Kane - Manoj Bajpayee : ‘ఫ్యామిలీ మ్యాన్‌’కు షాక్‌ ఇచ్చిన కేన్‌ మామ

 కేన్‌ విలియమ్సన్‌ను ఇంటర్వ్యూ చేసిన మనోజ్‌ బాజ్‌పాయ్‌

Updated : 14 May 2022 18:59 IST

విలియమ్సన్‌ను ఇంటర్వ్యూ చేసిన మనోజ్ బాజ్‌పాయీ 

కేన్‌ మామ అని ముద్దుగా పిలుచుకునే కేన్‌ విలియమ్సన్.. మనకు పరిచయం అక్కర్లేని న్యూజిలాండ్ కెప్టెన్‌.. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సారథి కూడానూ. అయితే కేన్ గురించి ఇప్పుడు ఎందుకు అంటారా..? కేన్‌ను ప్రత్యేకంగా  ఓ స్పెషల్‌ గెస్ట్‌ ఇంటర్వ్యూ చేశాడు. శ్రీకాంత్‌ తివారీ తెలుసుగా.. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ ’ వెబ్‌ సిరీస్‌ కథానాయకుడు మనోజ్‌ బాజ్‌పేయీ సరదాగా కేన్‌ను కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను అమెజాన్ ప్రైమ్‌ విడుదల చేసింది. ఇక నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లోనూ లైవ్‌ క్రికెట్‌ స్ట్రీమింగ్‌ వస్తుందని బిగ్‌ న్యూస్‌ వెల్లడించింది. ఈ సందర్భంగా అసలు మన కేన్‌ మామకు ‘ఫ్యామిలీ మ్యాన్‌’ ఎలాంటి ప్రశ్నలు సంధించాడు.. వీరిద్దరి సంభాషణ ఏ విధంగా జరిగింది చదివేయండి మరి..

‘‘సాధారణ వ్యక్తిగా ఉండొద్దు’’ అంటూ కేన్‌తో ప్రతిజ్ఞ చేయించిన మనోజ్ సంభాషణను ప్రారంభించాడు. మేం (అమెజాన్ ప్రైమ్) చాలా ఏళ్లుగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నామని చెప్పుకొచ్చాడు. తన నుంచి, ఫ్యాన్స్‌ నుంచి కొన్ని ప్రశ్నలు ఉన్నాయని, వాటిని అడుగుతానని మనోజ్ పేర్కొన్నాడు. 

మనోజ్: హాయ్‌ కేన్‌ ఎలా ఉన్నావు..? 

కేన్: హాయ్‌ ఫ్యామిలీమ్యాన్‌. బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? 

మనోజ్‌: సూపర్. ప్రపంచ స్పోర్ట్స్‌లో న్యూజిలాండ్‌ క్రికెట్‌ ఏ సాధించింది? 

విలియమ్సన్: అంతర్జాతీయంగా కొన్ని మెగా టోర్నీల్లో ఫైనల్స్‌కు చేరుకున్నాం. అలానే వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌ విజయం సాధించడం మధుర జ్ఞాపకం. 

మనోజ్‌: అప్పుడు వచ్చిన ‘ఫేమ్‌’ గురించి బాగా తెలిసే ఉంటుంది? 

కేన్: అవును. అయితే క్రికెట్‌ ఆట గురించే బాగా తెలుసు. ‘ఫేమ్‌’ గురించి ఆలోచించలేదు. 

మనోజ్‌: దేశవ్యాప్తంగా ఉండే అంచనాలను మీ భుజస్కంధాల మీద మోసేటప్పుడు కలిగే ఒత్తిడిని ఏ విధంగా తట్టుకోగలరు? ఏదైనా యోగా, మెడిటేషన్‌ వంటివి చేస్తారా? 

కేన్‌: అలాంటిదేమీ ఉండదు. మా జట్టులో ప్రతి ఒక్కరూ విభిన్నంగా గెలుపు కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. క్రికెట్‌ను ఆస్వాదిస్తూ ఆడితే పెద్ద కష్టంగా ఉండదు. 

కివీ నా ఫేవరెట్‌ ఫ్రూట్‌ అని మనోజ్‌ చెప్పగా.. 

వావ్‌.. ది కివీ నా..? ఫ్రూటా..? అని కేన్‌ ఎదురు ప్రశ్నించడంతో పాపం మనోజ్‌ అవాక్కయ్యాడు. 

మనోజ్: మీ జట్టులో స్పైగా పనికొచ్చేది ఎవరని మీరనుకుంటున్నారు? 

కేన్: అతడొక మంచి సైనికుడు అయి ఉండాలి. అయితే మా జట్టులో గ్లెన్‌ ఫిలిప్స్‌ అయితే సరిపోతాడని భావిస్తున్నా. 

మనోజ్‌: మీ పెళ్లికి సోషల్‌ మీడియాను ఎందుకు ఆహ్వానించలేదు?

కేన్: (షాక్‌తో) నా పెళ్లికా..?

అయితే వెంటనే సారీ.. ఇది వేరే వ్యక్తి ఇంటర్వ్యూ కోసం అడగాల్సిన ప్రశ్న అని మనోజ్‌ బాజ్‌పేయీ సమాధానం ఇస్తాడు. ఆ పక్కన ఉండే అసిస్టెంట్‌ మీద చిరుకోపం ప్రదర్శిస్తూ.. ఈ ప్రశ్న ఎందుకు
వచ్చిందని అడుగుతాడు. 

మనోజ్‌: నా అభిమానులు, ‘ది ఫ్యామిలీమ్యాన్‌’ అభిమానులకు ఏమైనా సందేశం ఇస్తారా? 

కేన్‌: క్రికెట్ అనేది కాస్త డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్‌ కలిగలిసిన గేమ్. 

మనోజ్‌: ఓకే. బంగ్లాదేశ్ జట్టు కోసం మీ దగ్గర ఎలాంటి స్ట్రాటజీ ఉంది? 

కేన్‌: నేను బయటకు చెప్పలేను.

మనోజ్‌: అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో మీకు బాగా ఇష్టమైన షో ఏది? 

కేన్: నేను ఇప్పటికే తొలి రెండు సీజన్లు చూశాను. (అని చెప్పగానే.. మనోజ్ ఎంతో ఉత్సాహంగా వింటూ ఉంటాడు. తన షో చెబుతాడేమోనని) మీర్జాపూర్‌.. 

దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన మనోజ్.. బై బై అంటూ ముగిస్తాడు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని