Mohammed Shami: ఇలానే మాట్లాడితే నిన్ను చూసి జనాలు నవ్వుకుంటారు.. పాక్‌ మాజీకి మహ్మద్‌ షమి పంచ్‌

ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో భారత్ విభిన్నమైన బంతులను ఉపయోగించి లబ్ధి పొందిందని పాకిస్థాన్ మాజీ ఆటగాడు హసన్ రజా ఆరోపించాడు. దీనిపై భారత పేసర్ మహ్మద్‌ షమీ (Mohammed Shami) స్పందించాడు.

Published : 22 Nov 2023 11:49 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో భారత్ విభిన్నమైన బంతులను ఉపయోగించి మరింత ప్రయోజనం పొందిందని పాకిస్థాన్ మాజీ ఆటగాడు హసన్ రజా ఇటీవల ఆరోపించాడు. దీనిపై భారత పేసర్ మహ్మద్‌ షమీ (Mohammed Shami) స్పందించాడు. హసన్ రజా వాదనను చూసి తాను ఆశ్చర్యపోయానని షమీ పేర్కొన్నాడు. అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో ఎలా భాగమయ్యాడో తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నాడు. పాక్‌ మాజీ పేసర్ వసీమ్ అక్రమ్‌ (Wasim Akram) కూడా హసన్‌ వ్యాఖ్యలను ఇప్పటికే ఖండించాడు. మ్యాచ్‌లో జట్లకు బంతులను ఎలా కేటాయిస్తారు, బౌలర్లు వాటిని ఎలా ఎంచుకుంటారనే దానిపై వివరణ ఇచ్చాడు. 

‘‘నేను ప్రపంచకప్‌లో మొదట జరిగిన మ్యాచ్‌ల్లో ఆడనప్పుడు కూడా ఈ ఆరోపణలను విన్నాను.  నా తొలి మ్యాచ్‌లో 5 వికెట్లు తీశాను, తర్వాతి మ్యాచ్‌లో నాలుగు, ఆ తర్వాతి మ్యాచ్‌లో 5 వికెట్లు పడగొట్టాను. కొందరు పాక్ ఆటగాళ్లు దీన్ని జీర్ణించుకోలేకపోయారు. దానికి నేనేం చెయ్యగలను. సరైన సమయంలో రాణించే ఆటగాళ్లే అత్యుత్తమమని నేను భావిస్తున్నా. కానీ, మీరు వివాదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. బంతి వేరే రంగులో కనిపిస్తోంది, వేరే కంపెనీ బంతులను వాడుతున్నారు, ఐసీసీ మీకు వేరే సెట్ బంతులను అందించిందని అంటున్నారు. మీ ఆలోచలను సరిదిద్దుకోండి. ఓ ఇంటర్వ్యూలో వసీమ్‌ భాయ్‌ (వసీమ్ అక్రమ్‌) దీని గురించి వివరించాడు. క్రికెట్ ఆడని వారు ఆ తర్వాత కూడా ఇలా మాట్లాడితే ఓ అర్థం ఉంది. కానీ, నువ్వు మాజీ ఆటగాడివి. ఇలా మాట్లాడితే జనాలు నవ్వుకోవడం తప్ప ఇంకేమన్నా చేస్తారని నేను అనుకోను’’ అని షమీ పేర్కొన్నాడు.

2023 ప్రపంచకప్‌లో షమీ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. అతడు ఏడు మ్యాచ్‌ల్లోనే 23 వికెట్లు పడగొట్టాడు. మూడుసార్లు 5 వికెట్ల ఘనత అందుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో ఏకంగా (7/57) గణాంకాలు నమోదు చేసి వన్డేల్లో భారత్‌ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని