సల్మాన్‌ఖాన్‌ ఇంటి వద్ద కాల్పుల ఘటన.. కస్టడీలో నిందితుడి ఆత్మహత్య

Salman Khan House Firing Case: సల్మాన్‌ఖాన్‌ ఇంటి వద్ద కాల్పులు జరిపిన కేసులో ఒక నిందితుడు పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నాడు.

Updated : 01 May 2024 15:36 IST

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) ఇంటి వద్ద ఇటీవలు కాల్పులు (Firing Case) చోటుచేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ముంబయి పోలీసు క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులు కొంతమంది నిందితులను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. వీరిలో ఒకడైన అనూజ్‌ తపన్‌ బుధవారం బలవనర్మణానికి పాల్పడ్డాడు.

పోలీసు లాకప్‌లో ఉన్న అతడు ఈ ఉదయం బాత్రూమ్‌కు వెళ్లి బెడ్‌షీట్‌తో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన అధికారులు వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. పంజాబ్‌కు చెందిన 23 ఏళ్ల అనూజ్‌ను ఏప్రిల్‌ 26న పోలీసులు అరెస్టు చేశారు.

దాదాపు 100 స్కూళ్లకు ఒకేసారి బాంబు బెదిరింపులు.. దిల్లీలో కలకలం

ఏప్రిల్‌ 14న సల్మాన్‌ ఇంటి వద్ద కాల్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన నివాసం ఉంటున్న ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో గల గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ వద్దకు మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఘటన అనంతరం దుండగులు బైక్‌పై వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డ్‌ అయ్యాయి.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా కాల్పులు జరిపిన నిందితులు విక్కీ గుప్తా, సాగర్‌ పాల్‌ను అరెస్టు చేశారు. అనంతరం వీరికి ఆయుధాలు సరఫరా చేశారన్న ఆరోపణలపై అనూజ్‌ తపన్‌, సోను సుభాశ్‌ చందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరిని సోమవారం కోర్టులో హాజరుపర్చగా.. సోను మినహా మిగతా ముగ్గురికి న్యాయస్థానం పోలీసు కస్టడీ విధించింది. అనారోగ్యం కారణంగా సోనును కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరలేదు.

ఈ నలుగురు నిందితులు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠా సభ్యులని పోలీసులు తెలిపారు. సల్మాన్‌ ఇంటి వద్ద కాల్పులకు పాల్పడింది తామేనంటూ లారెన్స్‌ సోదరుడు అన్మోల్‌ బిష్ణోయ్‌ ఇప్పటికే సోషల్‌ మీడియాలో ప్రకటించిన సంగతి తెలిసిందే. సల్మాన్‌ ఖాన్‌పై బిష్ణోయ్‌ గ్యాంగ్‌ గతంలోనూ పలుమార్లు బెదిరింపులకు పాల్పడింది. దీంతో అప్పటి నుంచి నటుడికి వై ప్లస్‌ భద్రత కల్పిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని