Rohit Sharma - IPL 2024: ‘ఆ నిర్ణయం రోహిత్‌ శర్మ ఆటపై ప్రభావం చూపదు’

రోహిత్‌ శర్మను ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌గా తప్పించిన విషయం తెలిసిందే. అయితే, అది అతని ఆటతీరుపై ప్రభావం చూపదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్‌ మూడీ (Tom Moody) అన్నాడు. 

Published : 07 Mar 2024 02:11 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌-2024కు రంగం సిద్ధమవుతోంది. మార్చి 22 నుంచే ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న ఆటగాళ్లు ఇప్పటికే ఐపీఎల్ కోసం సాధన మొదలెట్టారు. ఇక, లీగ్‌లో విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందిన ముంబయి ఇండియన్స్‌ భారీ మార్పులతో బరిలోకి దిగుతోంది. ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మ (Rohit Sharma)ను కెప్టెన్సీ నుంచి తొలగించి హార్దిక్‌ పాండ్య (Hardik Pandya)కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. కెప్టెన్సీ తొలగింపు ప్రభావం రోహిత్ ఆటతీరుపై ఉంటుందేమోనని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాజీ కోచ్‌ టామ్‌ మూడీ (Tom Moody) మాట్లాడాడు. కెప్టెన్సీ తొలగింపు రోహిత్ శర్మ బ్యాటింగ్‌పై ప్రభావం చూపదని అభిప్రాయపడ్డాడు. 

‘‘రోహిత్ శర్మ సత్తా ఏంటో ఆటగాడిగా అతను ఎంత ప్రమాదకరమో మనందరికీ తెలుసు. ఐపీఎల్‌లో కెప్టెన్సీ తొలగింపు రోహిత్‌ బ్యాటింగ్‌శైలిపై ప్రభావం చూపుతుందని నేనైతే అనుకోవడం లేదు. అతను స్వేచ్ఛగా తన సహజ శైలిలో ఆడతాడు’’ అని టామ్‌ మూడీ తెలిపాడు. స్టార్‌ ఆటగాళ్లు, ఫ్యాన్‌బేస్‌ ఎక్కువగా ఉన్న ముంబయి ఇండియన్స్‌ను నడిపించడం హార్దిక్ పాండ్యకు సవాలుతో కూడుకున్నదని అభిప్రాయపడ్డాడు. మార్చి 24న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో ముంబయి ఇండియన్స్‌ తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని