Shami: అసూయ పడేవాళ్లే ఎక్కువ.. యూపీ తరఫున క్రికెట్‌ ఆడకపోవడానికి కారణముంది: షమీ

భారత క్రికెట్‌లో షమీకి (Shami) ప్రత్యేక అధ్యాయం ఉంటుంది. వ్యక్తిగత, వృత్తిపర జీవితాల్లో ఒడుదొడుకులు ఎదురైనా.. పట్టు విడవకుండా వన్డే ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు.

Updated : 25 Nov 2023 13:06 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా (Team India) స్టార్‌ పేసర్ మహమ్మద్ షమీ వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ ప్రపంచ కప్‌ ముందు వరకూ అతడు జట్టులోకి వస్తాడా? లేదా? అనే సందిగ్ధత ఉండేది. తొలి నాలుగు మ్యాచుల్లోనూ చోటు దక్కలేదు. ఆ తర్వాత చెలరేగిపోయాడు. కేవలం ఏడు మ్యాచుల్లోనే 24 వికెట్లు పడగొట్టాడు. వరల్డ్‌ కప్‌ల్లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ షమీ (Shami) రికార్డు సృష్టించాడు. అయితే, దీని వెనుక ఎన్నో ఒడుదొడుకులను షమీ ఎదుర్కొన్నాడు. వృత్తిపరంగా, వ్యక్తిగత జీవితంలోనూ క్లిష్ట దశను చవిచూశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అలాంటి సంఘటనల నుంచి బయటపడటంపై స్పందించాడు.

‘‘మీ జీవితంలో ఎన్నో కష్టాలను చవిచూశారు. చాలాసార్లు మానసికంగా దృఢంగా ఉండాలని చెప్పారు. ఆ దశ గురించి ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తారు?’’ అన్న ప్రశ్నకు షమీ సమాధానం ఇచ్చాడు.

‘‘కెరీర్‌ ఆరంభంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నా. మాది సాధారణ కుటుంబం. మీరు ఎప్పుడూ అబద్దాలు చెబుతూ ఉంటే పరుగెడుతూనే ఉండాలి. కానీ, నేను సత్యాన్ని నమ్ముకున్నా. ఎప్పటికైనా అదే గెలుస్తుందని భావించేవాడిని. ఇక నా వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలపై చాలా కలత చెందా. దాదాపు ఆరేడు రోజులు తీవ్రంగా మథన పడ్డా. ఆ సమయంలో నా కుటుంబం మద్దతుగా నిలిచింది. అప్పుడే.. నేను మళ్లీ మొదట్నుంచి ప్రారంభించాల్సిన అవసరం ఉందనిపించింది. 

జీవితంలో ఒడుదొడుకులు సర్వసాధారణం. మనం అనుకున్నది ఒక్కోసారి జరగకపోవచ్చు. నాపై తప్పుడు ఆరోపణలు వచ్చాయి. అలాంటి సమయంలోనే ప్రమాదానికి గురయ్యా. అప్పుడు చాలా బాధపడ్డా. కానీ, కష్టాల నుంచి పారిపోలేదు. బయట నా గురించి ఏమైనా అనుకోవచ్చు. మనల్ని ప్రోత్సహించే వారి కన్నా కిందికి లాగేవాళ్లే ఎక్కువగా ఉంటారు. మనం విజయం సాధిస్తే అసూయ చెందేవారిని అస్సలు పట్టించుకోకూడదు’’ అని షమీ వ్యాఖ్యానించాడు.

నేను ఆడకపోవడానికి కారణమదే..

యూపీ నుంచి వచ్చిన తాను అక్కడ జట్టు తరఫున రంజీల్లో ఆడకపోవడానికి ప్రధాన కారణం.. బోర్డులోని వ్యక్తులే అని షమీ తెలిపాడు. నాణ్యమైన ప్రదర్శన ఇచ్చినా సరే రెండేళ్లపాటు జట్టులోకి తీసుకోకుండా పక్కన పెట్టేశారని.. దాంతో వేరే రాష్ట్రానికి మారిపోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. ‘‘నా సొంత రాష్ట్రం యూపీ నుంచి కాకుండా పశ్చిమ బెంగాల్‌ నుంచి దేశవాళీ క్రికెట్‌ ఆడా. నా ఎంపిక గురించి అప్పటి యూపీ చీఫ్ సెలక్టర్‌ ఇచ్చిన సమాధానం షాక్‌కు గురి చేసింది. నా ఎంపిక గురించి మా అన్నయ్య వెళ్లి చీఫ్‌ సెలక్టర్‌ను కలిశాడు. కానీ, అతడు మాత్రం ‘నా కుర్చీని కదిలించగలిగితేనే ఆ కుర్రాడు సెలక్ట్‌ అవుతాడు’ అని చెప్పడంతో మా అన్నయ్య దిగ్ర్భాంతికి గురయ్యాడు. ‘కుర్చీని కదల్చడమే కాదు.. తలకిందులు చేయగలను. ఆ పవర్ నాకుంది. కానీ, అలా రావాలని అనుకోవడం లేదు. సామర్థ్యాన్ని బట్టి ఎంపిక చేయాలి’ అని మా అన్నయ్య సమాధానం ఇచ్చాడు. దాంతో అప్పటి నుంచి యూపీ క్రికెట్‌లో భాగస్వామ్యం కాలేదు. 14 ఏళ్ల వయసులో కోల్‌కతాకు మారిపోయా’’ అని షమీ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు