ జట్టును’’ అని లక్ష్మణ్ పేర్కొన్నాడు.

డిలైడ్ వేదికగా జరిగిన తొలి‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 36 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. భారత క్రికెట్‌ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదు చేశాం. అనంతరం మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన బాక్సింగ్‌ డే టెస్టులో గొప్పగా పుంజుకుని కంగారూలపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా, సిడ్నీ వేదికగా గురువారం నుంచి భారత్×ఆస్ట్రేలియా మూడో టెస్టు ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి

సవాళ్లకు సిద్ధంగా ఉన్నా: నట్టూ

షాక్‌: టెస్టు సిరీస్‌కు రాహుల్ దూరం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని